పార్లమెంట్ భద్రతా వైఫల్యం.. నిందితులకు సైకోఅనాలసిస్ టెస్టులు
పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఆరుగురు నిందితులను వేర్వేరుగా విచారిస్తూ, కీలక సమాచారాన్ని రాబడుతున్నారు

న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆరుగురు నిందితులను వేర్వేరుగా విచారిస్తూ, కీలక సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు. అయితే నిందితుల మానసికస్థితిని అంచనా వేసేందుకు వారికి సైకో అనాలసిస్ టెస్టులు నిర్వహించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. అంతేకాకుండా పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ వదలడానికి గల వారి ఉద్దేశాలను కనుగొనడంలో ఈ కూడా టెస్టులు ఉపయోగపడుతాయని పోలీసులు తెలిపారు.
ఈక్రమంలో నిన్న ఒక నిందితుడిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికి తరలించారు. ఆరుగురిని కూడా ఒకరి తర్వాత ఒకరిని టెస్టు చేయనున్నారు. ఈ టెస్టు ప్రశ్న -జవాబు పద్ధతిలో నిర్వహిస్తారు. సైక్రియాటిస్టులు, దర్యాప్తు సంస్థల అధికారుల సమక్షంలో నిందితులను పరీక్షించనున్నారు. నిందితులు చెప్పే సమాధానాలను సైక్రియాటిస్ట్, దర్యాప్తు అధికారులకు వివరిస్తారు. మొత్తంగా ఆ దాడి వెనుకన్న ఉద్దేశాలను కనుగొని, ఒక అంచనాకు వస్తారు. ఒక్కో నిందితుడిని టెస్టు చేసేందుకు మూడు గంటల సమయం పడుతోంది.
శ్రద్ధా వాకర్ హత్య కేసులోనూ సైకో అనాలసిస్ టెస్టు దర్యాప్తు అధికారులకు, ఢిల్లీ పోలీసులకు ఎంతో ఉపయోగపడిందని తెలిసింది. ఈ క్రమంలో ఆరుగురు నిందితులకు సైకోఅనాలసిస్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. సాగర్ శర్మ, మనోరంజన్, నీలం దేవి, అమోల్ షిండేకు జనవరి 5వ తేదీ వరకు పోలీసు కస్టడీ పొడిగించిన విషయం విదితమే.