పట్నం..పైలట్ వర్గాల ఘర్షణ

బీఆరెస్ లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశం ఆ పార్టీ నేతల వర్గపోరుకు వేదికైంది

  • By: Somu    latest    Jan 05, 2024 10:19 AM IST
పట్నం..పైలట్ వర్గాల ఘర్షణ
  • చేవేళ్ల లోక్‌సభ సన్నాహక సమావేశంలో రగడ



విధాత: బీఆరెస్ లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశం ఆ పార్టీ నేతల వర్గపోరుకు వేదికైంది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వివాదం తలెత్తి పోటాపోటీ నినాదాలకు దారితీసింది. మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.


ఇరు వర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడేక్కింది. ఇక పరస్పరం పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి వర్గీయులు కుర్చీలు విసురుకోవడంతో అక్కడున్న ముఖ్య నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు షాక్ అయ్యారు. వేదికపై ఉన్న హరీశ్‌రావు ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో హరీష్ రావు ప్రత్యేకంగా సమావేశమై సమీక్ష సమావేశంలో బహిరంగంగా గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని మందలించారు. ఈ భేటీలో సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.


ఈ సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనా చారి, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, బీఆరెస్‌ జనరల్‌ సెక్రెటరీ కే.కేశవరావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, టి. ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.