Priyanka Gandhi
విధాత: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్న ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే నిరుద్యోగ నిరసన సభలో పాల్గొననున్నారు.
ప్రియాంక గాంధీ ముందుగా ఎల్‌బీ నగర్ చౌరస్తాలోని శ్రీకాంత్ చారీ విగ్రహం వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా సరూర్‌నగర్ స్టేడియంకు చేరుకొని నిరుద్యోగ నిరసన సభలో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రియాంక పర్యటన నేపధ్యంలో నిరుద్యోగ సభకు విద్యార్థులు, నిరుద్యోగులను పెద్ద ఎత్తున సమీకరించే అంశంపై జూమ్ ద్వారా పీసీసీ పీఏసీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, సంపత్ కుమార్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, బలరాం నాయక్ తదితర పీఏసీ సభ్యులు పాల్గొన్నారు.