మూడో రోజూ లెక్కిస్తే మూడు వందల కోట్లపైనే!
ఒడిశాలోని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల్లో పట్టుబడిన సొమ్మును పూర్తిగా లెక్కిస్తే 300 కోట్లు దాటే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

176 సంచుల్లో నగదు కట్టలు..
మిషన్లు పెట్టి లెక్కకట్టిస్తున్నా అంతులేదు..
300 కోట్లు దాటనున్న నగదు?
ఒడిశాలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు నివాసాలలో స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడం అధికారుల వల్ల కావడం లేదు. శుక్రవారం నుంచి నగదు లెక్కించే పని కొనసాగుతున్నది. ఆదివారం కల్లా ఎట్టిపరిస్థితుల్లో లెక్క తేల్చాలనే పట్టుదలతో ఆదాయం పన్ను అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకుకోసం అదనంగా సిబ్బందిని నియమించడంతోపాటు.. మరిన్ని నగదు లెక్కింపు యంత్రాలను తెప్పించారు. తమకు మొత్తం 176 సంచుల్లో నగదు లభ్యమైందని, అందులో ఇప్పటి వరకూ 140 సంచుల్లోని నోట్లను లెక్కించామని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ భగత్ బెహెరా ఒక ఆంగ్ల వార్తా సంస్థకు చెప్పారు. ఇందుకోసం మూడు బ్యాంకుల నుంచి 50 మంది అధికారులను తెప్పించామని, నగదును లెక్కించే 40 యంత్రాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి మళ్లీ సాధారణ బ్యాంకు సేవల్లో నిమగ్నం కావాల్సి ఉన్నందున, నగదు లెక్కింపు మిషన్లను మళ్లీ బ్యాంకులకు పంపాల్సి ఉన్నందున ఆదివారం ఏ సమయానికైనా నోట్ల లెక్కింపును ముగించేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ధీరజ్ సాహు నివాసాల్లో శుక్రవారం నాటి ఆదాయం పన్ను శాఖ అధికారుల సోదాల్లో లభ్యమైన సొమ్ము మొత్తం 300 కోట్లు దాటిపోయే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఒక సింగిల్ ఆపరేషన్‌లో ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడటం మునుపెన్నడూ లేదని తెలిపారు. ఇంకా లెక్కించాల్సిన సొమ్ము చాలా ఉండటంతో మరింత మంది సిబ్బందిని, యంత్రాలను అధికారులు తెప్పించారు. నగదు లెక్కిపులో యంత్రాలు మొరాయిస్తే వెంటనే సరిచేసేందుకు టెక్నికల్ ఇంజినీర్లను సైతం అందుబాటులో ఉంచామని భగత్ బెహెరా చెప్పారు.
ధీరజ్ సాహు కుటుంబం ఒడిశాలోని అతిపెద్ద ఆల్కహాల్ తయారీ వ్యాపారంలో ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఫ్యాక్టరీలు ఈ కుటుంబానికి ఉన్నాయి. సాహు నివాసాల్లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడిన ఉదంతంపై వ్యాఖ్యానించేందుకు కాంగ్రెస్ ఇష్టపడటం లేదు. ధీరజ్‌సాహు వ్యాపారాలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. ఈ విషయంలో ఆయనే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.