PM Modi | నమో కాదు.. ‘మౌన’ మోదీ!

PM Modi విధాత‌: 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను మౌనమోహన్‌సింగ్‌.. బలహీన ప్రధాని అని నరేంద్రమోదీ తరచూ విమర్శిస్తుండేవారు! ఆ సమయంలోనే సిమ్లాలో నిర్వహించని ఒక సభలో మన్మోహన్‌కు మోదీ కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘యూపీఏ హయాంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల అంశాలపై ‘మౌన’మోహన్‌సింగ్‌, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు?’ అని గొప్పగా నిలదీశారు. ఒక దశాబ్దం క్రితం.. అంటే 2012లో మోదీ ఏకాకిగా మారారు. ఆఖరుకు ఆరెస్సెస్‌ […]

  • Publish Date - July 15, 2023 / 11:21 AM IST

PM Modi

విధాత‌: 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను మౌనమోహన్‌సింగ్‌.. బలహీన ప్రధాని అని నరేంద్రమోదీ తరచూ విమర్శిస్తుండేవారు! ఆ సమయంలోనే సిమ్లాలో నిర్వహించని ఒక సభలో మన్మోహన్‌కు మోదీ కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘యూపీఏ హయాంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల అంశాలపై ‘మౌన’మోహన్‌సింగ్‌, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు?’ అని గొప్పగా నిలదీశారు.

ఒక దశాబ్దం క్రితం.. అంటే 2012లో మోదీ ఏకాకిగా మారారు. ఆఖరుకు ఆరెస్సెస్‌ గొంతుక ‘పాంచజన్య’ కూడా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ పనితీరును దుయ్యబట్టింది. గుజరాత్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేతలు మాజీ ముఖ్యమంత్రి సురేశ్‌ మెహతా, కాశీరాం రాణా, గోర్ధన్‌జడాపియా, నళిన్‌భట్‌, ప్రవీణ్‌ మనైర్‌ వంటి వారు మోదీని విమర్శించారు. గుజరాత్‌ మాజీ ముక్యమంత్రి కేశూభాయ్‌పటేల్‌.. మోదీని ఖడ్గ మృగంగా అభివర్ణించారు. లంపట్‌ సంఖ్‌తో (గొప్పలు చెప్పుకొనే వారి గురించి గుజరాతీలో వాడుక పదం) జాగ్రత్త అని గుజరాత్‌ ప్రజలను అప్రమత్తం చేశారు. అంతేకాదు.. పేదలను కొట్టి, పారశ్రామికవేత్తలకు.

దోచిపెట్టే ఒక అసురుడిగా మోదీని అభివర్ణించారు.

దశాబ్దం తర్వాత చూస్తే.. అప్పుడెప్పుడో కేశూభాయ్‌ పటేల్‌ చెప్పిన మాట.. కండ్ల ముందుకు కనిపిస్తున్నది. అదానీపై హిండెన్‌బర్గ్‌ నివేదికపై కానీ, అదానీ ఆస్తుల విషయంలో కానీ చెలరేగిన వివాదాల్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా మోదీ మాట్లాడలేదు. దీనిపై పార్లమెంటులో రచ్చ జరిగినా మౌన మునిగానే ఉన్నారు తప్పించి.. నోరు మెదపలేదు. ఈ వివాదంపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. అదానీ వ్యవహారంలో ఉన్న సొమ్మంతా ప్రధాని మోదీదేనని వ్యాఖ్యానించారు.

అదాని స్కామ్‌పై ప్రపంచమంతా భారత్‌ను ప్రశ్నిస్తున్నది. దేశ పార్లమెంట్‌లో అదాని స్కామ్‌పై తీవ్ర చర్చలు జరిగాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినా.. మోదీ మౌనాన్నే ఆశ్రయించారు. నోరు విప్పటం మిత్రుని స్కామ్‌ను అంగీకరించడమే అవుతుందని మోదీ అనుకుంటున్నారేమో!

ఇదొక్కటే కాదు.. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై కొందరు రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మహిళా రెజ్లర్లు.. జంతర్ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. మహిళా రెజరర్ల పట్ల తీవ్ర అసభ్యకరంగా బ్రిజ్‌భూషణ్‌ ప్రవర్తించాడని, ఆయనను ఫెడరేషన్‌ బాధ్యతల నుంచి తొలగించి, విచారించాలనేది వారి డిమాండ్‌.

దీనిపైనా మోదీ మౌనాన్నే ఆశ్రయించారు. ఈ సమస్యపై మోదీ స్పందిస్తారని ప్రతిపక్షాలు, ప్రజలు ఆశించినా ఫలితం లేకపోయింది. మోదీ నోరు ఎవరికీ సమాధానం చెప్పలేదు. మౌనమే తన ధోరణిగా కాలం వెళ్లబుచ్చుతూ వచ్చారు. కారణం.. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకుంటే.. జాట్‌ ఓట్లు పోతాయని భయం.

మణిపూర్లో నెలల తరబడి మారణహోమం సాగుతున్నది. అక్కడ శాంతి శూన్యం. ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అమానుష చర్యలకు దిగుతున్నది. కేంద్రం చేపడుతున్న చర్యలు హింసను ప్రేరేపించేందుకు ఉపయోగపడుతున్నాయి తప్ప.. శాంతి నెలకొల్పేందుకు కాదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశ విదేశాల్లో మణిపూర్‌పై బహిరంగ ప్రకటనలు వెలువడుతున్నాయి.

మోదీ మాత్రం కిమ్మనకుండా, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మౌనాన్నే ఆశ్రయించారు. కారణం మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉన్నది. మణిపూర్ అల్లర్లకు కారణమైన మైతేయి తెగ ఆదివాసీల మద్దతు బీజేపీకి ఉన్నది. మైతేయిలు బీజేపీ ఓటు బ్యాంకు. తన ఓటు బ్యాంకును కాపాడుకొనేందుకు విభజించు పాలించు అనే పద్ధతిలో బీజేపీ విధానం ఉన్నది. అందుకే ఆ విషయంలో మోదీ పట్టించుకోకుండా ఓటు బ్యాంకును, అధికారాన్ని కాపాడుకొనటానికి మౌనమే మంచిదని దాట వేస్తున్నారు.

మరొక సమస్య చైనాతో మనకున్న సరిహద్దు సమస్య. ఇది దీర్ఘకాలంగా రెండు దేశాల మధ్య రగులుతూనే వస్తున్నది. చైనా దాని సరిహద్దును దాటి భారత్ భూభాగాన్ని ఆక్రమించుకొని, తన కబ్జాలో వుంచుకొన్నదని కొంతమంది సైనిక అధికారులు, ప్రతిపక్షాలు, మీడియా చెబుతున్నా.. మోదీ మౌనాన్నే ఆశ్రయించారు. దీనిని ఖండించడం తప్ప.. నిజాలను చూడటానికి సిద్ధపడలేదు.

చైనాతో గల సంబంధాలను చెడగొట్టు కోవడానికి మోదీ సిద్ధంగా లేరని, అందుకే దీనిపైనా మౌనాన్నే ఆశ్రయించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంకా అనేక ఇతర సమస్యలపై కూడా మోదీ గత కొంత కాలంగా మౌనమే పాటిస్తూ వస్తున్నారు. ఇది ఆయన అనుసరించే ఒక రాజకీయ ధోరణిగానే అర్థం చేసుకోవాలా? నిత్యం మీడియాతో మాట్లాడిన మన్మోహన్‌సింగ్‌ మౌన ముని అనుకోవాలా? దేనిపైనా నోరు మెదపని మోదీని మౌన ముని అనుకోవాలా.