Nalgonda | ఉదయ సముద్రంలో ‘రాజకీయ మధనం’! ఘనత కోసం కాంగ్రెస్, BRS పోటాపోటీ!

Nalgonda | Udaya Samudram విధాత: శ్రీశైలం సొరంగం ప్రాజెక్టులో భాగమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు నిర్మాణ ఘనత మాదంటే మాదే అంటూ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలకు దిగుతుండడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఉదయ సముద్రం ట్రయల్ రన్ చౌడేపల్లి శివారులోని పంపింగ్ స్టేషన్ వద్ద 16 మెగావాట్ల చొప్పున ఏర్పాటు చేసిన రెండు మోటార్ల ను నడిపించి విజయవంతంగా నిర్వహించారు. ఒక్క […]

  • Publish Date - May 5, 2023 / 12:38 AM IST

Nalgonda | Udaya Samudram

విధాత: శ్రీశైలం సొరంగం ప్రాజెక్టులో భాగమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు నిర్మాణ ఘనత మాదంటే మాదే అంటూ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలకు దిగుతుండడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఉదయ సముద్రం ట్రయల్ రన్ చౌడేపల్లి శివారులోని పంపింగ్ స్టేషన్ వద్ద 16 మెగావాట్ల చొప్పున ఏర్పాటు చేసిన రెండు మోటార్ల ను నడిపించి విజయవంతంగా నిర్వహించారు.

ఒక్క మోటార్ 450 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేయనుంది. నకిరేకల్, మునుగోడు, నల్గొండ, తుంగతుర్తి, నియోజకవర్గం పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు, 117 గ్రామాల వరకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. త్వరలో సీఎం కేసీఆర్ ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభిస్తారని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెబుతున్నారు.

ట్రయల్ రన్ సందర్భంగా ఆయన కృష్ణ జలాలకు హారతిని పట్టి ప్రాజెక్టు నిర్మాణ ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వందేనని వ్యాఖ్యానించారు. లింగయ్యకు పోటీగా స్థానిక నకిరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు దైద రవీందర్ పార్టీ శ్రేణులతో కలిసి కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతోనే ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కల నెరవేరబోతుందని స్పష్టం చేశారు.

ప్రాజెక్టు ఆలస్యం కావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమైందని, ఎన్నికల ముందు అయినా ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించడం హర్షనీయమన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ఘనతలు మావేనని, వైఫల్యాలు మీవే అంటూ పరస్పరం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చేసుకొంటున్న ఆరోపణలు జిల్లా రైతాంగంలో, ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి.

2007 నుండి సాగుతున్న పనులు

2007 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు పనులు 562 కోట్ల అంచనా వ్యయంతో మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు రీ డిజైన్ చేసి అంచనావయాన్ని సవరించి 700 కోట్లకు నిర్దేశించింది.

ఉదయ సముద్రం రిజర్వాయర్ నుండి కృష్ణా నీటిని 7.5 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్, పది కిలోమీటర్ల టన్నెల ద్వారా సర్జ్ ఫుల్, పంపింగ్ స్టేషన్లకు, అక్కడి నుండి బ్రాహ్మణ వెళ్లాంల రిజర్వాయర్లకు తరలిస్తారు. ఈ రిజర్వాయర్ లో తొలి దశలో 30% మాత్రమే నిల్వచేస్తారు.

రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలు, వాటి పరిధిలోని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నల్గొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గంల పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అలాగే 117 గ్రామాల ప్రజలకు తాగునీటి వసతి లభించనుంది.

అయితే ఇప్పటిదాకా ప్రధాన కాలువల పనులు పూర్తికాక పోవడం, డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం చేపట్టలేదు. వాటి కోసం 3851 ఎకరాల భూసేకరణకు 1500 ఎకరాల భూ సేకరణ మాత్రమే చేశారు. నిధుల కొరత ప్రాజెక్టు అసంపూర్తి పనుల పురోగతికి తీవ్ర ఆటంకంగా తయారైంది. ప్రస్తుత ట్రయల్ రన్ లక్ష్యం మేరకు తొలిదశలో అటు ఇటుగా 50,000 ఎకరాలకు కూడా నీరందడం సందేహంగానే కనిపిస్తుంది.

