MODI | సిగ్గుంటే రాజీనామా.. ప్రధాని మోదీకి విపక్ష నేతల డిమాండ్‌

PM MODI | అవిశ్వాస తీర్మానంపై వాడివేడి చర్చ మోదీ మౌనంపై నిలదీసిన కాంగ్రెస్‌ ఒకే భారత్‌ అంటూ 2 మణిపూర్‌లా? సీఎంను ఎందుకు తొలగించరు? చైనా చొరబాట్లపై సభలో ఏదీ చర్చ? మండిపడిన కాంగ్రెస్‌ నేత గగోయ్‌ ప్రధాని మోదీ నోరు తెరిపించేందుకే  అవిశ్వాస తీర్మానం తెచ్చామని వెల్లడి మణిపూర్‌లో ప్రధాని పర్యటనకు డిమాండ్‌ న్యూఢిల్లీ: దేశంలో అనేక సమస్యలు ఉన్నా.. నోరు తెరిచేందుకు ఇష్టపడటం లేదని ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తాయి. మణిపూర్‌ […]

MODI | సిగ్గుంటే రాజీనామా.. ప్రధాని మోదీకి విపక్ష నేతల డిమాండ్‌
PM MODI |
  • అవిశ్వాస తీర్మానంపై వాడివేడి చర్చ
  • మోదీ మౌనంపై నిలదీసిన కాంగ్రెస్‌
  • ఒకే భారత్‌ అంటూ 2 మణిపూర్‌లా?
  • సీఎంను ఎందుకు తొలగించరు?
  • చైనా చొరబాట్లపై సభలో ఏదీ చర్చ?
  • మండిపడిన కాంగ్రెస్‌ నేత గగోయ్‌
  • ప్రధాని మోదీ నోరు తెరిపించేందుకే
  • అవిశ్వాస తీర్మానం తెచ్చామని వెల్లడి
  • మణిపూర్‌లో ప్రధాని పర్యటనకు డిమాండ్‌
న్యూఢిల్లీ: దేశంలో అనేక సమస్యలు ఉన్నా.. నోరు తెరిచేందుకు ఇష్టపడటం లేదని ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తాయి. మణిపూర్‌ తగలబడిపోతున్నా ప్రధాని మాట్లాడటం లేదని, మహిళా రెజర్లు తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నా.. నోరు మెదపడం లేదని, చైనా దురాక్రమణ చేస్తున్నా.. స్పందించడం లేదని మండిపడ్డాయి.
మణిపూర్‌ హింస నేపథ్యంలో ప్రధాని నోరు తెరిపించేందుకు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం చర్చ మొదలైంది. చర్చను కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష ఉప నేత గౌరవ్‌ గగోయ్‌ ప్రారంభించారు. మణిపూర్‌లో ప్రధాని పర్యటించాలని, అఖిలపక్ష బృందాన్ని వెంటబెట్టుకుని వెళ్లాలని, ఆ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు.
వన్‌ ఇండియా అని తరచూ ఊదరగొట్టే బీజేపీ ప్రభుత్వం రెండు మణిపూర్‌లను సృష్టించిందని విమర్శించారు. 2002లో గుజరాత్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్నప్పుడు అప్పటి ప్రధాని ఏబీ వాజ్‌పేయి ఆ రాష్ట్రంలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావించిన గగోయ్‌.. మోదీ మాత్రం మణిపూర్‌లో జరుగుతున్న హింసపై మౌనాన్నే ఆశ్రయించారని మండిపడ్డారు.
మణిపూర్‌ హింసపై 80 రోజుల తర్వాత అదీ కేవలం 30 క్షణాలు మాత్రమే ప్రధాని ఎందుకు మాట్లాడారు? అని ప్రశ్నించారు. అప్పుడు కూడా మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలన్న పిలుపు ఇవ్వలేదని విమర్శించారు. మణిపూర్‌ హింస విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు.. కేంద్ర హోంశాఖ, జాతీయ భద్రతా సలహాదారు వైఫల్యాలు ఉన్నాయని, అందుకే మోదీ ఈ విషయంలో మౌనం వీడేందుకు జంకుతున్నారని చెప్పారు. అంతేకాకుండా.. ప్రధాని తన తప్పులను ఒప్పుకొనేందుకు ఇష్టపడరని అందుకే మాట్లాడటం లేదని అన్నారు.
తప్పులను ఒప్పుకొనే కంటే మౌనంగా ఉండటమే ఆయనకు ఇష్టమని విమర్శించారు. అవార్డులు గెలుచుకున్న మహిళా రెజ్లర్లు తమకు జరిగిన అన్యాయంపై వీధుల్లోకి వచ్చినా.. ప్రధాని మౌనంగానే ఉన్నారని మండిపడ్డారు. 750 మంది రైతులు నల్లచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా ప్రాణాలు కోల్పోయినా స్పందించలేదని దుయ్యబట్టారు.
‘2020లో ఢిల్లీలో ఘర్షణలు జరిగినా, ఒక విదేశీ నాయకుడు దేశంలో పర్యటించినా ఆయన మౌనంగానే ఉన్నారు. విదేశీ పర్యటన సందర్భంగా ఒక వ్యాపార వేత్తను వెంటబెట్టుకుని వెళ్లి ఆయనకు లబ్ధి కలిగించిన అంశంపై రాహుల్‌గాంధీ ప్రశ్నించినా ఆయన మౌనంగానే ఉన్నారు’ అని విమర్శించారు. ‘చైనా దురాక్రమణపై నిలదీసినా, పుల్వామాల సైనికులకు రక్షణ కల్పించాలన్న తన విజ్ఞప్తిని ప్రధాని తోసిపుచ్చారని ఆ రాష్ట్ర మాజీ గవర్నర్‌ చెప్పినా ఆయన మౌనంగానే ఉన్నారు’ అని గగోయ్‌ అన్నారు.

జనం ఇబ్బందుల్లో ఉంటే ఓట్ల వేటలో ప్రధాని

కొవిడ్‌ రెండో దశ కాలంలో ప్రజలు ఊపిరి కోసం ఇబ్బంది పడుతుంటే.. మోదీ పశ్చిమబెంగాల్‌లో ఓట్లు అడిగే పనిలో బిజీగా ఉన్నారని, మణిపూర్‌లో మహిళలు దాడులకు గురవుతుంటే.. ప్రధాని కర్ణాటకలో ఓట్లు అడిగేందుకు వెళ్లారని విమర్శించారు. దేశంకంటే రాజకీయం ఎక్కువగా భావించడం ఏ తరహా జాతీయవాదమని ప్రశ్నించారు. మోదీ నోరు తెరిపించేందుకే ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిందని గగోయ్‌ స్పష్టం చేశారు.
మణిపూర్‌లో ప్రధాని ఎందుకు పర్యటించలేదు? తన మౌనం వీడేందుకు 80 రోజులు ఎందుకు పట్టింది? ముఖ్యమంత్రిని ఎందుకు తొలగించలేదు? అని ప్రధానిని సూటిగా ప్రశ్నించారు. సంఖ్యాబలం తేల్చేందుకు తాము అవిశ్వాసం తీసుకురాలేదని, మణిపూర్‌కు న్యాయం జరగాలనే తెచ్చామని తెలిపారు. ‘దేశ నాయకుడిగా ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చి మణిపూర్‌ గురించి మాట్లాడాలనేది మా డిమాండ్‌.
కానీ.. ఆయన మాత్రం ఈ అంశంపై లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ మాట్లాడకూడదని ‘మౌన వ్రతం’ పాటిస్తున్నారు’ అని మండిపడ్డారు. అవిశ్వాసం ద్వారా ఆయన మౌనానికి భంగం కలిగించాలని మేం నిర్ణయించుకున్నాం’ అని అస్సాంకు చెందిన గగోయ్‌ తేల్చి చెప్పారు. ఎక్కడ ఎన్నికలు ఉన్నా.. విద్వేషమే బీజేపీ ప్రధాన అస్త్రంగా తయారైందని మండిపడ్డారు.

సిగ్గుంటే రాజీనామా చేయాలి

మోదీకి ఏ మాత్రం సిగ్గు ఉన్నా.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఎం సభ్యుడు ఏఎం ఆరిఫ్‌ డిమాండ్‌ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని పక్కనపెట్టి.. సుప్రీం కోర్టు నేరుగా ఒక రాష్ట్ర ప్రభుత్వంపై అదీ బీజేపీ పాలిత రాష్ట్రంపై తీవ్ర చర్యలు తీసుకోవడం మునుపెన్నడూ లేనిది’ అని మణిపూర్‌ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరును ప్రస్తావించారు.
‘నరేంద్రమోదీకి ఏ మాత్రం సిగ్గు ఉన్నా.. లేదా ఏ మాత్రమైనా ఆత్మాభిమానం ఉన్నా.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ పాలనను సుప్రీం కోర్టు తన చేతిలోకి తీసుకున్న తర్వాత మోదీని ప్రధానిగా ఎలా గుర్తిస్తామని ప్రశ్నించారు.

