బ్లాక్ మెయిల్ చేస్తున్నదని మోడ‌ల్ కాల్చివేత‌

హర్యానా గురుగ్రామ్‌లోని ఓ హోట‌ల్‌లో మోడ‌ల్‌ను కాల్చి చంపారు. మృతురాలిని పంజాబ్‌కు చెందిన మాజీ మోడల్ దివ్య పహుజాగా గుర్తించారు.

  • Publish Date - January 4, 2024 / 09:02 AM IST
  • గ‌ది నుంచి కారు వ‌ర‌కు మృత‌దేహం ఈడ్చికొచ్చి
  • ఈ హ‌త్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు


విధాత‌: హర్యానా గురుగ్రామ్‌లోని ఓ హోట‌ల్‌లో మోడ‌ల్‌ను కాల్చి చంపారు. మృతురాలిని పంజాబ్‌కు చెందిన మాజీ మోడల్ దివ్య పహుజాగా గుర్తించారు. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో హత్య జరిగిన హోటల్ యజమాని అభిజీత్ సింగ్ ప్ర‌ధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. హోట‌ల్‌లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. నిందితులు మృతదేహాన్ని హోటల్ గ‌ది నుంచి కారు వ‌ద్ద‌కు ఈడ్చుకొచ్చిన‌ట్టు ఫుటేజీలో రికార్డ‌యిన‌ట్టు గుర్తించారు.


పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. త‌మ కుమార్తె దివ్య ప‌హుజా (27) ఒక హోటల్ యజమాని అభిజీత్ అనే వ్యక్తితో కలిసి వెళ్లినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నాటి నుంచి క‌నిపించ‌కుండా పోయిన‌ట్టు ఫిర్యాదు చేశారు. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించ‌గా నేరం బ‌య‌ట‌ప‌డింద‌ని పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ముఖేష్ కుమార్ బుధవారం తెలిపారు.


దివ్య తన అసభ్య చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేసిన కారణంగా హోటల్ యజమాని కాల్చి చంపాడనే ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు అభిజీత్ సింగ్‌తోపాటు మరో ఇద్దరు హేమ్‌రాజ్, ఓంప్రకాష్‌ను గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ బుధవారం అరెస్టు చేసింది. గురుగ్రామ్‌లోని పోలీస్ స్టేషన్ సెక్టార్-14లో వివిధ సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు జరుపుతున్నారు.