రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక నో వెయిటింగ్‌ లిస్ట్‌!

రైల్లో ప్రయాణించేవారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై వెయిటింగ్‌ లిస్టులు ఉండబోవని పేర్కొన్నది.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక నో వెయిటింగ్‌ లిస్ట్‌!

Indian Railways | భారతీయ రైల్వేల్లో పెద్ద ఎత్తున జనం ప్రయాణిస్తుంటారు. దూరు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రైల్వేను ఆశ్రయిస్తుంటారు. తక్కువ ధరతో పాటు భద్రతను దృష్టిలో పెట్టుకొని రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇందుకోసం రైల్వే టికెట్లను బుక్‌ చేసుకుంటారు. అయితే, రైళ్లలో టికెట్లకు భారీగా డిమాండ్‌ ఉంటున్నది. అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉండడంతో దాదాపు రెండు మూడు నెలల ముందుగానే టికెట్ల బుక్‌ అవుతున్నాయి. ఆ తర్వాత చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటుంది.


ఈ క్రమంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌కు ముగింపు పలుకబోతున్నది. ఇందు కోసం రూ.లక్ష కోట్లతో పెద్ద ఎత్తున్న కొత్త రైళ్లను తీసుకురావాలని నిర్ణయించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల స్థానంలో 7-8వేల కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాబోయే నాలుగైదేళ్లలో రైళ్ల కొనుగోలు కోసం టెండర్లను పిలువనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రస్తుతం ప్రతి నిత్యం 10,754 ట్రిప్పులను నడుపుతుండగా.. వెయిటింగ్‌ లిస్ట్‌ లేకుండా చూడాలంటే మరో 3వేల ట్రిప్స్‌ను పెంచాలని రైల్వేశాఖ భావిస్తున్నది.


కొవిడ్ అనంతరం రైల్వేశాఖ అదనంగా 568 ట్రిప్పులను నడుపుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఏటా 700కోట్ల మంది ప్రయాణికులు రైల్వే గమ్యస్థానాలకు చేర్చుతుండగా.. ఇది 2030 నాటికి వెయ్యి కోట్లకు చేరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తున్నది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖకు రూ.2.4లక్షలకోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. ఇందులో 70శాతం నిధులను ఖర్చు చేసినట్లు రైల్వేమంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 5-6వేల కిలోమీటర్ల కొత్త రైల్వేట్రాక్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. ఏడాదికి సగటున రోజుకు 16కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌ వేస్తున్నట్లు వివరించారు.