Tamil Nadu | కదులుతున్న బస్సులో నుంచి గర్భిణిని తోసేసిన భర్త
మద్యం మత్తులో ఉన్న ఓ భర్త దారుణ ఘటనకు పాల్పడ్డాడు. గర్భిణిగా ఉన్న తన భార్యను కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశాడు

Tamil Nadu | చెన్నై : మద్యం మత్తులో ఉన్న ఓ భర్త దారుణ ఘటనకు పాల్పడ్డాడు. గర్భిణిగా ఉన్న తన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఆమెను కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులోని దిండిగుల్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. దిండిగుల్ జిల్లాలోని వెంబర్పట్టికి చెందిన పాండియన్(24) ఎనిమిది నెలల క్రితం వళర్మతి(19) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వళర్మతి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. ఆదివారం రోజు భార్యాభర్తలిద్దరూ దిండిగుల్ నుంచి పొన్నమరావతికి ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పాండియన్.. బస్సులో భార్యతో గొడవపడ్డాడు. దీంతో గర్భిణి అని చూడకుండా ఆమెను కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశాడు. తీవ్రంగా గాయపడిన వళర్మతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దిండిగుల్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పాండియన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.