RAHUL GANDHI | రాహుల్‌కు శిక్ష.. కాంగ్రెస్‌కు శాపమా? వరమా?

సంక్షోభ వేళ కాంగ్రెస్‌ పార్టీ నెత్తిన బీజేపీ పాలు! సూరత్‌ కోర్టు తీర్పు అమలైతే తనను తాను నిరూపించుకోవాల్సిన కాంగ్రెస్‌ నాయకత్వం క్లీన్‌ ఇమేజ్‌తో కీలక నేతగా ప్రియాంకకు చాన్స్‌ విపక్షాలనూ ఏకం చేసిన బీజేపీ అత్యుత్సాహం సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో.. పై కోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు 30 రోజుల పాటు శిక్ష అమలును తీర్పు ఇచ్చిన కోర్టే నిలిపివేసినప్పటికీ.. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడింది! ఈ అత్యుత్సాహం ఎవరిదనేది పక్కనపెడితే.. అసలు రాహుల్‌పై […]

RAHUL GANDHI | రాహుల్‌కు శిక్ష.. కాంగ్రెస్‌కు శాపమా? వరమా?
  • సంక్షోభ వేళ కాంగ్రెస్‌ పార్టీ నెత్తిన బీజేపీ పాలు!
  • సూరత్‌ కోర్టు తీర్పు అమలైతే తనను తాను నిరూపించుకోవాల్సిన కాంగ్రెస్‌ నాయకత్వం
  • క్లీన్‌ ఇమేజ్‌తో కీలక నేతగా ప్రియాంకకు చాన్స్‌
  • విపక్షాలనూ ఏకం చేసిన బీజేపీ అత్యుత్సాహం

సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో.. పై కోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు 30 రోజుల పాటు శిక్ష అమలును తీర్పు ఇచ్చిన కోర్టే నిలిపివేసినప్పటికీ.. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడింది! ఈ అత్యుత్సాహం ఎవరిదనేది పక్కనపెడితే.. అసలు రాహుల్‌పై అనర్హత వేటు కాంగ్రెస్‌కు వరమా? శాపమా? అన్న చర్చ కూడా జరుగుతున్నది. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్‌కు వరమే అంటున్న పలువురు రాజకీయ విశ్లేషకులు.. అదే సమయంలో బీజేపీ తన చర్యతో పరోక్షంగా ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.

విధాత : రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి ఈ ఏడాది జూన్‌లో 53 ఏళ్లు వస్తాయి. తప్పని పరిస్థితిలో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే.. ఆ రెండేండ్లు.. ఆ తర్వాత ఆరేండ్లు.. మొత్తంగా ఎనిమిదేండ్లు ఆయన పార్లమెంటరీ రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందే. దేశంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప.. లేదంటే రాహుల్‌ పోటీ చేసేందుకు అవకాశం కల్పించే సార్వత్రక ఎన్నికలు 2034లో జరుగుతాయి. అప్పటికి రాహుల్‌కు 65 ఏండ్లు వస్తాయి. ఈ ఒక్క కేసే కాదు.. ఇతర కేసులు కూడా ఆయనకు వ్యతిరేకంగానే నడుస్తున్నాయి.

అన్నింటికంటే ముఖ్యమైనది నేషనల్ హెరాల్డ్‌ కేసు. కానీ వీటన్నింటినీ విడిగా చూడలేము. కాంగ్రెస్‌ (Congress) పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యం ఒకవైపు.. సీనియర్‌ నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లటం.. అందులోనూ బీజేపీ(BJP)లో చేరడం మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి దారుణ ఓటమిని చవి చూడటం, అదే ఎన్నికల్లో తాను పోటీచేసిన అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఘోర పరాభవం ఇంకోవైపు.. ఇలా అనేక పరిణామాల మధ్య కాంగ్రెస్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్‌పై వేటు పడింది.

రాహుల్‌కు శిక్ష పడటం కాంగ్రెస్‌కు చెడ్డ వార్తా? అంటే కాదనే చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది నిస్సందేహంగా కాంగ్రెస్‌కే కాకుండా రాహుల్‌కు కూడా ఒక మంచి అవకాశమేనని చెబుతున్నారు. ఆయన ఏం చేయాలనుకున్నారో అది చేసేందుకు, దేశం కోసం ఒక ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు దృష్టి కేంద్రీకరించాలని చెబుతున్నారు. పార్లమెంటరీ వేదికల్లో అవకాశం లేని నేత కాబట్టి.. విస్తృతంగా జనబాహుళ్యంలోకి వెళ్లే సదవకాశం లభిస్తుందని చెబుతున్నారు.

