Bandi Sanjay | మీకు చేతగాక.. కేంద్రాన్ని బదనాం చేస్తారా?: ఎంపీ బండి సంజయ్

Bandi Sanjay పంట నష్టంపై కేంద్ర బృందానికి వివరాలెందుకు ఇవ్వలేదు? ఎన్డీఆర్ఎఫ్ కింద సాయం చేసిన 3 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదు? ఆ నిధుల ఖర్చుపై వివరాలను ప్రకటించే దమ్ముందా? యాసంగి వరద సాయం ఏమైంది? రైతులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నవా?… ప్రతిసారి యాచించాలా? ఫసల్ బీమా స్కీంను విమర్శిస్తున్న మీరు… 9 ఏళ్లుగా సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు? రైతు బీమా కోసం ఇన్సూరెన్స్ సంస్థలకు ఎన్ని నిధులిచ్చారు? చనిపోయిన కుటుంబాలకు ఎంత […]

Bandi Sanjay | మీకు చేతగాక.. కేంద్రాన్ని బదనాం చేస్తారా?: ఎంపీ బండి సంజయ్

Bandi Sanjay

  • పంట నష్టంపై కేంద్ర బృందానికి వివరాలెందుకు ఇవ్వలేదు?
  • ఎన్డీఆర్ఎఫ్ కింద సాయం చేసిన 3 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదు?
  • ఆ నిధుల ఖర్చుపై వివరాలను ప్రకటించే దమ్ముందా?
  • యాసంగి వరద సాయం ఏమైంది?
  • రైతులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నవా?… ప్రతిసారి యాచించాలా?
  • ఫసల్ బీమా స్కీంను విమర్శిస్తున్న మీరు…
  • 9 ఏళ్లుగా సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు?
  • రైతు బీమా కోసం ఇన్సూరెన్స్ సంస్థలకు ఎన్ని నిధులిచ్చారు?
  • చనిపోయిన కుటుంబాలకు ఎంత సాయం చేశారు?
  • తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?
  • ఆర్టీసీ విలీనాన్ని స్వాగతిస్తున్నాం…
  • విలీనం పేరుతో కార్మికులకు అన్యాయం చేసేందుకు కేసీఆర్ కుట్ర
  • గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి బీజేపీని బదనాం చేయాలనుకుంటారా?
  • రుణమాఫీ ఎన్నికల స్టంట్… 4 ఏళ్లుగా ఎందుకు అమలు చేయలేదు?
  • ఒక్కో ఎకరాకు మోదీ ప్రభుత్వం 3‌0 వేల సాయం అందిస్తోంది
  • రైతుకు బీఆర్ఎస్ ఎంత సాయం చేస్తుందో చెప్పాలి?

విధాత: భారీ వర్షాలు, అకాల వరదలతో 9 ఏళ్లుగా తెలంగాణ రైతాంగం నష్టపోతుంటే పైసా సాయం చేయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేయడమేంటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

గత 8 ఏళ్లలో కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింద దాదాపు 3 వేల కోట్ల నిధులు విడుదల చేస్తే ఇప్పటి వరకు సగానికిపైగా ఖర్చు చేయకుండా దారి మళ్లించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆ నిధులతో ఎంత మంది రైతులకు సాయం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన బండి సజంయ్ వరద బాధిత రైతులను, ప్రజలను పరామర్శించారు.

పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రష్ణారెడ్డితో పాటు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి కేశవపట్నంలో గండిపడ్డ కల్వల ప్రాజెక్టుతోపాటును వీణవంక మండలంలోని కనపర్తి గ్రామ శివారులో దెబ్బతిన్న పూర్తిగా కోతకు గురైన రోడ్డును, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఫసల్ బీమా పథకంపై వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన విమర్శలనూ బండి సంజయ్ తిప్పికొట్టారు.

