Site icon vidhaatha

DHARANI: రైతుల భూములకు పట్టాదారు ‘గ్రామంలో లేరు’ తండ్రి కాలంలో ‘డాట్‌’

పార్ట్‌-2

DHARANI: భూమి సమస్యలకు సర్వరోగ నివారణి ధరణి అన్న ప్రభుత్వం.. పోర్టల్‌లో అనేక ఆప్షన్లు ఇవ్వలేదు. ఇచ్చిన వాటికేమో దరఖాస్తు చేయగానే రిజక్ట్‌ అని వస్తున్నది. ఇవ్వని వాటికి దరఖాస్తు కూడా చేసుకోలేని పరిస్థితి రైతులకు ఏర్పడింది. చివరకు వారసత్వ బదలాయింపులకూ ఇబ్బంది పడాల్సిన దుస్థితి ధరణిలో ఏర్పడింది. జాయింట్‌ రిజిస్ట్రేషన్లకు మంగళం పాడారు… కొన్ని భూములకు పట్టదారుకాలంలో ‘గ్రామంలో లేరు’ అని, తండ్రి కాలంలో ‘డాట్‌’ అని నమోదు చేసిన వైనం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నింటినీ సరి చేయాలని పౌర సమాజం కోరుతోంది. ఆయా సమస్యలపై కేబినెట్‌ సబ్ కమిటీ (Cabinet Sub committee) చేసిన సూచనలు కూడా అమలులోకి రాకపోవడం గమనార్హం. ఈ మేరకు కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ ఇచ్చిన వినతి పత్రం సారాంశం ఇలా ఉంది.

విధాత: ధరణి (Dharani)లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ధరణి పోర్టల్‌ వచ్చి మూడేళ్లు కావస్తున్నా… సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించినట్లు లేదు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పహాణిలో నమోదవుతూ వచ్చిన కొంత మంది రైతుల పేర్లు ధరణి వచ్చాక కనిపించకుండాపోయాయి. ఇలాంటి భూములకు ధరణిలో పట్టాదారు కాలంలో ‘గ్రామంలో లేరు’ అని, తండ్రి కాలంలో ‘డాట్‌’ అని నమోదు చేశారు.

ఫలితంగా ఆయా భూముల యజమానులు (Landowners) పాత పాస్‌ పుస్తకంతో కలిపి కొత్త పాస్‌ బుక్‌ (New Pattadar Pas Book) కోసం నమోదు చేసుకుంటే రిజెక్ట్‌ చేస్తున్నారు. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లా తరుపల్లెలో46 ఎకరాల భూమికి పట్టాదారు కాలంలో ‘గ్రామంలో లేరు’ అనే పేరుతో ఎంట్రీ చేశారు. తండ్రి కాలంలో ‘డాట్‌’ పెట్టారు. అయితే ఆ భూముల రైతులంతా అక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటుండటం గమనార్హం. ఇది రెవెన్యూ అధికారుల దాష్టీకానికి పరాకాష్ట.

జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఏది?

ధరణిలో ఎన్నెన్నో చిత్రాలున్నాయి. జాయింట్‌ రిజిస్ట్రేషన్‌కు ఆప్షన్‌ ఇవ్వలేదు. దీంతో గతంలో జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ అయిన ఆస్తులను అమ్మాలన్నాకొనాలన్నా వీలు కావడంలేదు. క్రయ విక్రయాల పరంగా ఒకే అమ్మకం దారు… ఒకే కొనుగోలు దారు ఉంటేనే లావాదేవీలు జరుగుతున్నాయి.

పాస్‌ బుక్‌ లేకుంటే ఫౌతీ ఏది?

వివిధ కారణాల వల్ల కొత్త పాస్‌ బుక్‌ రాని రైతులు ఏదో ఒక కారణంతో మరణిస్తే సదరు రైతు వారసులకు భూమిని విరాసత్‌ (ఫౌతీ) చేయడం లేదు. చనిపోయిన రైతు పేరున ఉన్న భూమిని వారసుల పేరుమీదకు మార్చాలంటే ధరణిలో భూ యజమానికి సంబంధించిన పాస్‌ బుక్‌ తప్పని సరిగా నమోదుచేయాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాల వల్ల కొంత మంది రైతులకు కొత్త పాస్‌ బుక్‌లు రాలేదు. ఈ తరహా రైతులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే కొత్తపాస్‌బుక్‌ లేదన్న కారణంతో ఫౌతీ చేయడం లేదు. అలాగే ఆధార్‌ (Aadhar) కార్డ్‌ వ్యవస్థ రావడానికి ముందు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరిట మ్యుటేషన్‌ (Mutation)కాకముందే మరణిస్తే, అలాంటి వారి వారసులకు భూమిపై యజమాన్య హక్కులు కల్పించడం ఇబ్బంది అవుతున్నది.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోనూ..

రిజిస్ట్రేషన్ల (Registration)ప్రక్రియలోనూ అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్‌ సమయంలో హాజరు కాలేని భూ యజమానులు తమ తరఫున కుటుంబ సభ్యులను పంపించేందుకు 32(ఏ) ఆథరైజేషన్‌ పత్రాన్ని ఇస్తే.. దాని ఆధారంగా సబ్‌ రిజిస్ట్రార్‌ (Sub Registrar)భూ యజమాని సూచించిన వారితో లావాదేవీలు పూర్తి చేసే వాడు. ధరణిలో ఈ విధానానికి చరమగీతం పాడారు. ఫలితంగా క్రయవిక్రయాలలో భూ యజమానులు, కొనుగోలు దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే పాత రిజిస్ట్రేషన్‌ విధానంలో పిల్లల (మైనర్ల) పేరిట గిఫ్ట్‌ డీడ్‌ (Gift Deed) చేయడానికి వీలుండేది. పిల్లల సంరక్షకుడి పేరు జత చేస్తూ రిజిస్ట్రేషన్‌ చేసి హక్కు పత్రాలు జారీ చేసే వారు. ధరణిలో ఇలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు.

పట్టదారుల సమస్యలు ఎన్నెన్నో….

క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూచనలు ఇవే..

DHARANI। ధరణిలో రైతు సమస్యలకు పరిష్కారం ఎన్నడో…?

Exit mobile version