నిజానికి భారత్‌ జోడో యాత్ర.. రాహుల్‌ వ్యక్తిత్వాన్ని, దేశం పట్ల ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చివేసిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ప్రధానంగా బీజేపీ, దాని మాతృ సంస్థ ఆరెస్సెస్‌ భావజాలంపైనే ఆయన యుద్ధం తలపెట్టారని అంటుంటారు. జాతీయవాదం ముసుగులో ప్రవహిస్తున్న ఆరెస్సెస్‌ భావజాలమే దేశానికి అత్యంత ప్రమాదకరమని రాహుల్‌ భావిస్తున్నారు.

ఎన్నికల పోరాటం, ఏ పార్టీతో పొత్తులు అనే అంశం కంటే.. దేశ ప్రజాస్వామిక పునాదులను కనబడకుండా కబళించి వేస్తున్న ఆరెస్సెస్‌ భావజాలాన్ని తుడిచిపెట్టడమే రాహుల్‌ లక్ష్యమని చెబుతున్నారు. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ చేసిన ప్రసంగాలను గమనిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పడు నిరంతరం ప్రజల మధ్య ఉండేందుకు చక్కటి అవకాశాన్ని బీజేపీ నేతలే రాహుల్‌కు వరంగా ప్రసాదించారన్న చర్చ కూడా జరుగుతున్నది.

కొంత ఇబ్బంది ఉన్నా.. సవాళ్లను ఎదుర్కొనే అవకాశం

రాహుల్‌గాంధీపై వేటు కాంగ్రెస్‌ పార్టీని తీవ్ర ఇబ్బందికి గురి చేసే అంశమే అనటంలో సందేహం లేదు. అదే సమయంలో రాహుల్‌ తెరమరుగు కానప్పటికీ.. కాస్త వెనక్కు తగ్గడం అనివార్యమైన పరిస్థితి వస్తే అది పార్టీకి ఎన్నో విధాలుగా ప్రయోజనాలు కలిగిస్తుందని చెబుతున్నారు. తమకు ఎన్నికల్లో గెలిచేందుకు రాహుల్‌గాంధీ అతిపెద్ద ఆస్తి అని బీజేపీ నేతలు హాస్యానికి చెబుతున్నా.. అందులో కొంత మాత్రమే నిజం ఉన్నది. వాస్తవానికి కొంత భయం కూడా ఉన్నది.

గురువారం నాటి తీర్పు కానీ.. మరుసటి రోజు లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ కానీ తేల్చిచెబుతున్నది అదే. ఈ కీలక సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. పార్టీకి కలిగిన ఈ కుదుపు.. పార్టీని మేలుకొల్పేదని, మరింత పట్టుదలతో పని చేసే ఉత్సాహాన్ని కల్పించేదని అంటున్నారు.

ప్రతిపక్షాల అనుమానం ఇదీ..

కొన్ని కీలక రాజకీయ పార్టీలు మూడో కూటమి వాదన తెరపైకి తేవడం వెనుక కూడా ‘రాహుల్‌’ అంశమే ఉన్నది. బీజేపీపై పోరాటం చేసే క్రమంలో ఏర్పడే కూటమిలో కాంగ్రెస్‌ ఉంటే.. బీజేపీ ఆ కూటమిని హైజాక్‌ చేసి.. దానికి రాహుల్‌ నాయకుడనే భ్రమను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తమ ఐక్యతను దెబ్బ తీస్తుందని కొన్ని బీజేపీయేతర ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల అఖిలేశ్‌యాదవ్‌, మమతా బెనర్జీ ప్రత్యామ్నాయ కూటమి ప్రకటన సమయంలో ముందుకు వచ్చిన అంశం కూడా ఇదే.

ఇటువంటి సమయంలో అనుకోకుండా ప్రతిపక్షాల నెత్తిన బీజేపీ పాలుపోసిందని చెప్పుకోవచ్చు. ఇప్పడు రాహుల్‌ ప్రధాని అభ్యర్థిగా చెప్పే పరిస్థితిలో లేని కాంగ్రెస్‌.. ఇతర ప్రతిపక్షాలకు ఎలానూ ఇబ్బందికర పార్టీ కాదు. కనుక పొత్తులు కుదిరే రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు ఇతర బీజేపీయేతర పక్షాలు అభ్యంతరం పెట్టే అవకాశాలు లేవు. ఇది నిస్సందేహంగా బీజేపీకి ఎదురుదెబ్బే అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

పట్టువిడుపులుంటే చాలు

రాహుల్‌ అంత దూకుడు ప్రదర్శించకపోయినా.. సంకీర్ణ కూటమి చర్చల్లో కాంగ్రెస్‌ తన పెద్దన్న వైఖరిని వదులుకునేందుకు అంగీకరించినా ఈ మూడో కూటమి ప్రస్తావనే రాదు. ఎందుకంటే.. మూడో కూటమి ఏది వచ్చినా అది అంతిమంగా.. పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చేదే అవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాహుల్‌గాంధీతో చర్చలకంటే.. రాహుల్‌ తల్లి సోనియా గాంధీ పట్ల మమత సానుకూలంగా కనిపిస్తారు. ప్రధాని కావాలని ఆశలు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా సోనియాను కలిసేందుకు ప్రయత్నించారు.

