45 రోజులుగా పార్లమెంటు సెక్యూరిటీ చీఫ్‌ పోస్టు ఖాళీ!

పార్లమెంటు ప్రాంగణంలో భద్రతా సిబ్బంది కొరత ఉన్నదని చెబుతున్నారు. సెక్యూరిటీ విభాగం హెడ్‌ పోస్టు 45 రోజులుగా ఖాళీగా ఉన్నదని సమాచారం.

  • By: TAAZ    latest    Dec 17, 2023 12:02 PM IST
45 రోజులుగా పార్లమెంటు సెక్యూరిటీ చీఫ్‌ పోస్టు ఖాళీ!
  • ఇతర విభాగాల్లోనూ 40 శాతం వరకూ ఖాళీలు?
  • హైటెక్‌ సెటప్‌ ఉన్నా.. గ్యాస్‌ కానిస్టర్స్‌ తీసుకెళితే మోగని అలారం!

న్యూఢిల్లీ : పార్లమెంటు భవంతిలోకి ఇద్దరు యువకులు చొరబడి హల్‌చల్‌ చేసిన నేపథ్యంలో అసలు పార్లమెంటు భద్రత ఎలా ఉన్నదని పరిశీలిస్తే.. అసలు 45 రోజులుగా సెక్యూరిటీ విభాగానికి హెడ్‌ (జాయింట్‌ సెక్రటరీ) లేడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకూ ఈ బాధ్యతల్లో ఉన్న 1997 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి రఘుబీర్‌లాల్‌ తన హోం స్టేట్‌ అయిన ఉత్తరప్రదేశ్‌కు అదనపు డీజీ (శాంతిభద్రతలు)గా నవంబర్‌ మొదటివారంలో బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు బదులుగా డైరెక్టర్‌ స్థాయి అధికారి ఒకరు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలుస్తున్నది. ఇదేకాదు.. పార్లమెంటు సెక్యూరిటీ విభాగంలోని వివిధ స్థాయిల్లో దాదాపు 40శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు భద్రతా విభాగంలో 230 మంది పనిచేస్తున్నారు.


మెటల్‌ డిటెక్టర్‌ ఎందుకు మోగలేదు?

మ్యాన్‌పవర్‌ కొరత ఒక సమస్య అనుకుంటే.. అంతకు మించిన సమస్య కూడా తాజా ఉదంతంలో బయటపడింది. అదే మెటల్‌ డిటెక్టర్ల పనితీరు. పార్లమెంటులోకి బీజేపీ ఎంపీ పాసులతో వెళ్లిన ఇద్దరు యువకులు తమ షూస్‌లో గ్యాస్‌ కానిస్టర్స్‌ తీసుకుని పోతుంటే.. అక్కడి మెటల్‌ డిటెక్టర్లు కనిపెట్టేలేక పోవడం ఆందోళన కలిగిస్తున్నది. వాస్తవానికి పార్లమెంటు భవంతిలో అధునాతన భద్రతా ఏర్పాట్లు చేశారు. కృత్రిమ మేధను కూడా వినియోగిస్తున్నారు. కానీ.. ఎంత టెక్నాలజీ ఉన్నా.. మ్యాన్‌ పవర్‌ కూడా చాలా ముఖ్యమని పలువురు రిటైర్డ్‌ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు.


పార్లమెంటు బడ్జెట్‌లో 30 కోట్లు కోత

పార్లమెంటు ప్రాంగణం వార్షిక బడ్జెట్‌లో ఈసారి 30 కోట్లు కోత విధించడాన్ని పలువురు నేతలు ప్రస్తావిస్తున్నారు. ఎంపీల పేరుతో పాసులు తీసుకొని వచ్చేవారి సంఖ్య పెరుగుతుండటంతో అందరినీ భౌతికంగా తనిఖీ చేయడం కూడా అధికారులకు సవాలుగా తయారైందని చెబుతున్నారు. ఈ లొసుగును ఇద్దరు యువకులు పసిగట్టారని అంటున్నారు.


సమన్వయం ఉన్నదా?

ప్రజా ప్రతినిధుల వాహనాల విషయంలో పార్లమెంటు సెక్రటేరియట్‌ అధికారులకు, భద్రతా విభాగం అధికారులకు మధ్య సమన్వయం కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌతిక తనిఖీల పని ఢిల్లీ పోలీసులు నిర్వహిస్తుండగా.. లోక్‌సభ, రాజ్యసభలోకి ప్రవేశించేవారి కదలికలపై పార్లమెంటు సెక్రటేరియట్‌ వాచ్‌ అండ్‌ వార్డ్‌ సిబ్బంది కన్నేసి ఉంచుతున్నారు. విజిటర్స్‌ పాసులు ప్రస్తుతానికి నిలిపివేసినా.. పార్లమెంటు సభ్యుల సిబ్బంది రాకపోకలను ఇంకా క్రమబద్ధీకరించాల్సి ఉన్నదని అంటున్నారు.