కేన్ మామ క్లాస్ బ్యాటింగ్.. మ‌రో విజయాన్ని త‌మ ఖాతాలో వేసుకున్న న్యూజిలాండ్

  • By: sn    latest    Oct 14, 2023 2:19 AM IST
కేన్ మామ క్లాస్ బ్యాటింగ్.. మ‌రో విజయాన్ని త‌మ ఖాతాలో వేసుకున్న న్యూజిలాండ్

వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో న్యూజిలాండ్ వీర‌విహారం చేస్తుంది. వ‌రుస విజ‌యాల‌తో టాప్‌లో ఉంది. శుక్ర‌వారం చెన్నై వేదిక‌గా బంగ్లాదేశ్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌గా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులే చేసింది. మొద‌టి నుండి బంగ్లా బ్యాట్స్‌మెన్స్‌ని బాగా క‌ట్ట‌డి చేసిన న్యూజిలాండ్ బౌల‌ర్స్ పెద్ద స్కోర్ సాధించ‌లేక‌పోయారు.

ముష్ఫికర్ రహామ్(74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), టెయిలెండర్ మహ్మదుల్లా(49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 నాటౌట్) పర్వాలేదనిపించ‌డంతో బంగ్లాదేశ్ ఫైటింగ్ స్కోర్ చేయ‌గ‌లిగింది.


న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్(3/49) అద్భుత‌మైన బౌన్స‌ర్స్ తో మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్డ్(2/36), మ్యాట్ హెన్రీ(2/56) రెండేసి వికెట్లు తీసారు.ఇక మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన న్యూజిలాండ్ 42.5 ఓవర్లలో కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 248 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది.

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ లో డారిల్ మిచెల్(67 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(107 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 78) క్లాస్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. ఇక ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(59 బంతుల్లో 3 ఫోర్లతో 45) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, షకీబ్ అల్ హసన్ కి చెరో వికెట్ ద‌క్కింది.


అయితే న్యూజిలాండ్ బ్యాట‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌(9) ఈ మ్యాచ్‌లో నిరాశ‌ప‌రిచాడు. గ‌త రెండు మ్యాచ్‌ల‌లో అద‌ర‌గొట్టిన ర‌చిన్ ఈ మ్యాచ్ లో స్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. చాలా రోజుల తర్వాత మ‌ళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన‌ కేన్ మామ త‌న‌ క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేన్ మామ అదే జోరును కొనసాగిస్తూ త‌న జ‌ట్టుని విజ‌య‌తీరాల‌కి చేర్చాడు. అయితే ఉక్కపోత వాతావరణంలో బ్యాటింగ్‌కు ఇబ్బంది పడిన కేన్ విలియమ్సన్ కొద్ది సేప‌టికి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిర‌గ‌గా, ఆ త‌ర్వాత క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్(16 నాటౌట్) సాయంతో డారిల్ మిచెల్ విజయలాంఛనాన్ని పూర్తి చేసి న్యూజిలాండ్ ఖాతాలో మరో విజ‌యం చేర్చాడు.