దేశమంతా గుజరాత్ మోడల్.. అక్కడ మోడీ సెంటిమెంట్
విధాత: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ ముగిసింది. మొత్తం 19 జిల్లాల వ్యాప్తంగా 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 60.23 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండే ఆ రాష్ట్రంలో ఈ సారి ఆప్ ఎంట్రీతో ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల సమయంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఉన్నా, ప్రస్తుతం భూపేంద్ర పటేల్ ఉన్నా అంతా తానై మోడీ ప్రచారం చేస్తున్నారు. 27 ఏళ్లుగా […]

విధాత: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ ముగిసింది. మొత్తం 19 జిల్లాల వ్యాప్తంగా 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 60.23 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండే ఆ రాష్ట్రంలో ఈ సారి ఆప్ ఎంట్రీతో ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల సమయంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఉన్నా, ప్రస్తుతం భూపేంద్ర పటేల్ ఉన్నా అంతా తానై మోడీ ప్రచారం చేస్తున్నారు.
27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇన్నేళ్లలో ఏం చేసిందో చెప్పకుండా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధానిపై చేసిన రావణ్ వ్యాఖ్యలను మోడీ ఎన్నికల ప్రచారంలో ఉటంకిస్తూ.. ప్రజల్లో సానుభూతి కోసం యత్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు బాగా ఉన్నది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు.
అలాగే పట్టణ ఓటర్లపై నమ్మకం పెట్టుకుని, గత ఎన్నికల్లో వారి ఓట్లతోనే గట్టెక్కిన బీజేపీ ఈసారి ఆప్‌తో తమకు ప్రమాదం పొంచి ఉన్నదని భావిస్తున్నది. అందుకే ప్రధాని మోడీ అహ్మదాబాద్ సిటీలో 14 నియోజక వర్గాలను చుట్టేస్తూ 30 కిలోమీటర్లు రోడ్‌షో చేశారు. దీన్ని బట్టి బీజేపీ అధిష్టానం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎంత గుబులుగా ఉన్నదో అక్కడ ప్రచారంలో ప్రధాని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
89 నియోజక వర్గాల్లో 788 మంది అభ్యర్థుల భవితవ్యం ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేయడం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ఇచ్చాయి. దీంతో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా తో ఉన్నాయి. అయితే పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
గ్యాస్ ధరల పెంపు ను నిరసిస్తూ.. కొంతమంది ఓట్లర్లు పోలింగ్ కేంద్రాలకు గ్యాస్ సిలిండర్ లతో వచ్చి తమ నిరసన ను వ్యక్తం చేశారు. అలాగే ఆవుల పెంపకంలో తమకు ఎదురవుతున్న దుస్థితి తెలియజేయడానికి పోలింగ్ కేంద్రాలకు ఆవు, దూడతో వెళ్లారు.
రెండు దశాబ్దాలు పైగా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ తమ హయాంలో గుజరాత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అని, గుజరాత్ మోడల్ అని కేంద్రం లో అధికారం లోకి వచ్చింది. అయితే తొలి విడుత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తమ సమస్యలను తెలియజేయడానికి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. తుది విడత పోలింగ్ డిసెంబర్ 5న జరగనున్నది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.