ఫసల్ బీమా పథకం బాగాలేకుంటే… 9 ఏళ్లుగా సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారని నిలదీశారు. ఫసల్ బీమా స్కీం కోసం ఇన్సూరెన్స్ సంస్థలకు కేటాయించిన నిధులకంటే.. రైతులకు చేసిన సాయం తక్కువని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం..రైతు బీమా పథకం విషయంలో చేసిందేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ కు దమ్ముంటే.. రైతు బీమా అమలు కోసం ఇప్పటి వరకు బీమా కంపెనీలకు కేటాయించిన నిధులెన్ని? ఆ పథకం ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలకు ఎంత సాయం అందించారనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనను బీజేపీ స్వాగతిస్తోందని చెప్పిన బండి సంజయ్ కుమార్… ఈ విషయంలో గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి బీజేపీని బదనాం చేసే నీచమైన కుట్రలకు మానుకోవాలని సూచించారు. ‘‘ఆగమేఘాలపై బిల్లును పంపి సంతకం చేయమంటే ఎలా? ఆ బిల్లులో ఏమైనా లోపాలున్నాయా? న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయా? కార్మికులకు పూర్తిగా న్యాయం జరగాలంటే ఏం చేయాలి?’’అనే దానిపై గవర్నర్ పరిశీలించే సమయం ఇవ్వకుండా రబ్బర్ స్టాంప్ లా సంతకం పెట్టమంటే ఎలా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా విషయానికొస్తే యాసంగిలో మూడుసార్లు వడగళ్ల వానలు పడ్డయ్. ఈ వానా కాలంలో వారం పది రోజులపాటు భారీ వర్షాలు పడటంతో వేలాది ఎకరాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దెబ్బమీద దెబ్బ పడి రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నరు. పంట వేసుకోవడానికి కూడా చేతిల పైసల్లేవు.

రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు లోన్లు ఇస్తలేవు. దేవుడిపైనే భారం వేసి చేతులెత్తుస్తున్నరు. అయినా సీఎంకు మాత్రం కనికరం లేదు. పైకి మాత్రం మాది కిసాన్ సర్కార్ అని గొప్పలు చెబుతున్నడు. మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అపార నష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు చెబుతున్నారు.

దెబ్బతిన్న రోడ్ల, కల్వర్టుల వివరాలు ఇంకా రాలేదని, కూలిపోయిన ఇండ్లు, పశు నష్టం లెక్కలివ్వలేదన్నారు. 50 ఏళ్ల నాటి కల్వల ప్రాజెక్టు ఇప్పటికే 3సార్లు తెగిపోయిందని, అయినా పూర్తిస్థాయి మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇంతవరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వరదల నష్టంపై నివేదికలే పంపలేదని, నిధులెప్పుడు వచ్చేది? ఎప్పుడు మరమ్మత్తులు జరిగేది? రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితని, సర్కార్ నిర్లక్ష్యంవల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని బండి విమర్శించారు.

భారీ వర్షాలతో కరీంనగర్ పార్లమెంట్ పరిధి లోనే దాపు 7 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నిజానికి ఇసుకు మేటలు వేసి ఒక్కో రైతు 50 వేలకు పైగా నష్టపోయిండు. ఇసుకమేటలను తొలగించేందుకు పైసల్లే రైతులు పంటలను వదిలేసుకునే దుస్థితి వచ్చిందన్నారు.
పంట నష్టం లెక్కలే పెద్ద బోగస్ అని, అధికారుల అంచనాలన్నీ తప్పుడు లెక్కలేనన్నారు.

పూర్తిస్థాయిలో వివరాల్లేకుండా అంచనాలు రూపొందించారని, చాలా మండలాల్లో అధికారులు అంచనాయే వేయలేదని, దీనికి కారణం సీఎం కేసీఆరే అన్నారు. కేసీఆర్ ఎంత దుర్మార్గుడంటే…. పోయినసారి పంట నష్టంపై అధికారులు వాస్తవిక అంచనాలు పంపితే… ‘‘ఇంత నష్టం జరిగటిందా? ఇన్ని డబ్బులెవడిస్తాడు? మీకు బుద్ది లేదా.. ఇంత ఎక్కువ పంట నష్టం జరిగిందని నివేదికలెట్లా పంపుతారు?’’ అంటూ వ్యవసాయ శాఖ అధికారులను తిట్టిండట‌ని, ఎవరు తక్కువ పంట నష్టం వివరాలు పంపిస్తే వాళ్లను శభాష్ అంటున్నడటని, అందుకే ఈసారి మాకెందుకొచ్చిందిలే అని తూతూ మంత్రంగా పంట నష్టం వివరాలు పంపారన్నారు.

