PRTU-T | పీఆర్టీయూటీలోకి సుంకరి బిక్షం గౌడ్.. రేపు చేరిక!

విధాత: PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి బహిష్కరణకు గురైన ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి బిక్షం గౌడ్ PRTU-తెలంగాణ ఉపాధ్యాయ సంఘంలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. PRTU నాయకత్వం తనపై విధించిన బహిష్కరణ ఎత్తివేయాలని కోరుతూ బిక్షంగౌడ్ నిరసన దీక్ష, దైవ ప్రమాణాలు సైతం చేసినప్పటికీ సంఘం నాయకత్వం బహిష్కరణ వేటు ఉపసంహరించుకోలేదు. దీంతో 20 రోజులపాటు బహిష్కరణ ఎత్తివేతకు ఎదురుచూసిన భిక్షంగౌడ్ తన మద్దతుదార్లతో పలుమార్లు భేటీ అయిన పిదప PRTU-Tలో చేరేందుకు మొగ్గు చూపారు. […]

  • Publish Date - April 25, 2023 / 11:58 AM IST

విధాత: PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి బహిష్కరణకు గురైన ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి బిక్షం గౌడ్ PRTU-తెలంగాణ ఉపాధ్యాయ సంఘంలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. PRTU నాయకత్వం తనపై విధించిన బహిష్కరణ ఎత్తివేయాలని కోరుతూ బిక్షంగౌడ్ నిరసన దీక్ష, దైవ ప్రమాణాలు సైతం చేసినప్పటికీ సంఘం నాయకత్వం బహిష్కరణ వేటు ఉపసంహరించుకోలేదు.

దీంతో 20 రోజులపాటు బహిష్కరణ ఎత్తివేతకు ఎదురుచూసిన భిక్షంగౌడ్ తన మద్దతుదార్లతో పలుమార్లు భేటీ అయిన పిదప PRTU-Tలో చేరేందుకు మొగ్గు చూపారు. బుధవారం నల్గొండ లక్ష్మీ గార్డెన్ లో పిఆర్టియుటి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డిలతో పాటు ఆ సంఘం రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముదిరేసి చెన్నయ్య, మారెడ్డి అంజిరెడ్డిల సమక్షంలో బిక్షం గౌడ్ తన వందలాది మంది మద్దతుదారులైన ఉపాధ్యాయులతో కలిసి PRTU-T లో చేరనున్నట్లుగా ప్రకటించారు.

నిజానికి PRTU నుంచి భిక్షం గౌడ్ ను బహిష్కరించగానే ఆయనను BJP అనుబంధం ఉపాధ్యాయ సంఘం తపస్ నాయకత్వం తమ సంఘంలోకి రావాలని ఆహ్వానించింది. ఈ దశలో హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో PRTU అభ్యర్థి ఓటమి నేపథ్యంలో ఆ సంఘం నుండి భిక్షం గౌడ్ బహిష్కరణకు గురవ్వడం సహా ఇతర పరిణామాలపై BRS అధిష్టానం పోస్టుమార్టం సాగించింది.

పేరుకే తమ పార్టీకి అనుబంధంగా ఉన్న PRTU నాయకత్వం తమ కనుసన్నలలో నడవడం లేదన్న భావనతో బిఆర్ఎస్ అధిష్టానం మరో కొత్త ఉపాధ్యాయ సంఘం స్థాపన దిశగా కూడా ఆలోచన చేసింది. పిఆర్టియుటి బలోపేతంపై కూడా BRS చర్చ చేసింది.

ఈ క్రమంలోనే PRTU నుంచి బహిష్కరించబడిన బిక్షం గౌడ్ సహా ఇతర బహిష్కృత నాయకులు, అసంతృప్త ఉపాధ్యాయులు BJP అనుబంధ తపస్ సంఘంలోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా PRTU-Tని BRS నాయకత్వం ముందుకు తీసుకు వచ్చినట్లుగా ప్రచారం సాగుతుంది. BRS సంకేతాల మేరకే బిక్షం గౌడ్ తపస్ సంఘంలోకి వెళ్లకుండా PRTU నాయకత్వంపై అసమ్మతిగా ఉన్న వారందరితో కలిసి PRTU-Tలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారని సమాచారం.

అలాగే రానున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం పిఆర్టియుటి అభ్యర్థిగా సైతం భిక్షం గౌడ్ ను ప్రకటించే షరతుపైనే ఆయన PRTU-Tలోకి వెళుతుండటం ఆసక్తికరం. ఇదే ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిత్వం వివాదం నేపథ్యంలోనే పిఆర్టియు నుంచి తనను బహిష్కరించినట్లు బిక్షం గౌడ్ ఆరోపించడం ఈ సందర్భంగా గమనార్హం.

మొత్తం మీద పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం నుండి PRTU-Tలోకి భిక్షం గౌడ్ ఎంతమందిని తన వెంట తీసుకువెళ్తారన్న అంశంతో పాటు, ఎంత మేరకు తన పాత సంఘాన్ని చీల్చగలుగుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.