Uttam Kumar Reddy | అప్పుల్లో.. అవినీతిలో తెలంగాణ నెంబర్ వన్: ఎంపీ ఉత్తమ్
ముందస్తు అభ్యర్థులతో బీఆరెస్ మునగనుంది 70 సీట్లతో కాంగ్రెస్‌దే అధికారం Uttam Kumar Reddy | విధాత, సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశంలో అప్పుల్లో, అవినీతిలో నెంబర్ వన్‌గా ఉందని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమనేతగా ప్రజలు ఆయనకు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ప్రజలను ఆగమాగం చేసి అందరిని అప్పుల్లో, అవినీతిలో ముంచేశారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందుకు […]

- ముందస్తు అభ్యర్థులతో బీఆరెస్ మునగనుంది
- 70 సీట్లతో కాంగ్రెస్‌దే అధికారం
Uttam Kumar Reddy |
విధాత, సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశంలో అప్పుల్లో, అవినీతిలో నెంబర్ వన్‌గా ఉందని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమనేతగా ప్రజలు ఆయనకు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ప్రజలను ఆగమాగం చేసి అందరిని అప్పుల్లో, అవినీతిలో ముంచేశారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందుకు 69వేల కోట్లున్న అప్పు ఇప్పుడు నాలుగు లక్షల కోట్లకు చేరుకుందన్నారు. తలసరి అప్పు 25వేల నుంచి 1లక్ష 20వేలకు చేరిందన్నారు.
తలసరి అప్పులో, తలసరి అవినీతిలో, బోగస్ హామీల్లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా మారిందన్నారు. అధికార బీఆరెస్ పార్టీ ఎమ్మెల్యేలు 119 నియోజకవర్గాలను తమ అవినీతి సామ్రాజ్యాలుగా మార్చుకున్నారని, సొంత పార్టీ కార్యకర్తల నుంచే లంచాలు తీసుకున్నారని, దళిత బంధు పథకంలో 30శాతం అవినీతి చేశారంటూ చెప్పిన సీఎం కేసీఆర్ మళ్లీ వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారన్నారు. దళిత బంధులో 3నుండి లక్షల లంచాలను తీసుకున్నారన్నారు. సాండ్, ల్యాండ్, మైన్, వైన్‌లలో వాటాలతో బీఆరెస్ ఎమ్మెల్యేలు అక్రమ సంపాదనకు రోల్ మోడల్‌గా మారారన్నారు.
బీఆరెస్ అభ్యర్థుల ముందస్తు ప్రకటన ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలుచేయనుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70సీట్లతో అధికారంలోకి వస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేయనున్నామన్నారు. నవంబర్ 30వ తేదిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుందని, తెలంగాణ, మిజోరామ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో కాంగ్రెస్ గెలువబోతుందని, రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుకు, రాహుల్‌గాంధీ ప్రధాని కావడానికి సంకేతాలుగా నిలుస్తాయన్నారు.
సీఎం కేసీఆర్‌పై ఉమ్మడి అభ్యర్ధి ఆలోచనపై పార్టీ స్పందిస్తుందన్నారు. తాను హుజూర్‌నగర్‌లో, తన సతీమణి పద్మావతి కోదాడలో పోటీ చేయబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ త్వరగా వడపోత చేసి, ఏఐసీసీ కమిటీల ఆమోదంతో త్వరలోనే అభ్యర్థుల ప్రకటన చేయబోతుందన్నారు. బీఆరెస్ కుటుంబ పార్టీ కావడంతో వారు ఇంట్లో కూర్చుని అభ్యర్థుల జాబితా రాసుకున్నారని, కాంగ్రెస్‌లో అందరి సంప్రదింపులతోనే అభ్యర్థుల ఖరారు ఉంటుందన్నారు.
బీఆరెస్ పార్టీ గత ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు, దళిత సీఎం, నిరుద్యోగ భృతి, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, అందరికి డబుల్ బెడ్ రూమ్‌లు వంటి హామీలిచ్చి అమలులో వైఫల్యం చెందిందన్నారు. మిషన్ భగీరథకు 45వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్లానీళ్లు ఇవ్వలేక అబద్ధాలు ప్రచారం చేసుకుంటుందన్నారు. దళిత బంధు, బీసీ బంధు అంటూ పథకాలన్నింటిని తగిన బడ్జెట్ ఇవ్వకుండా నామమాత్రం చేసిందన్నారు.
అన్ని సంక్షేమ పథకాల్లోనూ లంచాలు సాధారంగా మారాయని, ఎమ్మెల్యేల అక్రమాలపై ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు, జైళ్ల పాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హాయంలో ఏం జరుగలేదన్న సీఎం కేసీఆర్ మాటలు అర్ధరహితమైని, నాగార్జున సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, విద్యుత్తు, విద్యాసంస్థలన్ని కాంగ్రెస్ హాయంలో నిర్మితమైనవన్నారు. అదంతా అభివృద్ధి కాదా అంటూ ఉత్తమ్ ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ శ్రీశైలం నుండి పోతిరెడ్డి పాడు ద్వారా 80వేల క్యూసెక్కులు, ఎత్తిపోతలతో కృష్ణా జలాలు తరలించుకుపోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులను వాడుకుని వదిలేస్తారని మోసం చేస్తారని తాను ముందే ఊహించానని, ఇప్పటికైనా కమ్యూనిస్టులకు ఎవరెంటో తెలిసొచ్చిందన్నారు. కాగా ఈ సమావేశంలో ఉత్తమ్ కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన దళిత బంధు స్కీమ్ లబ్ధిదారులతో పథకం సొమ్ములో తీసుకున్న లంచాల వివరాలను మీడియాకు వివరింపచేయడం విశేషం.