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉదయం సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును అసంపూర్తిగానే హడావుడిగానే ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 50,000 ఎకరాలకు నీరు అందిస్తామని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించగా ,2023 ఎన్నికల ముందు నాటికి ఆయన చెప్పిన మాటలు సాకారం అయ్యే పరిస్థితి నెలకొంది. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తయితేనే ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అప్పటిదాకా మోటార్ల నడిపినా రిజర్వాయర్ నింపడం వరకే పరిమితం కావలసి ఉంటుంది.

ఎస్‌ఎల్‌బీసీ పైనే ఉదయ సముద్రం లిఫ్ట్ భవిత

నిజానికి ఉదయ సముద్రం ప్రాజెక్టు లక్ష్యం నెరవేరాలంటే అంతకు ముందుగా శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. వైయస్సార్ ప్రభుత్వ హాయంలో 1925 కోట్ల టెండర్‌తో 2007లో మొదలైన పనులు ప్రకృతి వైపరీత్యాలు, నిధుల కేటాయింపులలో ప్రభుత్వాల నిర్లక్ష్యాలతో నత్తనడకగా సాగుతుంది. ప్రస్తుతం 43 కిలోమీటర్ల టన్నెల్ పనులకు గాను2 33 కిలోమీటర్ల పనులు పూర్తవ్వగా, మరో 10 కిలోమీటర్ల పనులు పెండింగ్ లో ఉన్నాయి.

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ప్రస్తుతం 4000 కోట్లకు చేరుకుంది. మూడు లక్షల 50 వేల ఎకరాల కు సాగునీరు, 550 గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు పనులు నేటికీ నిధుల కొరత, టీబీఎం మిషన్ల మరమ్మతులతో తీవ్ర జాప్యంతో సాగుతున్నాయి. అధికారంలోకి వస్తే కుర్చీ వేసుకుని మరి సొరంగం ప్రాజెక్టు పనులు పూర్తి చేయిస్తానన్న సీఎం కేసీఆర్ 2014 నుండి కూడా సొరంగం ప్రాజెక్టు పనులపై శీత కన్ను వేశారు. మరో 500 కోట్లు కేటాయిస్తే సొరంగం ప్రాజెక్టు పనులు పూర్తవ్వనున్నాయి.

వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసిన సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు తో పాటు, అందులో అంతర్భాగమైన ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులపై చిన్న చూపు ప్రదర్శించారు. స్వయంగా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులలో సైతం జిల్లాలో ఆలస్యంగా సాగుతున్నాయి. 2015 మే 12న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఢిల్లీ లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను రెండున్నర ఏళ్ల లో పూర్తి చేస్తామని చెప్పినా పనుల పూర్తికి మరికొన్నేళ్లు పట్టే పరిస్థితి నెలకొంది.

ఎస్ఎల్బీసీతో పాటు ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచూ ఉదయం సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తికి సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తెస్తూనేవున్నారు. బిఆర్ఎస్ కు రాజకీయంగా ప్రాజెక్టు పనుల పూర్తి అంశం కీలకంగా మారడంతో సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు పూర్తిచేసే దిశగా ఆసక్తి కనబరిచారు. అటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరాన్ని పదేపదే సీఎం కేసీఆర్ కు గుర్తు చేయడం కూడా ప్రాజెక్టు పనుల్లో కదలికకు దోహదం చేసింది.

ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల ట్రయల్ రన్ తో ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు పూర్తికానందున ప్రస్తుతం ఏఎంఆర్పి ఎత్తిపోతల ప్రాజెక్టు పైనే ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ఆధార పడాల్సి ఉంది. ఎన్నికలకు ముందుగా ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందే దిశగా బిఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

అయితే ముందు నుండి కూడా ఈ ప్రాజెక్టు మంజూరు, నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్న చొరవ నేపథ్యంలో ఆ పార్టీ కూడా ఉదయ సముద్రం లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. నల్గొండ, నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గంల్లో రానున్న ఎన్నికల్లో ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ ఘనత చివరకు ఎవరికి లబ్ధి చేకూర్చనుందో ఎన్నికల క్షేత్రంలోనే తేలనుంది.