చనిపోయిన విద్యార్థినిపై అభండాలా?
నిన్న ప్రవళిక అనుమానాస్పద స్థితిలో హైదరాబాద్ అశోక్ నగర్ లో సూసైడ్ చేసుకొని తనువు చాలించింది. అశోక్ నగర్ సహజంగానే కోచింగ్ సెంటర్లకు కేంద్రం.

మీ మాటలకు విశ్వాసనీయత ఉన్నదా డీసీపీ గారు.?
నిన్న ప్రవళిక అనుమానాస్పద స్థితిలో హైదరాబాద్ అశోక్ నగర్ లో సూసైడ్ చేసుకొని తనువు చాలించింది. అశోక్ నగర్ సహజంగానే కోచింగ్ సెంటర్లకు కేంద్రం. అక్కడే సెంటర్ లైబ్రరీ ఉండడం వేలాది మంది నిరుద్యోగులు గంటల తరబడి రోజు తమ చదువులను చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ప్రవళిక మరణ వార్త తెలియగానే అశోక్ నగర్ ప్రాంతమంతా నినాదాల హోరుతో రగిలిపోయింది. నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఏ స్థితిలో ఉందో కండ్లకు కట్టినట్టు కనబడింది. ప్రవళిక మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని నిరుద్యోగులు నినదించారు. తన మరణం అక్కడున్న వారందరినీ కలచివేసింది. దాదాపు 7 గంటల పాటు హోరు నినాదాలు నడుమ అశోక్ నగర్ లో విద్యార్థులు తమ తీవ్రమైన ప్రతిఘటనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రవల్లిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన మరణం పై నిజ,నిజాలను నిగ్గు తేల్చాలని నినదించారు.
బందోబస్తు కోసం వచ్చిన పోలీసు బలగాలు అప్పుడే తను రాసిన సూసైడ్ లెటర్ ను చూపించాలని వారందరూ కోరారు. ప్రవల్లిక మృతదేహాన్ని చూడాలని తాపత్రయపడ్డా పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవానికి పోలీసులు ప్రజాస్వామికంగా వ్యవహరిస్తే నిరుద్యోగులను శాంతపరచి వారి డిమాండ్ కనుగుణంగా వ్యవహరించేవారు. కానీ ఆందోళనను అణిచివేసే వైఖరిని కలిగి ఉన్న పోలీసులు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న నాయకులను ముందస్తుగా అదుపులోకి అతి కష్టం మీద తీసుకున్నారు. ఆ తరువాత లాటీలు జులిపించి ఒక్కొక్కరిని గోడ్డును బాదినట్టు బాది అందరినీ చదరగొట్టి ప్రవళిక మృతదేహాన్ని గాంధీ హాస్పటల్ మార్చురీకి తరలించారు. అక్కడ నుండి గంటల వ్యవధిలోనే వారి స్వగ్రామానికి తరలించారు.
తన అంత్యక్రియలు జరిగిన తరువాత సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం పెట్టి తను లవ్ ఎఫైర్ తో చనిపోయిందని తన సమస్య ఉద్యోగం రాకపోవడం కాదని సెలవిచ్చారు. పోలీసులు ఈ విధంగా మాట్లాడడానికి వీరికి ఎవరు అధికారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో ఒక పోలీసు ఉన్నతాధికారి ఇలా మాట్లాడవచ్చా?. ఇది నిజం కాదని చనిపోయిన ప్రవల్లిక వచ్చి ఇప్పుడు నిరూపించుకోగలదా?. ఒకవేళ అధికారి చెప్పిన విషయం నిజమే అయితే చట్టరీత్యా తాను అలా ప్రకటించడం సరైనదేనా. విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాల్సింది కోర్టులు. ఈ అధికారి ఇలా మాట్లాడడం ఎలా సరైనది అవుతుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగి ఇన్ని రోజులు అవుతున్న దీని మీద విచారణను వేగవంతం చేసి నిందితులను శిక్షించాల్సిన పోలీసులు దానిమీద మాట్లాడరు. గతంలో అనేకమంది విద్యార్థులు నిరుద్యోగంతో చనిపోయిన వారు చాలా స్పష్టంగా వాళ్లు రాసిన సూసైడ్ లేఖలో మా ఆత్మహత్యకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే అని ప్రకటించారు. స్పష్టంగా రాశారు. మరి అటువంటి ఘటనలలో పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నారో చెప్పాలి. మహబూబాబాద్ కు సంబంధించిన సునీల్ నాయక్ నిరుద్యోగంతో వేగంగా ఎదురొచ్చే రైలు ఢీ కొట్టుకొని చనిపోయాడు. తాను రాసిన లేఖలో స్పష్టంగా నా మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని చెప్పాడు. మరి పోలీసులు ఎందుకు ఆరోజు చర్యలు తీసుకోలేదు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి. అంటే ఒక ఘటనలో ఒక న్యాయం ఇంకో ఘటనలో ఇంకొక న్యాయమా?.
సహజంగా పోలీసులు ఏ కేసులు పెట్టినా అవి మెజార్టీ కేసులు కోర్టులో వీగిపోతాయి. ఎందుకంటే ఆందోళనలు ధర్నాలు చేసినప్పుడు వారు కావాలనే ఉద్యమాలను అణిచివేయడం కోసం ఆ కేసులు పెట్టిన తరువాత కోర్టులో అవి నిలబడవు. అనేక కేసుల్లో సాక్షాలు కూడా ఉండవు. ప్రవళిక లాంటివారు చనిపోయినప్పుడు వారి వ్యక్తిగత జీవిత హననానికి పాల్పడి కూడా కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగమే నేటి డిసిపి ప్రెస్ మీట్ ఉద్దేశం. వీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తారనేది అందరికీ స్పష్టంగా తెలిసిందే. ఎల్బీనగర్ లక్ష్మీ ఘటన తర్వాత తెలంగాణ పోలీసుల క్రెడిబులిటీ దెబ్బతిన్నది. పోలీసులు చెప్తే నేడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రవల్లిక ఘటనలో కూడా వారు పారదర్శకంగా వ్యవహరిస్తే బాగుండేది. ఘటన జరిగి గంటల కొద్దీ ఆందోళన నిర్వహించాక, అనేకమంది విద్యార్థులను చితక బాధాక, ఎటువంటి నిబంధనలు పాటించకుండా తన మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరిపాక డిసిపి వెంకటేశ్వరరావు గారు ఇలా మాట్లాడడం తగదు. ఇది మీ మాటల విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఒకవేళ మీరు చెప్పినట్టు తనది వ్యక్తిగత సమస్య అయినా నిరుద్యోగం సమస్య ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పొగలుగక్కుతున్నది. సేఫ్టీ వాలు లేని ప్రెషర్ కుక్కర్ లాగా పేలడానికి సిద్ధంగా ఉంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందడంలో భాగమే నేటి స్థితి. అందుకు మరింత మంది అభాగ్యులు ఆత్మ బలిదానాలు చేసుకోకుండా భరోసా కల్పించాల్సిన అవసరం సమాజంపై ఉంది.
P.మహేష్.
PDSU రాష్ట్ర అధ్యక్షులు.