గుజరాత్‌లో “ఖాకీ” సీన్ రిపీట్
గుజరాత్‌లో కరుడు నేరస్థుడిని అరెస్టు చేసి తీసుకొస్తుండగా పోలీసు బృందంపై ఆయుధాలు, కర్రలతో దాడి చోటుచేసుకుంది.

- కరుడు నేరస్థుడిని అరెస్టు చేసి తీసుకొస్తుండగా
- పోలీసు బృందంపై ఆయుధాలు, కర్రలతో దాడి
- సబ్ ఇన్‌స్పెక్టర్‌కు, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
విధాత: నటుడు కార్తీ నటించిన “ఖాకీ” సినిమా గుర్తుంది కదా! పోలీస్ అధికారి అయిన కార్తీ తన బృందంతో ఓ ఊరిలో ఆశ్రయం పొందుతున్న అరాచక దోపిడీ ముఠా సభ్యుడిని అరెస్టు చేసేందుకు వెళ్తారు. అక్కడి దొంగల ముఠా సభ్యుడు స్థానికులతో కలిసి పోలీస్ బృందంపై ఎదురుతిరుగుతారు. తుపాకులు, పదునైన ఆయుధాలు, కర్రలతో దాడి చేస్తారు. తీవ్రంగా గాయపడిన బృందం ప్రాణాలతో వెనుదిరుగుతుంది. సరిగ్గా ఇదే తరహాలో ఘటన గుజరాత్‌లో తాజాగా పోలీసు బృందానికి ఎదురైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. అల్లర్లు, దోపిడి, దాడులు ఇలా అనేక కేసుల్లో నిందితుడు, కరుడు గట్టిన నేరస్థుడు జలసింహ జాలా అనే వ్యక్తి కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని తన స్వగ్రామం జింజువాడలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం సబ్ ఇన్‌స్పెక్టర్ కేసీ దంగర్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ గ్రామానికి చేరుకున్నారు. జాలా క్రికెట్ ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. జింజువాడ పోలీస్ స్టేషన్‌కు ప్రైవేట్ కారులో జలసింహ జాలాతో తిరిగి వస్తున్నారు.
జాలా సహచరులలో ఒకడు అతనిని విడిపించడానికి ఒక గుంపును సేకరించాడు. పోలీసు బృందంపై గుంపుతో పదునైన ఆయుధాలు, కర్రలతో దాడి దాడి చేయించాడు. ఈ ఘటనలో సబ్ ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. నేరస్థుడు జలసింహ జలాను విడిపించుకొని తీసుకెళ్లారు. దొంగ ముఠా దాడిలో గాయపడిన ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుళ్లను అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
“పారిపోయిన జాలాతోపాటు పోలీసు బృందంపై దాడి చేసిన గుంపులోని వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశాం. జింజువాడ నివాసి జాలా భయంకరమైన నేరస్థుడు. పటాన్ పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయినందున, జింజువాడ పోలీసుల సాయం తీసుకుంటున్నాం” అని డిప్యూటీ ఎస్పీ తెలిపారు.