Nomophobia |
విధాత: ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు నోమోఫోబియా (Nomophobia) తో బాధపడుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. అయితే వారికి అసలు తాము ఆ ఫోబియాతో ఇబ్బంది పడుతున్నామని తెలియదని పేర్కొంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్, ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో చేసిన ఈ సర్వేలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి.
నోమోఫోబియా అంటే..
సింపుల్ గా చెప్పాలంటే నో మో ఫోబియాకు నో మొబైల్ ఫోబియా అని అర్థం. మనం ఫోన్‌ను వాడలేమేమో అన్న భయమే ఈ ఫోబియా ప్రధాన లక్షణం. ఎవరి స్మార్ట్ ఫోన్‌లే వారికి ప్రపంచమైన ఈ కాలంలో తాము వాటికి దూరమవుతామేమో అన్న ఆందోళన చాలా మందిలో కనిపిస్తోందని ఈ సర్వే పేర్కొంది. ఎవరు ఏ కారణాలతో ఇలా భయపడుతున్నారో చూస్తే..
ఛార్జింగ్‌దే మొదటి స్థానం
ఆశ్చర్యకరంగా మొబైల్ ఛార్జింగ్ విషయంలోనే చాలా మంది యూజర్లు భయపడుతున్నట్లు ఈ సర్వే తేల్చింది. ఏకంగా 65 శాతం మంది తమ ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుంటే నెగటివ్‌గా మారిపోతామని చెప్పారు. 28 శాతం మంది తమ ఆందోళన పెరిగిపోతుందని, స్విచాఫ్ అయిపోతుందేమోనని భయపడుతున్నట్లు తెలిపారు.
అయితే 87 శాతం మంది ఫోన్ ఛార్జ్ అయ్యే వరకు ఆగలేమని, ఛార్జింగ్‌లో ఉండగానే మొబైల్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 92 శాతం మంది ఈ బాధలు పడలేక తమ ఫోన్‌ను పవర్ సేవింగ్ మోడ్‌లోనే ఉంచుకుంటున్నట్లు తెలిపారు. తమ రోజు సెల్‌ఫోన్ తో మొదలై సెల్‌ఫోన్‌తోనే పూర్తవుతోందని 40 శాతం మంది వెల్లడించారు.
ఆందోళన, భయం, కంగారు..
తమ సెల్‌ఫోన్ ఛార్జింగ్ 20 శాతానికి పడిపోతే ప్రాణాలు పోయినట్లు ఉంటోందని 72 శాతం మంది వాపోయారు. 10 మందిలో తొమ్మిది మంది బ్యాటరీ లెవల్ 30 నుంచి 50 శాతం మధ్య ఉంటే ఆందోళన పడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఆందోళనకరంగా 50 సంవత్సరాల వయసు దాటిన వారిలో ఈ ఆందోళన ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.