Rahul Gandhi: బీహార్‌ ఎన్నికల్లోనూ మహారాష్ట్ర మోడల్‌

Rahul Gandhi: బీహార్‌ ఎన్నికల్లోనూ మహారాష్ట్ర మోడల్‌

రిగ్గింగ్‌లో ‘మహా’ ఎన్నికలు బ్లూ ప్రింట్‌
ఐదు దశల్లో ప్రజాస్వామ్యం రిగ్గింగ్‌
ఈసీ నియామకాలు, నకిలీ ఓటర్లు
ఓటింగ్‌ శాతాల పెంపు.. బోగస్‌ ఓటింగ్‌
ఆఖరిగా అన్ని ఆధారాల దాచివేత
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌
కొట్టిపారేసిన ఎన్నికల కమిషన్‌
సూటిగా సమాధానం కోరిన ఎంపీ

Rahul Gandhi: న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని రిగ్గింగ్‌ చేయడంలో 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బ్లూ ప్రింట్‌ వంటివని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. ఈ మేరకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యేకంగా ఒక వ్యాసం రాశారు. ఒక పద్ధతి ప్రకారం ఇది జరుగుతుందని ఆరోపించారు. ఐదు దశల్లో జరిగే ఈ రిగ్గింగ్‌లో మొదటి దశలో ఎలక్షన్‌ కమిషన్‌ నియామకాల ప్యానెల్‌ను రిగ్‌ చేస్తారని అన్నారు. రెండో దశలో ఓటరు జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చుతారని తెలిపారు. మూడో దశలో ఓటింగ్‌ పెంచేస్తారని రాశారు. నాలుగో దశలో బీజేపీ విజయానికి అవసరమైన చోట్ల బోగస్‌ ఓటింగ్‌ జరుగుతుందని అన్నారు.

ఐదో దశలో అన్ని ఆధారాలూ దాచేస్తారని మండిపడ్డారు. తన వ్యాసం కథనాన్ని ఎక్స్‌లో కూడా ఆయన పోస్టు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఎందుకు అంత నిరాశతో ఉన్నదో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఆ పోస్టులో పేర్కొన్నారు. రిగ్గింగ్‌ అనేది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వంటిదని, అది ఆటలో గెలిచేందుకు ఉపయోపడుతుంది కానీ.. వ్యవస్థలను ధ్వంసం చేసి, ఫలితాలపై ప్రజల నమ్మకాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ విషయంలో ఆందోళన ఉన్న భారతీయులందరూ ఆధారాలను చూడాలని, బేరీజు వేసుకుని, సమాధానాలను డిమాండ్‌ చేయాలని కోరారు. ఎందుకంటే.. మహారాష్ట్రలో జరిగిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. తదుపరి బీహార్‌లో, ఆ తర్వాత బీజేపీ ఓడిపోయేందుకు అవకాశం ఉన్న ఏ ప్రాంతాల్లోనూ ప్రవేశిస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఏ ప్రజాస్వామ్యానికైనా విషం లాంటిదని పేర్కొన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాలు తెల్లారేసరికి గణనీయంగా పెరిగిపోయిన అంశాన్ని రాహుల్‌ తన వ్యాసంలో ప్రస్తావించారు. సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతంగా ఉంటే.. తదుపరి ఓటింగ్‌ ముగిసిన తర్వాత కూడా అది అమాంతం పెరుగుతూ పోయిందని, చివరకు మరుసటి రోజు తెల్లవారుజామున 66.05 శాతంగా పేర్కొన్నారని తెలిపారు.

అంటే.. ఏకంగా 7.83 శాతం పెరుగుదల ఉన్నదని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాథమిక ఓటింగ్‌ శాతాలు, సవరించిన శాతాల వివరాలను కూడా ఆయన పొందుపర్చారు. 2009లో ప్రాథమిక ఓటింగ్‌ 60% ఉంటే.. తుది లెక్కల్లో 59.50% ఉందని తెలిపారు. అంటే తేడా మైనస్‌ 0.50 శాతం. ఇక 2014లో ప్రాథమిక ఓటింగ్‌ 62 శాతం, తుది లెక్కల్లో 63.08 శాతం (తేడా 1.08శాతం), 2019లో ప్రాథమిక ఓటింగ్‌ 60.46 శాతం, తుది లెక్కలు 61.10 శాతం (తేడా 0.64 శాతం) ఉన్నాయని తెలిపారు. కానీ.. 2024లో మాత్రం ఏకంగా 7.83 శాతం ఓటింగ్‌ శాతం పెరిగిపోయిందన్నారు.

ఆరోపణలన్నీ పనికిమాలినవి

దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌.. రాహుల్‌ ఆరోపణలన్నీ పనికిమాలినవని తేల్చి చెప్పింది. ప్రతి ఎన్నికల ప్రక్రియ సన్నద్ధత, ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు అన్నీ ప్రభుత్వ సిబ్బంది ద్వారానే జరుగుతున్న విషయంపై దేశ ప్రజలందరికీ అవగాహన ఉందని పేర్కొంది. ఇవన్నీ ఆయా రాజకీయ పార్టీలు నియమించిన వ్యక్తుల సమక్షంలోనే సాగుతాయని తెలిపింది. మీకు సానుకూలంగా ఫలితాలు రాలేదని ఎన్నికల సంఘాన్ని నిందించడం తగదని పేర్కొన్నది.

తప్పించుకోవడం కాదు.. సమాధానం చెప్పాలి

ఎన్నికల సంఘం వివరణపై మళ్లీ రాహుల్‌ ఎక్స్‌లో స్పందిస్తూ.. ఎవరి సంతకాలు లేని, తప్పించుకునే ధోరణిలో నోట్‌ విడుదల చేయడం కాకుండా.. తాను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీరు దాచిపెడుతున్నది ఏమీ లేనట్టయితే.. తన వ్యాసంలో ప్రస్తావించిన అంశాలపై సమాధానాలు చెప్పి, రుజువు చేయాలని అన్నారు. మహారాష్ట్ర సహా ఇటీవలి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల డిజిటల్‌ మెషీన్‌ రీడబుల్‌ వోటర్‌ జాబితాను బయట పెట్టాలని, మహారాష్ట్ర పోలింగ్‌ బూత్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో సాయంత్రం ఐదు తర్వాత రికార్డింగ్స్‌ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘దాట వేయడం మీ విశ్వసనీయతను కాపాడలేదు. కానీ.. నిజం చెప్పడం ద్వారా కాపాడుకోవచ్చు’ అని పేర్కొన్నారు.