Pawan Kalyan
విధాత: ప్రజాస్వామ్య పరిరక్షణకు న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అని మూడు బలమైన వ్యవస్థలు ఉన్పప్పటికీ… వాలంటీర్లు అనే మరో సమాంతర వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ఎందుకు తీసుకొచ్చారని జనసేన పార్టీ అధ్యక్షులుపవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
వాలంటీర్లు ఇళ్ళల్లోకి వెళ్ళి సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం ఎక్కడుంది? ఎవరికి పంపిస్తున్నారు? మొత్తం సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేస్తున్నారు? డేటా దుర్వినియోగం అయితే బాధ్యత ఎవరిదీ? సేవ చేయడానికి వచ్చిన వాలంటీరుకు దాడి చేసే హక్కు ఉందా? ఆరేళ్ల బాలికపై వాలంటీర్ అఘాయిత్యం చేస్తే జగన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
ఏలూరులో క్రాంతి కళ్యాణ మండపంలో దెందులూరు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “వైఎస్ జగన్ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. వైసీపీ విధానాల మీదే చిరాకు ఉంది. డిగ్రీ చదువుకునే యువతీ, యువకులను తీసుకొచ్చి రూ. 5 వేల నెల జీతానికి వాలంటీరుగా పెట్టారు. ఉరకలెత్తే యువత శ్రమను దోపిడీ చేస్తున్నారు” అని ఆరోపించారు.
“పార్లమెంటులో ఇచ్చిన సమాచారం మేరకు 2019-21 మధ్య కాలంలో 18 ఏళ్లు దాటిన ఆడబిడ్డలు 22,278 మంది మిస్ అయిపోయారు. ఇప్పటి వరకు ఆచూకీ తెలియని వారు 5,675 మంది ఉన్నారు. ఇంట్లో ఆడబిడ్డ కాసేపు కనిపించకపోతేనే విలవిల్లాడిపోతాము. అలాంటింది 30 వేల మంది అదృశ్యమయితే దీనిపై ఎందుకు డిబేట్ పెట్టలేదు. కడప జిల్లా పొద్దుటూరులో ఒక మాదిగ సామాజికవర్గానికి చెందిన మైనర్ బాలికపై చాలామంది పలుమార్లు అత్యాచారం చేశారు.
వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు ఇలా చాలా మందికి ఫిర్యాదు చేసింది ఎవరూ పట్టించుకోలేదు. ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ బాలిక స్త్రీశిశు సంక్షేమ హాస్టల్స్ లో ఉంటోంది. దీనిపై ఎవరూ మాట్లాడరు. వాటిపై టీవీల్లో డిబేట్లు పెట్టరా? అవి పెడితే డబ్బులు రావేమో? కానీ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం డిబేట్లు పెడతారు” అంటూ పవన్ మీడియాను దెప్పిపొడిచారు.
“ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను మనం సంస్కారంతో మాట్లాడుతుంటే వాళ్లు మాత్రం మన ఇంట్లో ఆడవాళ్లను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక సంస్కార హీనుడు ముఖ్యమంత్రి ఎలా ఉంటుందో ఈతరం చూడటానికే జగన్ గెలిచాడు” అని అన్నారు.