PDA | ప్రతిపక్షాల కొత్త కూటమి పీడీఏ!

PDA దేశభక్త ప్రజాస్వామిక కూటమి సిమ్లా భేటీలో ప్రకటించే చాన్స్‌ సంకేతాలిచ్చిన రాజా, మమత న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న పార్టీల కూటమికి పేట్రియాటిక్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (పీడీఏ) (దేశభక్త ప్రజాస్వామిక కూటమి) అనే పేరు పెట్టబోతున్నారని సమాచారం. సిమ్లాలో వచ్చే నెల 10-12 తేదీల్లో జరిగే తదుపరి సమావేశంలో దీనిని ఖరారు చేసే అవకాశం ఉన్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది. పాట్నాలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా […]

  • Publish Date - June 25, 2023 / 01:15 AM IST

PDA

  • దేశభక్త ప్రజాస్వామిక కూటమి
  • సిమ్లా భేటీలో ప్రకటించే చాన్స్‌
  • సంకేతాలిచ్చిన రాజా, మమత

న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న పార్టీల కూటమికి పేట్రియాటిక్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (పీడీఏ) (దేశభక్త ప్రజాస్వామిక కూటమి) అనే పేరు పెట్టబోతున్నారని సమాచారం. సిమ్లాలో వచ్చే నెల 10-12 తేదీల్లో జరిగే తదుపరి సమావేశంలో దీనిని ఖరారు చేసే అవకాశం ఉన్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

పాట్నాలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. సిమ్లాలో పీడీఏకు తుది రూపునిస్తారని అంటున్నారు. ఇదే విషయంలో రాజాను ఒక వార్తా పత్రిక సంప్రదించగా.. పీడీఏ అనే పేరు ఉండొచ్చని, కానీ దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

తమ అందరి ప్రాథమిక లక్ష్యం ఎన్‌డీఏ ఓటమేనన్న రాజా.. దీనిపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టత ఉన్నదని తెలిపారు. లౌకిక, ప్రజాస్వామిక సిద్ధాంతాలతో ఒక వేదికపైకి వస్తున్న ప్రతిపక్ష పార్టీల పేరు దానిని సూచించే విధంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని రాజా చెప్పారు. తమిళనాడులో సెక్యులర్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, బీహార్‌లో మహాఘట్‌బంధన్‌ అని ఉన్నాయని చెప్పారు. అదే తరహాలో ఒక పేరును నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, లెఫ్ట్‌, ఇతర ప్రాంతీయ పార్టీలు యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. ఆ ప్రభుత్వంలో వామపక్షాలు భాగస్వామ్యం కాకపోయినా.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ప్రతిపక్షాల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ.. తమను ప్రతిపక్షాలు అని కాకుండా.. దేశభక్తులని పిలవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.