విధాత: నారా లోకేష్ (Nara Lokesh).. మెల్లమెల్లగా రాజకీయాల్లో ముదురుతున్నారు. పాదయాత్రలో అడుగుల సంఖ్య పెరిగేకొద్దీ రాటు దేలుతున్నారు. వ్యూహకర్తలు చెబుతున్నారో.. చంద్రబాబు మార్గదర్శకత్వమో.. ఆయనలో వస్తున్న పరిపక్వతో తెలియదు కానీ లౌక్యంగా ముందుకు సాగుతున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ బుధవారం ఓ సభలో మాట్లాడారు. ఆ సభకు ఎక్కువగా హాజరైంది కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. ఈ సందర్భంగా రెడ్డి సామజిక వర్గానికి చుక్కాని వంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా తన ప్రసంగంలో చేర్చుకున్న లోకేష్ (Nara Lokesh) గతంలో వైఎస్ చేసిన అభివృద్ధిని ప్రస్తావించారు.
వైఎస్ఆర్ కన్నా ముందు పాలించిన చంద్రబాబు కొన్ని పనులు ప్రారంభించి వదిలేయగా వాటిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) పూర్తి చేసారని చెబుతూ హైదరాబాద్ రింగ్ రోడ్డు,, శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Samshabad airport) వంటి వాటిని గుర్తు చేసారు. చంద్రబాబు(Nara Chandrababu) ఐటీ సెక్టార్‌ను బాగా ప్రోత్సహించగా వైఎస్ వచ్చాక చాలా ఐటి కంపెనీలకు (IT Sector) భూములు కేటాయించి మరింతగా ఆకర్షించారని చెప్పారు.
ఇంకా అప్పట్లో రాజకీయాలు హుందాగా ఉండేవని, చంద్రబాబు, వైఎస్ ఒకరిని ఒకరు గౌరవించుకునేవారని, ఏనాడూ వ్యక్తిగత దూషణలకు పోలేదని చెబుతూ వైఎస్ఆర్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకునేలా మాట్లాడారు. తమ పార్టీలోని రెడ్లు కూడా పార్టీ బలోపేతానికి కృషి చేసారని అంటూ ఇక ముందు కూడా అదే మాదిరిగా తమను సపోర్ట్ చేయాలని కోరారు. ఎన్నడూ ఇలా మాట్లాడని లోకేష్ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని చర్చ వస్తోంది.
అంతే కాకుండా రెడ్లకు జగన్ వాళ్ళ ఒనగూరిన లాభం కూడా లేదని చెబుతూ తమకు సపోర్ట్ చేస్తే మున్ముందు బాగా చూసుకుంటామని చెప్పారు. అంతే కాకుండా తమ హయాంలో ఎవరిమీదా తప్పుడు కేసులు పెట్టలేదని వివరణ ఇచ్చారు. మొత్తానికి రెడ్లకు గళం వేస్తూ వారి మద్దతు పొందడానికి లోకేష్ తాడిపత్రి లో ఓ సభను ఏర్పాటు చేసి మాట్లాడడం విశేషం.