విధాత: మణిపూర్ హింసాకాండలో యువకులు ప్రాణాలు కోల్పోతున్నా అరికట్టకుండా చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత భవిష్యత్తు మణిపూర్ మంటల్లో కాలిపోతున్నాపట్టించుకోని మోదీ సర్కారు నిష్క్రియాపర్వంపై మండిపడ్డారు.
మణిపూర్‌లో జూలైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌గా మారడంతో రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సంయమనం పాటించాలని ప్రజలను మణిపూర్ ప్రభుత్వం కోరింది. ఇద్దరి కిడ్నాప్, హత్యపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపింది.
కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల అసమర్థతపై ప్రియాంకగాంధీ మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్‌లో భయంకరమైన నేరాలు నిరాటంకంగా కొనసాగడానికి అనుమతిస్తున్నారని ఆమె మంగళవారం ఆరోపించారు. నిష్క్రియపై కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాలని హితవుపలికారు.
“మణిపూర్ నుంచి మరిన్ని షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తున్నది. పిల్లలు జాతి హింసకు ఎక్కువగా గురవుతున్నారు. వారిని రక్షించడానికి చేయగలిగినదంతా చేయడం మన కర్తవ్యం. మణిపూర్‌లో జరుగుతున్న భయంకరమైన నేరాలు మాటల్లో చెప్పలేనివి. అయినప్పటికీ అవి నిరాటంకంగా కొనసాగడానికి అనుమతించబడుతున్నాయి” అని ప్రియాంక విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన నిష్క్రియాత్మకతకు సిగ్గుపడాలి అని ఆగ్రహం వ్యక్తంచేశారు.