KMCలో ర్యాగింగ్ భూతం.. పీజీ మెడికో ఆత్మహత్యాయత్నం

KMC పాలనయంత్రాంగం నిర్లక్ష్యం విద్యార్థి సంఘాల ఆందోళన సీనియర్ పీజీ డాక్టర్ సైఫ్ అరెస్ట్ సంఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు గుట్టు చప్పుడు కాకుండా కాకతీయ మెడికల్ కాలేజీలో (KMC) ర్యాగింగ్ అప్రతిహతంగా సాగుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాలేజీ పాలనయంత్రంగానికి ఈ విషయాలు తెలిసినప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. కాలేజీ పరువు, ప్రతిష్టల పేరుతో విషయాలను, ఫిర్యాదులను తొక్కి పట్టి జూనియర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పీజీ మెడికో […]

KMCలో ర్యాగింగ్ భూతం.. పీజీ మెడికో ఆత్మహత్యాయత్నం
  • KMC పాలనయంత్రాంగం నిర్లక్ష్యం
  • విద్యార్థి సంఘాల ఆందోళన
  • సీనియర్ పీజీ డాక్టర్ సైఫ్ అరెస్ట్
  • సంఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు
  • ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు

గుట్టు చప్పుడు కాకుండా కాకతీయ మెడికల్ కాలేజీలో (KMC) ర్యాగింగ్ అప్రతిహతంగా సాగుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాలేజీ పాలనయంత్రంగానికి ఈ విషయాలు తెలిసినప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. కాలేజీ పరువు, ప్రతిష్టల పేరుతో విషయాలను, ఫిర్యాదులను తొక్కి పట్టి జూనియర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పీజీ మెడికో ధరావత్ ప్రీతి(Preethi) ఆత్మహత్యాయత్నం సంఘటన నేపథ్యంలో ర్యాగింగ్ సంఘటన వెలుగు చూసింది. ఈ వ్యవహారాలకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ తదితరులు పట్టించుకోకపోవడం కారణమని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో పీజీ అనిస్తీసియా చదువుతున్న మెడికో ధ‌రావత్ ప్రీతి ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో కాలేజీలో జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కలకలం సృష్టించిన ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు (Students unions) భగ్గుమన్నాయి.

ప్రీతిని సీనియర్ పీజీ వేధింపులకు గురిచేసినందునే హానికరమైన ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఆమె తండ్రి నరేందర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మట్టేవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలకు గురైన సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్(Principal) స్పందించలేదు

తన కుమార్తె ప్రీతిని మరో సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేసినప్పటికీ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోలేదని తండ్రి నరేందర్ ఆరోపించారు. ఈ విషయం తన దృష్టికి తెచ్చి తన బిడ్డ కన్నీరు మున్నీరయిందని తెలిపారు. సకాలంలో కాలేజీ యజమాన్యం స్పందిస్తే నా బిడ్డకు ఈ పరిస్థితి వచ్చేది కాదని కన్నీరు పెట్టుకున్నారు. తన బిడ్డ ఈ స్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిమ్స్‌కు తరలింపు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని నిమ్స్ కు తరలించారు.

విద్యార్థి సంఘాల ఆందోళన

(Kmc)కేఎంసీలో జరుగుతున్న అక్రమాలు ర్యాగింగ్ కు (Ragging)వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు బుధవారం సాయంత్రం ధర్నా చేపట్టాయి. కళాశాలలో విచ్చలవిడిగా ర్యాగింగ్ సాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. జూనియర్ విద్యార్థులు ఈ విషయం కేఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్‌కు, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు (Complaint)చేసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు.

ఈ కారణంగానే గత్యంతరం లేక ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ సంఘటనకు కారణమైన మరో సీనియర్ పీజీ విద్యార్థి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ లతో పాటు ఇతరులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిత్యం పలు సంఘటనలు జరుగుతున్నప్పటికీ బయటికి పొక్కకుండా, మీడియా దృష్టికి రాకుండా విద్యార్థులను (Students)బెదిరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రీతి సంఘటనపై విచారణ: డాక్టర్ చంద్రశేఖర్

పీజీ మెడికో ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటనపై కమిటీ వేసి విచారణ ప్రారంభించినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. విచారణ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇదిలా ఉండగా తండ్రి నరేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.