వాస్తవానికి అధికారులు పంపిన దానికంటే మూడింతల ఎక్కువ నష్టం జరిగిందన్నారు. పోయినసారి వరదలొచ్చి నష్టపోయిన రైతులకు ఇస్తానన్న సాయానికే దిక్కులేదు. ఆనాడు రామడుగులో పర్యటించి సీఎం ఏమన్నడు? నష్టపోయిన రైతులందరికీ వారం రోజుల్లోనే 10 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించిండని, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 500 కోట్ల నష్టం జరిగిందని, 450 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు చెప్పిండని, యాసంగి పోయి వానా కాలం వచ్చే… ఇంత వరకు 25 శాతం మందికి కూడా పరిహారం ఇయ్యలేదన్నారు.

ఇప్పటి వరకు 150 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు నిన్న అసెంబ్లీలోనే వ్యవసాయ మంత్రి చెప్పిండంటే పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోండన్నారు. ప్రభుత్వం సాయం చేయకపాయే…రుణమాఫీ కాకపాయేనని, బ్యాంకోళ్లు కొత్త అప్పులియ్యకపాయేనని, వరుస నష్టాలతో రైతుల దగ్గర చేతిలో చిల్లిగవ్వ లేకపాయేనన్నారు.. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చిన అప్పులు మిత్తీల మీద మిత్తీలు ఎక్కవై తీర్చలేక గుండె పగిలి చచ్చే కాలమొచ్చేనని, అయినా కేసీఆర్ కు మనసు మాత్రం చలించడం లేదని, కేసీఆర్ తన కుటుంబం బాగుంటే చాలనుకుంటున్నడన్నారు.

ఎన్నికల ఏడాది వచ్చేసరికి ఓట్ల కోసం ప్రతి ఎకరాకు 10 వేలు సాయం చేస్తా.. రుణమాఫీ చేస్తా.. అంటూ మాటలు చెప్పడమే తప్ప చేతల్లేవన్నారు. మోదీగారిని చూసైనా నేర్చుకో కేసీఆర్ అంటు, ఎరువులు, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరాకు 30 వేలకుపైగా సాయం చేస్తున్నడు. రైతులు పంట నష్టపోయినప్పుడల్లా బాధ పడకూడదు. ఎవరి వద్దా చేయి చాపి అడగకూడదనే ఉద్దేశంతోనే ఫసల్ బీమా పథకం తీసుకొచ్చి దేశమంతా రైతులను ఆదుకుంటున్నడు. ఇయాళ తెలంగాణలో కూడా ఫసల్ బీమా పథకాన్ని నువ్వు అమలు చేసి ఉంటే రైతులకు ఈ గోస ఉండేది కాదు కదా? తక్షణ సాయం అందేది కదా? అంటూ బండి సంజయ్ అన్నారు.

నిన్న అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి ఫసల్ భీమా కోసం 2 వేల 415 కోట్లు బీమా కంపెనీలకు కడితే 1893 కోట్లు మాత్రమే రైతులకు సాయం అందించాయని చెబుతున్నాడు. అందుకే ఫసల్ బీమా పథకం నుండి తొలగిపోయినట్లు చెప్పిండు.. సిగ్గుండాలే… ఫసల్ బీమా పథకం నచ్చకపోతే… రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా ఏం పీకుతోంది.

సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలే… 9 ఏళ్లు నిద్రపోయి ఇప్పుడు కొత్త పథకం తెస్తామని ప్రకటించడానికి మీకు సిగ్గన్పించడం లేదా? నేనడుగుతున్నా… ఫసల్ బీమా కోసం బీమా కంపెనీలకు ఎక్కువ పైసలు కడితే తక్కువ సాయం అందిందని చెబుతున్నరు కదా…. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా కోసం ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు బీమా కంపెనీలకు చెల్లించింది? వాళ్లు చనిపోయిన రైతులకు ఎంత పరిహారం చెల్లించారో కేసీఆర్ కు దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

ఇప్పటికే ఆత్మహత్యల్లో తెలంగాణలో అగ్రస్థానంలో ఉందని. నీ దరిద్రపు పాలనవల్ల గత నాలుగేళ్లలోనే 70 వేల మందికిపైగా రైతులు చనిపోయిండ్రు. ఇది నా లెక్కకాదు.. నీ రైతు బీమా లెక్కలే. ఇగ కౌలు రైతులను పట్టించుకునే నాధుడే లేడు. వాళ్లకు పైసా సాయం చేయవు. పెట్టుబడి సాయం లేదన్నారు. చివరకు చస్తే కూడా ఆ కుటుంబానికి సాయం చేయవు. వాళ్ల చావులు రికార్డుల్లోకి కూడా ఎక్కడం లేదు. నీ దుర్మార్గపు పాలనవల్ల రైతులు, విద్యార్థులు ఇలా తెలంగాణ సమాజమంతా నష్టపోతున్నా పట్టించుకోవడం లేదు….

