Mynampally | కాంగ్రెస్‌లోకి మైనంపల్లి..? రోహిత్‌కు టికెట్ ఖరారు!

Mynampally | కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ మారనున్న రాజకీయ సమీకరణలు విధాత, మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి షాక్ ఇవ్వనున్నారు. త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆయన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా, అక్కడ ఇమడలేకపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏఐసీసీ, పీసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ […]

  • Publish Date - September 8, 2023 / 06:43 AM IST

Mynampally |

  • కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్
  • మారనున్న రాజకీయ సమీకరణలు

విధాత, మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి షాక్ ఇవ్వనున్నారు. త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆయన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా, అక్కడ ఇమడలేకపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏఐసీసీ, పీసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలతో మైనంపల్లి ఇదివరకే సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. మెదక్ నియోజక వర్గం నుంచి మైనంపల్లి హన్మంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో మెదక్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో చర్చించి మైనంపల్లి నిర్ణయం తీసుకోనున్నారు.

రామాయంపేట నుంచి రాజకీయ ప్రస్థానం

మెదక్ జిల్లాలో రద్దయిన రామాయంపేట నియోజక వర్గం నుంచి మైనంపల్లి హన్మంతరావు రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2004లో జరిగిన ఎన్నికల్లో మైనంపల్లి సతీమణి వాణి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

అనంతరం జరిగిన పరిణామాలలో ఎమ్మెల్యే పదవికి పద్మా దేవేందర్ రెడ్డి రాజీనామా చేయడం, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పై 10 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.

తదనంతరం 2009 లో డీ లిమిటేషన్ లో భాగంగా రామాయంపేట నియోజకవర్గం రద్దయ్యింది. రామాయంపేట, చిన్న శంకరం పెట్, మెదక్ మండలం పూర్తిస్థాయిలో మెదక్ నియోజకవర్గంలో కలిసిపోయాయి. దీంతో మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి టీడీపీ.. తెరాస పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ తో పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి శశిధర్ రెడ్డి పై 19 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కని పద్మా దేవేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 27 వేల ఓట్లు సాధించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో మైనంపల్లి ప్రభావం

ఉమ్మడి మెదక్ జిల్లాలో మైనంపల్లి హన్మంతరావు ప్రభావం ఉంటుంది. టిడిపి అధికారం లో ఉన్నప్పుడు ఆ పార్టీ మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, మెదక్ ఎమ్మెల్యే గా కొనసాగారు. ప్రస్తుతం మల్కాజిగిరి తెరాస ఎమ్మెల్యేగా మైనంపల్లి హన్మంతరావు కొనసాగుతున్నారు.

టీడీపీలో ఉన్న క్యాడర్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 నియోజక వర్గాల్లో మైనంపల్లి ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి గా పని చేసిన దామోదర్ రాజనర్సింహతో మంచి సంబంధాలు ఉన్న మైనంపల్లి రాకను కాంగ్రెస్ లో ఎవరూ కాదనకపోవడం కలిసి వచ్చే అంశం.

17న ముహూర్తం..?

మైనంపల్లి హన్మంతరావు ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరికతో మెదక్ నియోజక వర్గంలో రాజకీయంగా పెను మార్పులు రానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాపితంగా మైనంపల్లి ప్రభావం ఉండనుంది.