పాపం శ్రీలంక‌..అంత భారీ ల‌క్ష్యాన్ని కూడా పాక్ ఇలా ఊది ప‌డేసింది..!

  • By: sn    latest    Oct 11, 2023 4:09 AM IST
పాపం శ్రీలంక‌..అంత భారీ ల‌క్ష్యాన్ని కూడా పాక్ ఇలా ఊది ప‌డేసింది..!

పాపం వ‌ర‌ల్డ్ క‌ప్‌లో శ్రీలంక ప‌రిస్థితి దారుణంగా మారింది. త‌మ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాకి 428 పరుగుల భారీ స్కోరు ఇచ్చి, 102 పరుగుల తేడాతో ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. దీంతో పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎలాగైన గెల‌వాల‌ని ఆడిన ఈ జ‌ట్టు 345 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉచ్చిన బౌలంగ్ వైఫ‌ల్యం వ‌ల‌న ఓడ‌క త‌ప్ప‌లేదు. బ్యాటింగ్‌లో అనవసర షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్న శ్రీలంక జ‌ట్టు, ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచులు డ్రాప్ చేసి భారీ మూల్యమే చెల్లించుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జ‌ట్టులో కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ (106) శతకాలతో మెర‌వ‌డంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది.


హైద‌రాబాద్ వేదిక‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ టార్గెట్‌ని చేధిస్తుందా అనే సందేహం అంద‌రిలో ఉంది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (12) మరోసారి ఫెయిల్ కావ‌డం, కెప్టెన్ బాబర్ ఆజమ్ (10) కూడా చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేర‌డంతో పాక్ ఓట‌మి ఖాయ‌మ‌ని అందరు అనుకున్నారు. కాని ప‌రిస్థితులు మెల్ల‌మెల్ల‌గా పాక్ వైపుకి మారాయి. ఫఖర్ జమాన్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన‌ అబ్దుల్లా షఫీక్ (113) అద్భుతమైన సెంచ‌రీ చేశాడు.మొదటి ప్రపంచ కప్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పాకిస్తాన్ బ్యాటర్‌గా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక సెంచ‌రీ త‌ర్వాత అద్భుత‌మైన క్యాచ్‌కి ష‌ఫీక్ పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ కలిసి నాలుగో వికెట్‌కి 95 పరుగుల భాగస్వామ్యం నెల‌కొల్ప‌గా, తీక్ష‌ణ బౌలింగ్‌లో ష‌కీల్ 30 బంతుల్లో 2 ఫోర్లతో 31 పరుగులు చేసి ఔట‌య్యాడు.


ష‌కీల్ ఔట‌య్యే స‌మ‌యానికి పాకిస్తాన్ 33 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. 121 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 134 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్ , ఇఫ్తికర్ అహ్మద్ (10 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు) మ‌రో వికెట్ ప‌డ‌కుండా ఆడి మ్యాచ్‌ని ముగించాడు. రిజ్వాన్ బౌండ‌రీ బాది పాకిస్తాన్‌కి మంచి విజ‌యం ద‌క్కేలా చేశాడు. అంత భారీ ల‌క్ష్యాన్ని కూడా శ్రీలంక కాపాడుకోలేక‌పోవ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఇక పాకిస్తాన్, తన తర్వాతి మ్యాచ్‌ని అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో టీమిండియాతో ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.