రైతాంగం ఇంత తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తుందన్నారు. తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టి సిగ్గులేకుండా రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నడన్నారు.. తెలంగాణలో రైతులు వర్షాలకు పంట నష్టపోతే కేంద్రం సాయం అందించడం లేదని పచ్చి అబద్దాలు చెబుతున్నడు. జాతీయ విపత్తుల కింద కేంద్రం ప్రభుత్వం నిధులిస్తే కూడా రైతులకు సాయం చేయకుండా దారి మళ్లించిన నీచుడు కేసీఆర్.

ఎన్డీఆర్ఎఫ్ కింద గత 8 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి దాదాపు 3 వేల కోట్లు సాయం చేసింది. అందులో సగం కూడా ఖర్చు చేయకుండా దారి మళ్లించిండని, ఇంకా 1555 కోట్ల 31 లక్షల రూపాయల జాతీయ విపత్తు నిధులు రాష్ట్రం వద్దే ఉన్నయని, వాటికి లెక్కలే చూపడంలేదని, సాక్షాత్తు కాగ్ నివేదికిచ్చిందని, వీటికి సమాధానం చెప్పకుండా కేంద్రంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నరని బండి విమర్శించారు. ఫసల్ బీమా అమలు చేయట, ప్రకృతి వైపరీత్యాల సహాయనిధిని పంపిస్తే రైతులను ఆదుకోక కేసీఆర్ రైతులకు నష్టం చేస్తున్నారన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులతో పంట నష్టపోయిన రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టినవో లెక్కలు చెప్పే దమ్ముందా? అంటు కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎన్నికలొస్తుంటే రుణమాఫీ చేస్తానంటూ రైతులను మళ్లీ మాయ చేస్తున్నడు. రుణమాఫీ అమలు కావాలంటే 20 వేల కోట్ల రూపాయలు కావాలే. సర్కార్ దగ్గర నయాపైసా లేదు. జీతాలే సక్రమంగా ఇవ్వలేక పోతున్నడు? అందుకే ఉన్న ఆస్తులన్నీ అమ్మి పారేసి తెలంగాణను కుదవ పెట్టే పనిలో ఉన్నడు.

గడువు ముగియక ముందే మద్యం టెండర్లు పిలిచి వేల కోట్లు పోగేసేకుని రాష్ట్రాన్ని మందులో ముంచే పనిలో ఉన్నడు. ఎందుకంటే ఎన్నికలు కదా… ఎన్నికల తాయిలాల పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేసి గెలవాలనుకుంటున్నడని బండి అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలి. పంట నష్టపోయిన ప్రతి రైతులకు ఎకరాకు 20 వేల చొప్పున సాయం చేయాలి. యుద్ద ప్రాతిపదికన సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రకటించాలి.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు…. ఈ బిల్లును స్వాగతిస్తున్నాం. అయితే కార్మికులకు పూర్తిగా న్యాయం చేయాలన్నదే గవర్నర్ అభిమతం. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బిల్లుపై లీగల్ అభిప్రాయాలను తీసుకుంటున్నారు. దీనిపై రాద్దాంతం చేయడం తగదన్నారు. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి బీజేపీని బదనాం చేయాలనే కుట్రలు బీఆర్ఎస్ నేతలు మానుకోవాలన్నారు.

ఎన్నికలొస్తున్నయని తెలిసి కార్మికులను మభ్యపెట్టేందుకు లోపాలతో బిల్లును పంపితే రేపు న్యాయపరంగా ఇబ్బందులు ఎదురైతే బాధ్యత ఎవరు వహిస్తారు? మళ్లీ అప్పుడు గవర్నర్ ను బదనాం చేద్దామనుకుంటున్నారా? సర్కార్ కు చేతనైతే అసెంబ్లీ సమావేశాలను పొడిగించుకుని బిల్లును ఆమోదింపజేసుకోవాలన్నారు.