Mumbai High Court
ముంబై: తప్పుడు వార్తలు (ఫేక్ న్యూస్)ను అరికట్టే పేరుతో ఇటీవల తెచ్చిన ఇన్‌ఫార్మేషన్ టెక్నాలజీ నిబంధనలు అతిగా ఉన్నాయని ముంబై హైకోర్టు అభిప్రాయపడింది. అల్పమైన ఒక చీమను చంపడానికి ఇంత పెద్ద సుత్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఐటీ నిబంధనల్లో సవరణలు తేవడంలోని ఔచిత్యం అర్థంకావడం లేదని జస్టిస్ గౌతం పటేల్, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనం అభిప్రాయపడింది.
ఏది తప్పుడు వార్తో, ఏది కాదో నిర్ణయించే సంపూర్ణాధికారం ప్రభుత్వంలోని ఒక విభాగానికి అప్పగించడం సమంజసంగా అనిపించడం లేదని కోర్టు భావించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వం మాదిరిగా పౌరుడు కూడా భాగస్వామి అని, పౌరునికి ప్రశ్నించి సమాధానాలు కోరే ప్రాథమిక హక్కు ఉందని కోర్టు పేర్కొంది.
కొత్త ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త కునాల్ కమ్రా, ఎడిటర్సు గిల్డు, ఇండియన్ మాగజైన్సు అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. కొత్త నిబంధనలు ఏకపక్షమైనవని, రాజ్యాంగ వి రుద్ధమైనవని, పౌరుల ప్రాథమిక హక్కులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు.
ఐటీ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసే నిజనిర్ధారణ విభాగం(ఫాక్టు చెకింగ్ యూనిట్) తప్పొప్పులను ఎవరు సరిచేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ విభాగం నిర్ధారించిన దానినే పరమసత్యంగా భావించే ప్రమాదం ఉందని ఒక ఆందోళన ఉందని కోర్టు పేర్కొంది. శుక్రవారం నాడు మాగజైన్సు అసోసియేషన్ న్యాయవాది గౌతమ్ భాటియా తన వాదనలు వినిపించారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పొప్పుల నిర్ధారణకు ఇప్పటికే కొన్ని పరిమిత నియంత్రణ యంత్రాంగాలు ఉన్నాయని భాటియా చెప్పారు. ఆఫ్‌లైన్ సమాచారాన్ని వడపోయడానికి యంత్రాంగాలున్నాయని, సామాజిక మాధ్యమాల సమాచారాన్ని వడగట్టే యంత్రాంగాలు లేవని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
తప్పొప్పుల నిర్ధారణకు ఏదో ఒక యంత్రాంగం ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని ఏదో ఒక దశలో ఎవరో ఒకరు నిర్ధారించాలి. ఈ నిబంధనలు అతిగా ఉన్నాయని మీరు చేస్తున్నవాదన వాస్తవమే. చీమను చంపడానికి సుత్తితో పనిలేదు అని న్యాయమూర్తులు అన్నారు.