PM Modi | ప్రధాని మాట్లాడాల్సిందే.. ఉభయసభల్లో ప్రతిపక్షాల పట్టు

PM Modi నినాదాల మధ్య కొనసాగిన సభ రెండు సభలు నేటికి వాయిదా అవిశ్వాసం పెండింగ్‌లో ఉండగా బిల్లుల ఆమోదంపై నిరసనలు న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే చర్చకు చేపట్టాలని, మణిపూర్‌ అంశంపై ప్రధాని నోరు విప్పాలన్న డిమాండ్లతో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం కూడా ఉభయ సభల వాయిదాకు దారి తీశాయి. లోక్‌సభ ప్రారంభమైన దగ్గర నుంచీ ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు […]

PM Modi | ప్రధాని మాట్లాడాల్సిందే.. ఉభయసభల్లో ప్రతిపక్షాల పట్టు

PM Modi

  • నినాదాల మధ్య కొనసాగిన సభ
  • రెండు సభలు నేటికి వాయిదా
  • అవిశ్వాసం పెండింగ్‌లో ఉండగా
  • బిల్లుల ఆమోదంపై నిరసనలు

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే చర్చకు చేపట్టాలని, మణిపూర్‌ అంశంపై ప్రధాని నోరు విప్పాలన్న డిమాండ్లతో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం కూడా ఉభయ సభల వాయిదాకు దారి తీశాయి. లోక్‌సభ ప్రారంభమైన దగ్గర నుంచీ ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. తర్వాత సమావేశమైన తర్వాత కూడా అవే పరిస్థితులు కొనసాగాయి.

అయినప్పటికీ సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్పీకర్‌ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ సిద్ధపడ్డారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లును సభ ఆమోదానికి ఉంచగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. దీనితోపాటు జాతీయ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ సవరణ బిల్లు, జాతీయ డెంటల్‌ కమిషన్‌ బిల్లు కూడా ఆమోదం పొందాయి. సభలో నిరసనలు కొనసాగుతుండటంతో సభను రోజు మొత్తానికీ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

అంతకు ముందు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. 1978 మే 10న ఒక సందర్భంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన వెంటనే చర్చ చేపట్టిన విషయాన్ని కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రస్తావించారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెంటనే స్పందిస్తూ.. అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని చెప్పారు.

తీర్మానం నోటీసు ఇచ్చిన పది రోజుల్లో చర్చ ప్రారంభించాల్సి ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయని అన్నారు. తమకు సభలో సంఖ్యాబలం ఉన్నదన్న మంత్రి.. ప్రతిపక్షానికి బలం ఉంటే బిల్లులను ఓడించాలని సవాలు చేశారు. ఈ సమయంలో నినాదాలు ఉధృతం కావడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా అవే పరిస్థితులు కొనసాగడంతో రోజు మొత్తానికి వాయిదా పడింది.

బిల్లుల ఆమోదంపై విపక్షాల అభ్యంతరం

ఒకవైపు తాము ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్న సమయంలో కేంద్రం హడావుడిగా బిల్లులు ఆమోదించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. పార్లమెంటరీ సంప్రదాయాలను బీజేపీ సర్కారు తుంగలో తొక్కుతున్నదని కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

1966 జూలై 26న అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సత్యేంద్ర నారాయణ్‌ సిన్హా కీలక ప్రకటన చేస్తూ.. ‘ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన వస్తే.. దానికి ఇబ్బంది కలిగించే ఏ అంశాన్ని చేపట్టరాదు’ అని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. సభలో గందరగోళం కొనసాగుతున్న సమయంలో బిల్లులు ఆమోదించుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

గతంలో అవిశ్వాసం సందర్భంగా మంత్రులు ప్రదర్శించిన సానుకూల వైఖరులను ఆయన తన పోస్టులో వివరించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు చేపట్టేందుకు స్పీకర్‌ అనుమతించిన తర్వాత మరే అంశాన్ని చేపట్టరాదని ఆప్‌ సభ్యుడు రాఘవ్‌ ఛద్దా తేల్చి చెప్పారు. కానీ.. ప్రభుత్వం మాత్రం పలు బిల్లులను ఆమోదించుకుంటున్నందని విమర్శించారు.

రాజ్యసభలోనూ అదే తీరు

రాజ్యసభలోనూ ఇదే పరిణామాలు కొనసాగాయి. మణిపూర్‌ అంశంపై టీఎంసీ నాయకుడు డెరెక్‌ ఓ బ్రైన్‌ చర్చకు పట్టుబట్టడంతో అసహనానికి గురైన రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌.. సభను అర్ధాంతరంగా వాయిదావేశారు. ప్రతిపక్ష సభ్యలు 267వ నిబంధన కింద చర్చకు ఇచ్చిన నోటీసులను అనుమతించకపోవడంపై పదే పదే బల్లలు చరుస్తూ టీఎంసీ ఎంపీ నిరసన వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్‌ సభను వాయిదా వేశారు.

కాంగ్రెస్‌, వామపక్షాలతోపాటు, టీఎంసీ, ఎస్పీ, ఆప్‌, ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీల నుంచి దాదాపు 47 మంది సభ్యులు మణిపూర్‌లో హింసపై 267వ నిబంధన కింద చర్చ జరపాలని నోటీసులు ఇచ్చారు. నిరసనల సమయంలో చైర్మన్‌ మాట్లాడుతూ.. సభలో నాటకాలను అనుమతించే ప్రసక్తే లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అనంత‌రం సభను వాయిదా వేశారు.

అంతకుముందు సభ ప్రారంభమైన తర్వాత ఇద్దరు సభ్యులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు.. పదవీ విరమణ చేస్తున్న వినయ్‌ దినూర్‌ టెండూల్కర్‌ను అభినందించిన తర్వాత కేవలం 27 నిమిషాలే సభ కొనసాగింది.