నిన్నమొన్నటి వరకూ ప్రధాని రేసులో ఉన్న బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌.. సోనియాగాంధీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తితోనే ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తరచూ రాహుల్‌పై విమర్శలు గుప్పించకపోయినా.. కనీకనిపించకుండా హేళన చేస్తుంటారు. అయితే.. రాహుల్‌కు సూరత్‌ కోర్టు శిక్ష విధించిన తర్వాత ఆయన స్వరం మారింది.

కాంగ్రెస్‌తో తమకు విభేదాలున్నా.. ఒక పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీని ఇలా ఇరికించడం సరైందికాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బీజేపీయేతర పార్టీలను, వాటి నాయకులను తప్పించేందుకు కుట్ర జరుగుతున్నదని కూడా ఆయన ఆరోపించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ సైతం రాహుల్‌పై అనర్హత వేటును తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్‌ను వదులుకోని ఇతర పక్షాలు

ఇక్కడ మరొక ఆసక్తికర అంశం ఉన్నది. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీకి తృణమూల్‌, ఆప్‌ వంటి ప్రతిపక్ష పార్టీలు లేఖ రాశాయి. అందులో కాంగ్రెస్‌ లేదు. కానీ.. రాహుల్‌గాంధీకి సూరత్‌ కోర్టు శిక్ష విధించిన మరుసటి రోజైన శుక్రవారం ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ 14 రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి.

విశేషం ఏమిటంటే.. ఈ జాబితాలో కాంగ్రెస్‌ ఉన్నది. ఏది ఏమైనా కాంగ్రెస్‌ను ప్రతిపక్షాలు వదులు కోవడానికి ఇష్టపడటం లేదు. రాహుల్‌ను బూచిగా చూపించి ప్రతిపక్షాల్లో చీలిక తెచ్చేందుకు బీజేపీ కుట్ర చేయకుండా నివారించేందుకే కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి చర్చ జరిగిందనేది స్పష్టం. ఇప్పడు రాహుల్‌ బ్యాక్‌ సీట్‌లోకి వెళ్లి, ఇతర నాయకులు ముందుకు వస్తే.. మోదీ, బీజేపీ నేతలు నేరుగా టార్గెట్‌ చేసే నేత దొరకడు. అప్పడు వ్యక్తులు వెనక్కు పోయి.. చర్చాంశాలు ముందుకు వస్తాయి. రావడం అనివార్యం, అవసరం కూడా.

మరి ప్రియాంక సంగతేంటి?

కాంగ్రెస్‌లో ప్రస్తుత సంక్షోభ పరిస్థితి రాహుల్‌గాంధీ చెల్లెలు ప్రియాంకకు కూడా మంచి అవకాశమే. ఆమె రాజకీయంగా పార్టీలో పట్టు సాధించేందుకు వీలు చిక్కుతుంది. పైపెచ్చు.. ఆమె హెయిర్‌స్టైల్‌, పోలికలు నానమ్మ ఇందిరాగాంధీని గుర్తుకు తెస్తుంటాయి. అంతేకాదు.. ఆమె అద్భుతంగా ఉపన్యసించగ‌లరు, కష్టించి పనిచేయగలరు అనే దాంట్లో సందేహం ఏమీ లేదు. ఆమె రంగంలో ఉంటే.. బీజేపీ తన ఫేవరెట్‌ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని బాగా మిస్‌ అవుతుంది.

పైగా ప్రియాంకగాంధీపై విమర్శలు కుప్పించడం, ఆమెపై రాజకీయంగా దాడి చేయడం కూడా బీజేపీకి సాధ్యం కాదు. తన సోదరుడిని బాధితుడిని చేశారంటూ ప్రచారం చేసుకునే అవకాశం కూడా ప్రియాంకకు ఉంటుంది. ప్రియాంకపై ఎలాంటి కేసులు లేవు. ఆమె భర్త రాబర్ట్‌ వాధ్రాపై అవినీతి ఆరోపణలు గతంలో చేసినా.. ఇప్పడు వాటిని మళ్లీ తీసే పరిస్థితి లేదు. గురువారం ప్రియాంక తన సోదరుడికి మద్దతుగా, మోదీని టార్గెట్‌ చేస్తూ ఒక ట్వీట్‌ చేశారు. బహుశా.. ఇప్పడు ఆమె సోషల్‌ మీడియా పోస్టుల పరిధిని దాటి.. తన సోదరుడి సాహసోపేతమైన అడుగుజాడల్లో నడిచేందుకు, ఒక బృహత్తర కర్తవ్యాన్ని భుజాన మోసేందుకు ఇదే తగిన సమయమేమో.