ముస్తాబాద్ మండలంలో ఖాళీ అవుతున్న గులాబీ పార్టీ
అది కేసీఆర్ ఇలాకా.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు

- పలువురు ముఖ్య నేతల రాజీనామా
- కేటీఆర్ సభ పెట్టిన మర్నాడే షాక్
- వారితోపాటు వెయ్యిమంది
- నేడు పొన్నం సమక్షంలో కాంగ్రెస్ లోకి
విధాత బ్యూరో, కరీంనగర్: అది కేసీఆర్ ఇలాకా.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని ముస్తాబాద్. ప్రస్తుతం ఈ మండలంలో గులాబీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మండలంలో సుమారు 80 శాతానికి పైగా బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజీనామా చేసినవారితోపాటు దాదాపు వెయ్యి మంది బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు మంగళ వారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ మేరకు ముస్తాబాద్ లోని మాతృశ్రీ గార్డెన్స్‌లో ఏర్పాట్లు జరుతున్నాయని చెబుతున్నారు.
ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరై వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు వారిని దిశా నిర్దేశం చేస్తూ.. ‘మూడు ఫీట్లు లేనోడు, బీఆర్ఎస్ ను 100 ఫీట్లలోతు తొక్కేస్తడట’.. వానపాములు సైతం నాగుపాములై బుసకొడతాయ్.. అంటూ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. మరుసటి రోజే కేసీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్ బీటలు వారింది. ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య, మొర్రాపూర్ సర్పంచ్ దేవేందర్, అవునూర్ సర్పంచ్ బద్ది కల్యాణి భాను, వెంకట్రావు పల్లె సర్పంచ్ లక్ష్మణ్, మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు కిషన్ రావు, మాజీ జడ్పీటీసీ యాదగిరి గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అంజన్ రావు, సురభి సురేందర్ రావు, సీనియర్ నేతలు అన్నమనేని సుధాకర్ రావు, నారాయణ రావు, ధర్మేంధర్, మహిపాల్ తదితరులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీలో పనికిరాని వాళ్ళ పెత్తనం పెరిగిపోయిందని, పార్టీ కోసం పనిచేసిన నేతల పట్ల చిన్నచూపు చూశారని నరసయ్య ఆరోపించా రు. అణచివేత విధానాలు మంచివి కావ న్నారు. ఐదేళ్లుగా జడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్నా, పేద ప్రజలకు న్యాయం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలు ప్రస్తావించేందుకు కేటీఆర్ కు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందన లేదన్నారు. ముందు ఇంటిని, తరువాత ఊరును, ఆపై నియోజకవర్గాన్ని చక్కబెట్టుకోవాలని కేటీఆర్ కు చురకలేశారు.