PRTU, TPUS
విధాత: PRTU నల్గొండ జిల్లా అధ్యక్షుడు సుంకరి బిక్షం గౌడ్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం సుముఖత చూపకపోవడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సోమవారం సాయంత్రం కల్లా తన సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించినప్పటికీ రాష్ట్ర కమిటీ నుంచి ఈ దిశగా ఎలాంటి చర్యలు.. రాయబారాలు లేకపోవడంతో బిక్షం గౌడ్‌తో పాటు ఆయన వర్గీయులను తీవ్రంగా నిరాశ పరిచింది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20 లక్షలు తీసుకొని బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయానికి, PRTU అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి ఓటమికి బిక్షం గౌడ్ పనిచేశారన్న ఆరోపణలపై ఫైమెన్ కమిటీ విచారణ నివేదిక అనుసరించి పిఆర్టియూ రాష్ట్ర కమిటీ భిక్షంగౌడ్ ను సంఘం నుంచి సస్పెండ్ చేసింది.
అయితే సంఘంలో తన ఎదుగుదలను ఓర్వలేక నిందారోపణలతో తనను సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ తన మద్దతుదారులైన ఉపాధ్యాయులతో కలిసి బిక్షం గౌడ్ ఆదివారం నల్గొండ జిల్లా PRTU కార్యాలయం ఎదుట నిరసన దీక్ష నిర్వహించారు.
ఈ దీక్ష అనంతర పరిణామాల నేపథ్యంలో బిక్షం గౌడ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆయన వర్గీయులు భావించిన దానికి భిన్నంగా PRTU రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. బిక్షంగౌడ్ వ్యవహారంపై సీఎం కేసీఆర్, కేటీఆర్ లు ఆరా తీసి, బిఆర్ఎస్ కు అనుబంధంగా సాగుతున్న PRTU పరిరక్షణకు రాష్ట్ర కమిటీ తీసుకున్న చర్యలను సమర్ధించినట్లుగా తెలిసింది.
ఈ మేరకు పిఆర్టియూ రాష్ట్ర కమిటీ నిర్ణయానికి అనుకూలంగా జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా బిఆర్ఎస్ అధిష్టానం పలు సూచనలు చేసినట్లుగా సమాచారం. బిక్షం గౌడ్ వెంట PRTU ఉపాధ్యాయ సభ్యులు ఎవరు వెళ్లకుండా చూడాలని బిఆర్ఎస్ అధిష్టానం నిర్దేశించిందని PRTU రాష్ట్ర కమిటీ వర్గాలు సైతం వెల్లడించాయి.
బిక్షం గౌడ్ దీక్షకు హాజరైన ఎమ్మెల్యేలు ఎన్. భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డిలు తాము PRTU రాష్ట్ర కమిటీ నాయకులతో మాట్లాడి సస్పెన్షన్ ఎత్తివేస్తామని చెప్పినప్పటికీ ఈ వ్యవహారంలో వారి అంచనాలు తప్పి విఫలమయ్యారు. వారి సూచనలను పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ అంగీకరించక పోవడంతో పాటు బిఆర్ఎస్ అధిష్టానం పెద్దలు పిఆర్టియు రాష్ట్ర కమిటీ నిర్ణయానికి వెన్నుదన్నుగా నిలవడాన్ని ఒక రకంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఊహించలేకపోయారు.
ఆయా పరిణామాలన్నింటి నేపథ్యంలో భిక్షంగౌడ్ సస్పెన్షన్ ఎత్తివేత ప్రస్తుతానికి లేనట్లేనని తేలిపోయింది. ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, రాష్ట్ర పిఆర్టియు అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డిలు అంతా కూడా భిక్షం గౌడ్‌పై విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా లేరు.
పిఆర్టియులో నెలకొన్న తాజా వివాదాలపైన చర్చించేందుకు సోమవారం సాయంత్రం నల్గొండ PRTU కార్యాలయంలో రాష్ట్ర కమిటీ భేటీకి నిర్ణయించింది. చివరి గంటల్లో భేటీ నిర్ణయం వాయిదా వేసుకుని మరో మూడు రోజుల్లో గా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.
అయితే బిక్షంగౌడ్ సస్పెన్షన్ మాత్రం ఎత్తివేసే ప్రసక్తి లేదని ఆ వ్యవహారం ముగిసిపోయినట్లేనని, భేటీలో పిఆర్టియు బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలను మాత్రమే చర్చించడం జరుగుతుందని సదరు రాష్ట్ర కమిటీ నాయకులు స్పష్టం చేశారు. జిల్లా PRTU నూతన అధ్యక్షుడు డిఎస్ ఫణి కుమార్ నేతృత్వంలో త్వరలోనే పిఆర్టియు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
టచ్‌లోకి TPUS (తపస్) నాయకత్వం
PRTU నుంచి భిక్షంగౌడ్ సస్పెన్షన్ ఉపసంహరించుకునే పరిస్థితులు లేకపోవడంతో ఆయన తన భవిష్యత్ కార్యాచరణ దిశగా సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారు. తనతో కలిసి వచ్చే ఉపాధ్యాయులతో కలిసి కొత్త సంఘం ఏర్పాటు చేయడమా లేక మరో సంఘంలో చేరడమా అన్న అంశంపై చర్చలు సాగిస్తున్నారు.
ముఖ్యంగా వందలాది మంది PRTU ఉపాధ్యాయులు తన వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్న భిక్షంగౌడ్ వచ్చే ఎన్నికల్లో నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసి తన సత్తా చాటాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాగా భిక్షంగౌడ్‌ను తమ సంఘంలో చేరాలని బిజెపి అనుబంధంగా వ్యవహరించే తపస్ ఉపాధ్యాయ సంఘం ఆయనతో తెర వెనుక మంతనాలు చేస్తుంది.
బిక్షం గౌడ్‌ను తపస్ లో చేర్చుకునే దిశగా ఆ సంఘ నాయకులకు బిజెపి రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకం చేసినట్లు ప్రచారం సాగుతుంది. రానన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించే షరతుపై బిక్షంగౌడ్ తపస్‌లో చేరే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో బిక్షం గౌడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆయన మద్దతు ధరలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.