మోదీ మెడిసిన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ ముగిసిపోయింది

రాబోయే వంద రోజులు పార్టీ కోసం కష్టపడాలని పార్టీ కార్యకర్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మోదీ మెడిసిన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ ముగిసిపోయింది
  • వంద రోజులు కష్టపడండి.. కేంద్రంలో మన నేతృత్వంలో ప్రభుత్వం
  • మోదీది డబుల్‌ ఇంజిన్‌ కాదు.. అదాని – ప్రధాని ప్రభుత్వం
  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

నాగపూర్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రానున్న వంద రోజులు కష్టపడి పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాగపూర్‌ సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. రాబోయే వంద రోజులు పార్టీకి, దేశానికి అత్యంత కీలకమని చెప్పారు. ‘కాంగ్రెస్‌ పార్టీకోసం పనిచేసేందుకు సెలవు తీసుకుంటున్నానని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. మీరు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుంది’ అని అన్నారు.


ప్రతి ఔషధానికి ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందన్న రేవంత్‌రెడ్డి.. మోదీ మెడిసిన్‌ కూడా ఇకపై దేశంలో పనిచేయబోదని చెప్పారు. బీజేపీ తరచూ చెప్పే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ గురించి ప్రస్తావిస్తూ.. నిజానికి అది అదాని-ప్రధాని ప్రభుత్వమని విమర్శించారు. రాహుల్‌ గాంధీ లోక్‌సభలో అదానీ గురించి మాట్లాడిన నాడు అదానీ ఇంజిన్‌కు సమస్య తలెత్తి, షెడ్డుకు తీసుకుపోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రధానికి కూడా త్వరలో అదే గతి పడుతుందని స్పష్టం చేశారు.