KCR: త్వరలో.. నమస్తే ఆంధ్రప్రదేశ్‌ దినపత్రిక! అన్ని రాష్ట్రాల్లో సొంత పత్రికలు

నమస్తే తెలంగాణ యాజమాన్యం నుంచి కొత్త పత్రిక పత్రికల రిజిస్ట్రార్‌ నుంచి సర్టిఫికెట్‌ జారీ! విధాత: తెలంగాణ నుంచి వెలువడుతున్ననమస్తే తెలంగాణ (Namsthe Telangana) యాజమాన్యం నుంచి త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేకంగా పత్రిక రానున్నది. దీనికి ‘నమస్తే ఆంధ్రప్రదేశ్‌’ (Namasthe Andhra Pradesh) అనే పేరును ఖరారు చేశారు. దీనికి వార్తా పత్రికల రిజిస్ట్రార్‌ నుంచి సర్టిఫికెట్‌ కూడా జారీ అయింది. నమస్తే తెలంగాణ యాజమాన్యమే నమస్తే ఆంధ్రప్రదేశ్‌ యాజమాన్యంగా వ్యవహరించనున్నది. పత్రిక ప్రచురణ కర్తగా […]

  • By: Somu    latest    Feb 23, 2023 12:37 PM IST
KCR: త్వరలో.. నమస్తే ఆంధ్రప్రదేశ్‌ దినపత్రిక! అన్ని రాష్ట్రాల్లో సొంత పత్రికలు
  • నమస్తే తెలంగాణ యాజమాన్యం నుంచి కొత్త పత్రిక
  • పత్రికల రిజిస్ట్రార్‌ నుంచి సర్టిఫికెట్‌ జారీ!

విధాత: తెలంగాణ నుంచి వెలువడుతున్ననమస్తే తెలంగాణ (Namsthe Telangana) యాజమాన్యం నుంచి త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేకంగా పత్రిక రానున్నది. దీనికి ‘నమస్తే ఆంధ్రప్రదేశ్‌’ (Namasthe Andhra Pradesh) అనే పేరును ఖరారు చేశారు. దీనికి వార్తా పత్రికల రిజిస్ట్రార్‌ నుంచి సర్టిఫికెట్‌ కూడా జారీ అయింది.

నమస్తే తెలంగాణ యాజమాన్యమే నమస్తే ఆంధ్రప్రదేశ్‌ యాజమాన్యంగా వ్యవహరించనున్నది. పత్రిక ప్రచురణ కర్తగా నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఎడిటర్‌గా తిగుళ్ల కృష్ణమూర్తి పేర్లను సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. చిరునామాలు అన్నీ నమస్తే తెలంగాణకు సంబంధించినవే ఉండటం విశేషం.

నమస్తే తెలంగాణ అధికార పార్టీ పత్రికగా చెలామణీ అవుతున్నది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆశించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జాతీయ స్థాయికి తగినట్టుగా పార్టీ పేరు ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చి రిజిస్టర్‌ చేయించిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే క్రమంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీకి సొంత పత్రికలు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన కేసీఆర్‌.. ఆ మేరకు ఏర్పాట్లలో ఉన్నారన్న చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే మొదటిగా ‘నమస్తే ఆంధ్రప్రదేశ్‌’ త్వరలో ప్రారంభం కానున్నదని చెబుతున్నారు. అలాగే న‌మ‌స్తే ఢిల్లీ, న‌మ‌స్తే ముంబై వంటి పేర్ల‌తో ప‌త్రిక‌లను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది.