రూ.10,300 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

టెక్నాల‌జీ ఆధారంగా సైబ‌ర్ నేర‌గాళ్ల దోపిడీ రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. గ‌డిచిన నాలుగేండ్ల‌లో దేశం నుంచి రూ.10,300 కోట్లకు పైగా దోచుకున్నారు.

  • Publish Date - January 4, 2024 / 09:10 AM IST
  • దేశంలో 2021 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మోసం
  • బాధితులు 1930 నంబ‌ర్‌కు గంట‌లోగా ఫోన్‌చేస్తే రిక‌వ‌రీ
  • ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈవో వెల్ల‌డి


విధాత‌: టెక్నాల‌జీ ఆధారంగా సైబ‌ర్ నేర‌గాళ్ల దోపిడీ రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. గ‌డిచిన నాలుగేండ్ల‌లో దేశం నుంచి రూ.10,300 కోట్లకు పైగా దోచుకున్నారు. ద‌ర్యాప్తు ఏజెన్సీలు దాదాపు రూ.1,127 కోట్లను సైబ‌ర్ నేర‌గాళ్ల చేతికి చిక్క‌కుండా విజ‌య‌వంతంగా నిరోధించగలిగాయని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) బుధవారం తెలిపింది.


నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో రోజు సుమారు 5,000కు పైగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదవుతున్నాయని ఐ4సీ సీఈవో రాజేశ్‌కుమార్ తెలిపారు. వీటిలో 40-50 శాతం చైనా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాలు మోసాలు చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. కంబోడియా, మయన్మార్ నుంచి కూడా కొంద‌రు ఆప‌రేట్ చేస్తున్నార‌ని వెల్ల‌డించారు.


బాధితులు 1930 కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని, మోసం జరిగిన గంటలోపు కాల్ చేస్తే బ్యాంకులు డబ్బును బ్లాక్ చేయవచ్చని ఆయ‌న తెలిపారు. యూపీఐ వ్యవస్థను అభివృద్ధి చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో సహా దాదాపు 263 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ హెల్ప్‌లైన్‌కి లింక్ అయి ఉన్నాయ‌ని వివ‌రించారు.


“నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో 2021లో 4.52 లక్షలకు పైగా సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఇది 2022లో 113.7 శాతం పెరిగింది. పోర్టల్‌లో 9.66 లక్షల కేసులు నమోదయ్యాయి. 2023లో ఎన్‌సీఆర్‌సీలో 15.56 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే లక్ష జనాభాకు 129 సైబర్ క్రైమ్ కేసులు రికార్డ‌య్యాయి” అని రాజేష్ కుమార్ చెప్పారు.


“భారతదేశంలో 2021 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31, 2023 వరకు ప్ర‌జ‌లు సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో చిక్కి రూ.10,319 కోట్లు పోగొట్టుకున్నారు. మేము రూ. 1127 కోట్లను బ్లాక్ చేయగలిగాము. అందులో 9-10 శాతం బాధితుల ఖాతాల్లోకి పునరుద్ధరించాం ” అని కుమార్ చెప్పారు.


కేవైసీ గడువు ముగింపు, ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ మాల్వేర్-రకం ఆన్‌లైన్ స్కామ్‌లు, పెట్టుబడి అప్లికేషన్లు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, పోంజీ స్కీమ్‌లను అందించే వెబ్‌సైట్లు, చట్టవిరుద్ధమైన రుణ దరఖాస్తులు, కస్టమర్ కేర్ సెంటర్ల‌ను ఉపయోగించి సైబ‌ర్ నేర‌గాళ్ల ముఠాలు ప్ర‌జ‌ల డ‌బ్బును దోచుంటున్నాయ‌ని తెలిపారు.


బాధితుల ఫిర్యాదుల ఆధారంగా 2.95 లక్షల సిమ్ కార్డులు, 2,810 వెబ్‌సైట్లు, 595 మొబైల్ అప్లికేషన‌ట్లు, 46,229 ఐఎంఈఐ నంబర్ల‌ను బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగించే చాలా సిమ్‌లు అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి జారీ అయ్యాయ‌ని వెల్ల‌డించారు.