Nalgonda
విధాత: అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుండి తండ్రి కుందూరు జానారెడ్డి వారసుడిగా ఎన్నికల బరిలోకి నిలిచేందుకు సిద్ధమైన కుందూరు జయవీర్ రెడ్డి జనంలో పట్టు కోసం ప్రయత్నాలు వేగవంతం చేశారు. రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో జయవీర్ రెడ్డి నియోజకవర్గం లోని పలు గ్రామాలలో పర్యటించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తాజాగా గిరిజన చైతన్య యాత్ర పేరుతో నియోజకవర్గంలోని తండాలు, గ్రామాల ప్రజల మధ్యకు వెళ్తున్నారు. తన తండ్రి జానారెడ్డి సాధించిన ఘనవిజయాలలో గిరిజనుల ఓటు బ్యాంకు కీలకంగా ఉన్న నేపథ్యంలో మళ్లీ వారి ఆదరణ పొందేందుకు జయవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్రతో తండాల చెంతకు చేరుతున్నారు.
గిరిజనులను ప్రసన్నం చేసుకునే వారి ఆశీర్వాదం కోసం ఆరాట పడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, తదుపరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో జానారెడ్డి వరుస ఓటమి పాలవ్వడంతో నియోజకవర్గంలో రాజకీయంగా జానా హవాకు ఎదురు దెబ్బ తగిలింది. గత రెండు ఎన్నికల్లో వివిధ కారణాలతో తమకు దూరమైన గిరిజనుల ఆదరణ మళ్లీ సంపాదిస్తేనే వచ్చే ఎన్నికల్లో విజయాన్ని అందుకుంటామన్న ఆలోచనతో జానా వారసుడు జయవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు.
బుధవారం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండలో గిరిజన చైతన్య యాత్ర ను కుందూరు జయవీర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి, తన తండ్రి కుందూరు జానారెడ్డి హయాంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి గిరిజన తండాకు రోడ్లు, విద్యుత్ తాగునీరు, సాగునీరు అందించిన ఘనత జానారెడ్డి కే దక్కిందని గుర్తు చేశారు.
జానా వారసుడిగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు, గిరిజనులు నన్ను ఆశీర్వదించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. గిరిజనుల పోడు భూముల పట్టాల సమస్యలను, తండాల లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి రానున్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తానన్నారు. తన పాదయాత్రలో భాగంగా జయవీర్ రెడ్డి మొదటి రోజు జంగ్ రాం తండా, ఉట్లపల్లి , ఎర్ర చెరువు తండా , కేకేతండా, బాసోనిభావి తండా మీదుగా పార్టీ శ్రేణులతో, యువకులతో కలిసి కొనసాగించారు.
పెద్దవూర మండలంలో మూడు రోజులపాటు గిరిజన చైతన్య యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పీసీసీ డెలిగేట్ మెంబర్ కర్నాటి లింగారెడ్డి, పిసిసి సెక్రటరీ కొండేటి మల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, జెజె సేదయ్య బాబు, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, పీసీసీ సెక్రటరీ కొండేటి మల్లయ్య, కుందూరు వెంకట్ రెడ్డి, చింతల చంద్రా రెడ్డి, గౌని రాజా రమేష్ యాదవ్, పొదిలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.