హైదరాబాద్, విధాత: కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక ఖరారైంది. మే 5వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన దీక్షలో ప్రియాంక సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
బీఆర్‌ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్న పొంగులేటి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ఆత్మీయ సభలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ అధినేతపై తన అసంతృప్తిని బహాటంగానే ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా జత కలిశారు.
దీంతో వీరిద్దరినీ బీఆర్‌ఎస్ సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరతారన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. పొంగులేటి అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో కూడా కాంగ్రెస్‌లో చేరాలని 90 శాతం మంది కార్యకర్తలు చెప్పారని వార్తలు వచ్చాయి.
దీంతో ఆయన తన సన్నిహితులతో తీవ్రంగా చర్చించారు. చివరకు కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక సమక్షంలో పొంగులేటిని చేర్చుకోవడానికి సిద్ధమైంది. మే 5వ తేదీన జరిగే నిరుద్యోగ నిరసన దీక్షలో పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు.
పొంగులేటి చేరికతో..
పొంగులేటి చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో మరింత బలం పెరిగే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ను గట్టి దెబ్బ తీసింది. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్.. జిల్లాలో మొదటి సారిగా పొంగులేటి రూపంలో అవకాశం లభించింది. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్న కాంగ్రెస్.. పొంగులేటిని చేర్చుకునేందుకు సిద్ధమైంది.
తెలంగాణపై కేంద్రీకరించిన కాంగ్రెస్ అధిష్ఠానం
తెలంగాణపై గట్టిగా కేంద్రీకరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలోనే మకాం వేయనున్నారని సమాచారం. జూన్ నుంచి అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ప్రియాంక తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదే సమయంలో కర్ణాటక తరహాలోనే ముందస్తుగా తెలంగాణలో 60 సీట్లను జూన్‌లోనే ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా బూత్‌స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ఓటర్లను తరచూ కలిసేందుకు సదరు అభ్యర్థులకు అవకాశం కలుగుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.