విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ (Warangal) నగరంలో నిర్మించిన మోడల్ వైకుంఠధామం పలువురి ప్రశంసలను అందుకుంటుంది. నిర్మాణం అనేకమందిని ఆకర్షిస్తోంది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జిడబ్ల్యూ ఎంసీ)పరిధిలోని 57వ డివిజన్ గాంధీనగర్‌లో జీ.డబ్ల్యు.ఎం.సీ ఆధ్వర్యంలో రూ. 4.50 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
పంచభూత మోడల్ (నమూనా) వైకుంఠ దామాన్నీ ఆధునాతన హంగులతో తీర్చిదిద్దారు. ఈ మోడల్ వైకుంఠ ధామం లో బర్నింగ్ ప్లాట్ ఫామ్ లు, వెయిటింగ్ హాల్స్, లైబ్రరీ, లాకర్ రూమ్స్, పార్కింగ్ ఏరియా, గ్రీనరీ, లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, సోలార్ ఫెన్సింగ్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు వినూత్నంగా ఏర్పాటు చేశారు.
గత శుక్రవారం రాష్ట్ర పురపాలక, ఐ.టి.శాఖ మంత్రి కేటీఆర్ ఈ వైకుంఠధామం ప్రారంభించారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా ఆయన నుండి ప్రశంసలు దక్కాయి. దీంతో వరంగల్ మోడల్ వైకుంఠ ధామం పలువురిని ఆకర్షించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మంత్రి కేటీఆర్ నుంచి ప్రశంసలు
పురపాలక శాఖ మాత్యులు ట్విట్టర్ ద్వారా మంగళవారం వైకుంఠ ధామ ఫోటో ను షేర్ చేస్తూ ఇందుకు కృషి చేసిన నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్, ఇన్చార్జి బల్దియా కమిషనర్ ప్రావీణ్య,అధికారుల బృందాన్ని కేటిఆర్ అభినందించారు.
ఈ అద్భుత నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లను ప్రత్యేకంగా అభినందించారు.
మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వైకుంఠ దామ విశేషాలను వివరిస్తూ బాగుందని మంత్రి ప్రశంసించారు.