బీరేన్‌సింగ్‌ రాజీనామా చేయాలి: సూలె

మణిపూర్‌లో చోటు చేసుకున్న సిగ్గుమాలిన తప్పిదాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలె డిమాండ్‌ చేశారు. ఆ తప్పిదాల వల్లే మే 3 నుంచి 150కిపైగా మరణాలు సంభవించాయని అన్నారు. యావత్‌ భారతదేశ మనోభావాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రతిపక్ష కూటమి మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చిందని చెప్పారు.
మోదీ పాలనలో అనేక అంశాల్లో భారతదేశ గ్లోబల్‌ ర్యాంకులు గణనీయంగా పడిపోయాయని చెప్పారు. తొమ్మిదేళ్లలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ అప్రజాస్వామికంగా కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్‌ చైనా ఘర్షణలపై చర్చ ఏది?
2020లో భారత్‌-చైనా ఘర్షణలపై అదే ఏడాది కొవిడ్‌ అనంతరం సమావేశమైన తర్వాత పార్లమెంటులో చర్చించలేదని కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారి విమర్శించారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి నాలుగేళ్లవుతున్నా.. ఇంత వరకూ జమ్ముకశ్మీర్‌కు ఎన్నికలు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ సమయంలో ఎన్డీయే సభ్యులు ఆయనకు అడ్డు తగులుతూ ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్నదని, దీనిని సభలో ప్రస్తావించకూడదని వాదించారు. దీనిపై రిటార్టిచ్చిన తివారి.. మరి నేషనల్‌ హెరాల్డ్‌ కేసు కోర్టు పరిధిలో లేదా? అని నిలదీశారు.

అవిశ్వాసం తెచ్చిన కాంగ్రెస్‌ చింతిస్తుంది : రిజిజు

కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. బలాసోర్‌ రైలు ప్రమాదాన్ని ప్రస్తావించిన కేంద్రమంత్రి.. ప్రమాదాలు దురదృష్టకరమని, విషాదభరితమని అన్నారు. ఒక్క రైలు ప్రమాదం సంభవించినా, ఒక్క మరణం చోటు చేసుకున్నా అది అతిపెద్ద విషాదమని చెప్పారు.
మోదీ దృష్టిసారించడం వల్లే 2020లో ఇండియాకు 7 ఒలింపిక్‌ పతకాలు లభించాయని చెప్పారు. 2014కు ముందు ఈశాన్య ప్రాంత ప్రజలు జాతి వివక్షను ఎదుర్కొన్నారని, కానీ తర్వాత పరిస్థితి మారిపోయిందని అన్నారు. ఇది తమ ప్రభుత్వం వల్లేనని చెప్పుకొన్నారు.
ఇండియా కూటమి ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం తెచ్చినందుకు కాంగ్రెస్‌ చింతిస్తుందని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి ఎంతోకాలం ఐక్యంగా ఉండజాలదని బీజేపీ ఎంపీ సునీతా దుగ్గల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి కూటమి కట్టాయని ఎద్దేవా చేశారు.

కేంద్రానికి మద్దతుగా మాట్లాడిన బీజేడీ

ఊహించిన విధంగానే బీజేడీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. ఒడిశాకు కేంద్రం చాలా చేసిందంటూ సంతృప్తి వ్యక్తం చేసింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న బీజేడీ సభ్యడు పినాకి మిశ్రా.. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం తేవడంలో అర్థం లేదన్నారు.
రాజకీయ పార్టీగా తాము బీజేపీకి వ్యతిరేకమైనప్పటికీ.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేమని చెప్పారు. మణిపూర్‌ విషయంలో ప్రధాని నుంచి ప్రకటన రాకపోవడం తప్పా? ఒప్పా? అన్నది దేశ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

మణిపూర్‌లో ప్రభుత్వ హింస

మణిపూర్‌లో కుకీ మహిళలపై లైంగిక దాడులు ప్రభుత్వ ప్రాయోజితమేనని సమాజ్‌వాది పార్టీ సభ్యురాలు డింపుల్‌ యాదవ్‌ విమర్శించారు. అవిశ్వాసంపై చర్చ జరుగుతుంటే సభలో ప్రధాని లేకపోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. మణిపూర్‌లో హింసను నిలువరించడం అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక బాధ్యతని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుని ఉంటే రెండు రోజుల్లో హింస ఆగిపోయేదని అన్నారు. కానీ.. ప్రభుత్వ ఉద్దేశం సరిగా లేదని విమర్శించారు.
ఇప్పటికీ మోసం చేసే ఉద్దేశంలోనే ఉన్నదని ఆరోపించారు. పరిపాలన వ్యవస్థను, ఆర్థిక సమాఖ్య వాదాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ వంటివాటిని ధ్వంసం చేస్తున్నదని, కేంద్ర దర్యాప్తు సంస్థలను తన రాజకీయ ప్రయోజనాల కోసం సాధానాలుగా వాడుకుంటున్నదని ఆరోపించారు.