Rahul Gandhi | అదానీ అంశంపై ప్రధానిలో కంగారు.. వారి మధ్య రహస్య ఒప్పందం: రాహుల్‌గాంధీ

Rahul Gandhi | జేపీసీతో విచారణ జరపాల్సిందే మీడియా సమావేశంలో రాహుల్‌ ముంబై : మారిషస్‌ షెల్‌ కంపెనీల ద్వారా అదానీ కుటుంబ సభ్యులే అదానీ గ్రూప్‌లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్న వార్తలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. శతకోటీశ్వరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీగ్రూప్‌ షేర్లలో ఆయన కుటుంబీకులే రహస్య నిధులను మారిషస్‌ నుంచి తరలించి, కృత్రిమంగా షేర్‌ విలువను పెంచారని తాజాగా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌, […]

  • By: krs    latest    Aug 31, 2023 11:32 PM IST
Rahul Gandhi | అదానీ అంశంపై ప్రధానిలో కంగారు.. వారి మధ్య రహస్య ఒప్పందం: రాహుల్‌గాంధీ

Rahul Gandhi |

  • జేపీసీతో విచారణ జరపాల్సిందే
  • మీడియా సమావేశంలో రాహుల్‌

ముంబై : మారిషస్‌ షెల్‌ కంపెనీల ద్వారా అదానీ కుటుంబ సభ్యులే అదానీ గ్రూప్‌లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్న వార్తలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. శతకోటీశ్వరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీగ్రూప్‌ షేర్లలో ఆయన కుటుంబీకులే రహస్య నిధులను మారిషస్‌ నుంచి తరలించి, కృత్రిమంగా షేర్‌ విలువను పెంచారని తాజాగా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌, కరప్షన్‌ రిపోర్టింగ్‌ నెట్‌వర్క్‌ (ఓసీసీఆర్పీ) బయట పెట్టడం దేశంలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.

2013 నుంచి 2018 మధ్యకాలంలో అదానీ గ్రూప్‌ షేర్‌ అనూహ్యంగా పెరిగిపోవడానికి ఈ అవకతవకలే కారణమన్న ఆరోపణలకు ఈ నివేదిక మరింత బలాన్ని చేకూర్చుతున్నది. ఈ విషయంలో సమగ్రంగా దర్యాప్తు జరగాలని రాహుల్‌గాంధీ గురువారం ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్‌ చేశారు. ‘ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?ఎందుకు ఆయన దీనిపై విచారణ చేయించడం లేదు?’ అని ఆయన ప్రశ్నించారు.

అదానీ విషయంలో ప్రపంచ ప్రఖ్యాత ఫైనాన్షియల్‌ వార్తా పత్రికలు అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తాయని చెబుతూ వాటి క్లిప్పింగులను రాహుల్‌ మీడియాకు ప్రదర్శించారు. జీ20 సమావేశం నేపథ్యంలో భారతదేశ ప్రతిష్ఠ ప్రమాదం అంచున నిలిచిందని అన్నారు. ఈ విషయంలో ప్రధాని తగిన చర్యలు తీసుకుని, దర్యాప్తు జరిపించాలని అన్నారు. ‘ఒక రకమైన భయానికి ఇది సంకేతమేమో. ఇదే తరహా భయాన్ని నేను పార్లమెంటులో మాట్లాడినప్పుడు చూశాను. ఆ భయం వల్లనే అకస్మాత్తుగా నా లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయించారు’ అని రాహుల్‌గాంధీ చెప్పారు.

ఈ అంశాలన్నీ నేరుగా ప్రధాని మోదీని చుట్టుముడుతున్నాయి కాబట్టే ఆయనకు ఈ భయమని అన్నారు. ‘అదానీ అంశాన్ని ఎప్పుడు లేవనెత్తినా ప్రధాని చాలా ఇబ్బందికి గురవుతారు. కంగారుపడిపోతుంటారు’ అని చెప్పారు. తాజాగా మరోసారి ఓసీసీఆర్పీ నివేదిక కూడా అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేస్తున్నందున ఈ విషయంలో తన పేరును మోదీ క్లియర్‌ చేసుకోవాలని, ఏం జరుగుతున్నదో విస్పష్టంగా దేశానికి చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని ఆయన పునరుద్ఘాటించారు.

‘ప్రధాని మోదీ ఈ విషయంలో విచారణకు ఎందుకు ఒత్తిడి చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ అంశంపై విచారణ జరిపిస్తామని, బాధ్యులను కటకటాల వెనక్కు పంపుతామని ఆయన ఎందుకు చెప్పడం లేదు? జీ 20 దేశాల సదస్సు నేపథ్యంలో ఇవి చాలా తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడని చెప్పే యజమానికి చెందిన ఒక ప్రత్యేకమైన కంపెనీ యథేచ్ఛగా వ్యవహరిస్తుంటే ఎందుకు వదిలేస్తున్నారని ఆయన నిలదీశారు.

అదానీ గ్రూప్‌ షేర్లకు మద్దతుగా అదానీ కుటుంబ సభ్యులే షేర్లను కొనుగోలు చేశారన్న వార్తలపై రాహుల్‌ స్పందిస్తూ.. దీని వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్‌ గౌతం అదానీ సోదరు వినోద్‌ అదానీ అని ఆరోపించారు. డబ్బును గిరికీలు కొట్టించిన (రౌండ్‌ ట్రిప్పింగ్‌) వ్యవహారంలో మరో ఇద్దరు విదేశీయులు నాజర్‌ అలీ షబాన్‌ అహిల్‌, చైనాకు చెందిన చాంగ్‌ ఛుంగ్‌ లింగ్‌ ఉన్నారని తెలిపారు. దాదాపు యావత్‌ దేశంలోని మౌలిక వసతులను నియంత్రిస్తున్న కంపెనీ విలువ విషయంలో ఈ ఇద్దరు విదేశీయులను ఎందుకు అనుమతించారని నిలదీశారు.