మైనంపల్లి ఎంట్రీ.. మారనున్న మెదక్ రాజకీయం

కేటీఆర్ మార్క్ రాజకీయంతో మెదక్ బాట పట్టిన తండ్రి కొడుకులు స్వచ్ఛంద సేవాకార్యక్రమాలతో మెదక్ నియోజక వర్గ ప్రజల ముందుకు మెదక్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉమ్మడి జిల్లాపై పట్టున్న నేతగా ఎదిగిన మైనంపల్లి విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లాలో రాజకీయాలపై బీఅర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ మార్క్ రాజకీయాలు నడువనున్నాయా అంటే అవుననే సమాధానమే […]

మైనంపల్లి ఎంట్రీ.. మారనున్న మెదక్ రాజకీయం
  • కేటీఆర్ మార్క్ రాజకీయంతో మెదక్ బాట పట్టిన తండ్రి కొడుకులు
  • స్వచ్ఛంద సేవాకార్యక్రమాలతో మెదక్ నియోజక వర్గ ప్రజల ముందుకు
  • మెదక్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉమ్మడి జిల్లాపై పట్టున్న నేతగా ఎదిగిన మైనంపల్లి

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లాలో రాజకీయాలపై బీఅర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ మార్క్ రాజకీయాలు నడువనున్నాయా అంటే అవుననే సమాధానమే రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్న మాట.

కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ తో కలిసి ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం పూజలు చేసి ఇకపై మెదక్ నియోజక వర్గంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తామని, మెదక్ ఎమ్మెల్యేగా తన వారసుడు పోటీ చేస్తారని మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ఈ విషయం మెదక్ ఉమ్మడి జిల్లాలోనే హార్ట్ టాపిక్‌గా మారుతోంది. 2004లో టీడీపీ మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన మైనంపల్లి హన్మంతరావు 2004లో మెదక్ ఉమ్మడి జిల్లా రామయంపేట నియోజక వర్గం నుంచి మైనంపల్లి సతీమణి వాణి అప్పటి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 2008లో టీఆర్ఎస్ పిలుపులో భాగంగా ఎమ్మెల్యే పదవికి పద్మా దేవేందర్ రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై మైనంపల్లి హన్మంతరావు 10 వేల మెజార్టీతో రామాయంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2009 డిలిమిటేషన్‌లో బాగంగా రామాయంపేట నియోజక వర్గం రద్దయింది. కొత్తగా మెదక్ ఉమ్మడి జిల్లాలోని పటాన్ చేరు మండలాన్ని నియోజక వర్గ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్, టీడీపీ మహా కూటమిగా ఏర్పడడంతో రామాయంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హన్మంతరావు ఉండడం, ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా కొనసాగడం, మైనంపల్లి స్వగ్రామం చిన్న శంకరంపెట్ మండలం కొర్విపల్లి గ్రామం కావడం.. ఈ మండలం మెదక్ నియోజక వర్గంలో కలవడంతో 2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ మాహాకూటమి మెదక్ నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ అధిష్టాన వర్గం మైనంపల్లికి కేటాయించడంతో కాంగ్రెస్ అభ్యర్థి శశిధర్ రెడ్డి పై 19 వేల పై చిలుకు ఓట్లతో మైనంపల్లి గెలుపొందారు.

ఆ ఎన్నికల్లో ప్రస్తుత మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా పద్మా దేవేందర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

2014 ఎన్నికల సమయానికి మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. 2018 ఎన్నికల్లో నగరంలోని మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై గెలుపొందారు. ఇదిలా ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాపై తనదైన ముద్ర వేసుకొని పట్టున్న నేతగా మైనంపల్లి ఎదిగారు.

ఇప్పుడూ వారసుడు మెదక్ రాజకీయాల్లోకి..

తన సిట్టింగ్ మెదక్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన వర్గం తనకే కేటాయిస్తుందని నమ్మకంతో తన కుమారుడు, డాక్టర్ మైనంపల్లి రోహిత్‌ను మెదక్ నియోజక రాజకీయాల్లోకి దింపుతున్నట్లు స్వయంగా ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో ప్రకటించి అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.

మైనంపల్లి హన్మంతరావు తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఏడుపాయలలో అయా గ్రామల ప్రజా ప్రతినిదులు పార్టీలకు అతీతంగా మైనంపల్లిని వచ్చి కలుసుకున్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, జిల్లా స్థాయి నేతలు మైనంపల్లి వెంట ఉన్నారు.

  • మెదక్ బీఆర్ఎస్ టికెట్ రేసులో ముగ్గురు
    ముగ్గురికి.. ముగ్గురు అండదండలు

మైనంపల్లి హన్మంతరావు రీ ఎంట్రీతో మెదక్ నియోజకవర్గ సమీకరణలు మారనున్నాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ని మెదక్ ఎంపీగా పార్టీ అధిష్టానవర్గం పోటీ చేయిస్తుందని ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో మరో ముఖ్య నేత సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి సహితం మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు.

ఆయనకు నియోజకవర్గంలో నిజాంపేట్ జెడ్పీటీసీ విజయ్ కుమార్, పాపన్న పేట ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ కారుడు పుట్టి అక్షయ్ కుమార్, చిన్న శంకరంపేట సర్పంచి రాజిరెడ్డి, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ లు సుభాష్ రెడ్డి వర్గంగా కొనసాగుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు తప్పకుండా టికెట్ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో అదే నమ్మకంతో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నా ముగ్గురికి ముగ్గురు ప్రధాన నాయకుల అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి హరీష్ రావు అండదండలు ఉంటే సుభాష్ రెడ్డికి సీఎం సతీమణి శోభ అండదండలు ఉన్నాయని చెపుతుంటారు. మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్‌ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. టికెట్ ఎవరికి దక్కుతుందో.. ముందు ముందు రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.