విధాత: తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం కింద ఇచ్చిన హామీల అమలుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కేంద్రం మొండి చేయి చూపిందని పిసిసి మాజీ అధ్యక్షుడు, నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ, బీబీనగర్ ఎయిమ్స్‌లకు కేటాయింపులు లేకపోవడం విచారకరమన్నారు.
బిజెపి 9 ఏండ్ల పాలనలో ఇప్పటిదాకా బడ్జెట్లో ఎయిమ్స్‌కు వెయ్యి కోట్లు చూపించి ఇంతకాలంగా 28 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, మద్దతు ధర స్థిరీకరణ బడ్జెట్ తగ్గించారని, ఫసల్ బీమా పథకం కుదించారని ఆరోపించారు. నాలుగేళ్లుగా వ్యవసాయ బడ్జెట్ తగ్గిస్తు 5.1శాతం నుండి 3 శాతంకు తగ్గించారన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయానికి కోతలు పెట్టిందన్నారు. రైతుల ఆదాయం పెంచడం మరిచి ఎరువులు, డీజిల్ ధరలు పెంచారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఈ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తుందన్నారు. ఈ దేశ సంపదను ఆదానికి దోచిపెడుతుందన్నారు.
రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఆదాని అక్రమాలపై జేపీసీ లేదా సుప్రీంకోర్టు కమిటీ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేయగా, మోడీ పట్టించకోకపోవడం విచారకరమన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సైతం అంకెల గారడిగా ఉందన్నారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోయాయని, పార్టీలు మారాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున పోలీసులు లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని, అందులో అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే పద్ధతిని మానుకోవాలని హితవు పలికారు.