Cabinet | మోదీ ఎన్నికల క్యాబినెట్‌? కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు!

Cabinet | ఏడుగురికి చోటు కల్పించే అవకాశం అర్థరాత్రి మోదీ, షా, నడ్డా సమావేశం కీలక భేటీతో జోరుగా ఊహాగానాలు పార్టీలోనూ వ్యవస్థాగత మార్పులు? నాలుగు రాష్ట్రాల్లో కొత్త స్టేట్‌ చీఫ్‌లు! సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ కసరత్తు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంలో మార్పులు చోటుచేసుకోనున్నాయా? ఎన్నికలకు అనుగుణంగా మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్‌షా, పార్టీ చీఫ్‌ నడ్డా, పార్టీ ప్రధాన […]

Cabinet | మోదీ ఎన్నికల క్యాబినెట్‌? కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు!

Cabinet |

  • ఏడుగురికి చోటు కల్పించే అవకాశం
  • అర్థరాత్రి మోదీ, షా, నడ్డా సమావేశం
  • కీలక భేటీతో జోరుగా ఊహాగానాలు
  • పార్టీలోనూ వ్యవస్థాగత మార్పులు?
  • నాలుగు రాష్ట్రాల్లో కొత్త స్టేట్‌ చీఫ్‌లు!
  • సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ కసరత్తు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంలో మార్పులు చోటుచేసుకోనున్నాయా? ఎన్నికలకు అనుగుణంగా మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్‌షా, పార్టీ చీఫ్‌ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సమావేశమయ్యారు.

ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధత అంశాలపై ప్రధానంగా చర్చించారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, నలుగురు కార్యదర్శులను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాబోయే కీలక ఎన్నికల నేపథ్యంలో చేయాల్సిన మార్పులపై ప్రధానికి కీలక నేతలు వివరించారని సమాచారం. ఉత్తరప్రదేశ్‌ నుంచి నలుగురు, ఎన్నికలు జరుగబోయే మధ్యప్రదేశ్‌ నుంచి ఒకరు, రాజస్థాన్‌ నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఇద్దరు పార్టీ నేతలను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. క్యాబినెట్‌తోపాటు.. పార్టీలోనూ సంస్థాగత మార్పులు చోటు చేసుకుంటాయని సమాచారం.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లలో ప్రధాన మార్పులు చేస్తారని తెలుస్తున్నది. కర్ణాటకలో అవమానకర ఓటమి నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పార్టీ పెద్దలు భావించినట్టు తెలుస్తున్నది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అయితే.. ఇక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి తీవ్ర సవాళ్లను బీజేపీ ఎదుర్కొంటున్నది.

రాజస్థాన్‌ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో వాటిని క్యాష్‌ చేసుకునే పద్ధతిలో వ్యవహరించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అదే సమయంలో రాజస్థాన్‌ బీజేపీలోనూ అంతర్గత కలహాలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో వీటిని కూడా బీజేపీ అధిగమించాల్సి ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా వ్యవస్థాగత మార్పులు అనివార్యమని చెబుతున్నారు.

జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి రానున్న ఎన్నికలు పెను సవాలుగానే ఉన్నాయి. ప్రత్యేకించి విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మళ్లీ అధికారం చేపట్టాలంటే కొత్త వ్యూహాలు అవసరమన్న చర్చ బీజేపీ కేంద్ర నాయకత్వంలో జరుగుతున్నదని సమాచారం