Rahul Gandhi | మోదీ కళ్లలో భయం చూశా.. జీవితాంతం జైల్లో పెట్టినా నేను ఆగను: రాహుల్ గాంధీ
Rahul Gandhi On Disqualification | ఏం జరిగినా అదానీ-మోదీ సంబంధాలపై ప్రశ్నించడం మానను.. రూ.20వేలకోట్లు ఎవరివో చెప్పాలి? అనర్హత వేటు వేస్తే భయపడేవాడిని కాదు ఆందోళన పడటం లేదు.. ఉత్సాహంగా ఉన్నా మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ విధాత: ప్రధాని మోదీ తన గురించి భయపడుతున్నారని, అందుకే తనపై అనర్హత వేటు పడిందని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అన్నారు. మోదీ కళ్లలో భయం చూశానని చెప్పారు. తనపై అనర్హత […]

Rahul Gandhi On Disqualification |
- ఏం జరిగినా అదానీ-మోదీ సంబంధాలపై ప్రశ్నించడం మానను..
- రూ.20వేలకోట్లు ఎవరివో చెప్పాలి?
- అనర్హత వేటు వేస్తే భయపడేవాడిని కాదు
- ఆందోళన పడటం లేదు.. ఉత్సాహంగా ఉన్నా
- మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్
విధాత: ప్రధాని మోదీ తన గురించి భయపడుతున్నారని, అందుకే తనపై అనర్హత వేటు పడిందని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అన్నారు. మోదీ కళ్లలో భయం చూశానని చెప్పారు. తనపై అనర్హత వేటు వేసినంత మాత్రాన భయపడేది లేదని తేల్చి చెప్పారు.
అదానీకి, మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటని మరోసారి నిలదీశారు. ‘నా తదుపరి ప్రసంగం గురించి ప్రధాని మోదీ (Narendra Mod) భయపడటం వల్లే నాపై అనర్హత వేటు పడిందని ఆయన కళ్లలో నేను భయం చూశానన్నారు. అందుకే వారు నన్ను పార్లమెంటులో మాట్లాడనీయటం లేదు’ అని రాహుల్ చెప్పారు.
ఏం జరిగినా తాను మాత్రం ప్రశ్నించడం మానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ అధినేత మీడియాతో సమావేశమయ్యారు.
మీడియాతో రాహుల్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రతిరోజూ కొత్త ఉదాహరణలు లభిస్తున్నాయని చాలా సార్లు చెప్పానన్నారు. అదానీకి షెల్ కంపెనీలున్నాయని, అందులో ఎవరో రూ.20వేలకోట్ల పెట్టుబడి పెట్టారని.. అది అదానీ డబ్బు మాత్రం కాదన్నారు. అదానీకి మౌలిక సదుపాయాల వ్యాపారం ఉందన్న ఆయన.. ఈ డబ్బు మాత్రం అదానీది మాత్రం కాదన్నారు.
ఈ పెట్టుబడులపై తాను ప్రశ్నించానని, దీనిపై పార్లమెంట్లో ఆధారాలతో ప్రశ్నించానన్నారు. ఈ సందర్భంగా అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న సంబంధాలపై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య సంబంధం కొత్తది కాదని, పాతదేనన్నారు. మోదీ గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఉందన్నారు. మోదీ తన మిత్రుడుతో సంతోషంగా విమానంలో కూర్చున్న ఫొటోను చూపించాననన్నారు.
ఆ తర్వాత తన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారన్నారు. పాయింట్ బై పాయింట్‌గా స్పీకర్‌కు వివరంగా లేఖ రాశానని, నిబంధనలు మార్చి అదానీకి విమానాశ్రయాలు అప్పగించినట్లు చెప్పారు. మార్చిన నిబంధనల కాపీ ఉందని, ఈ విషయంపై లేఖ రాసిన స్పందన లేదన్నారు. పార్లమెంట్లో మంత్రులన్నీ తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.
తాను విదేశీ శక్తుల సహాయం కోరానని చెప్పారని, దేశ అంతర్గత విషయాల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని తాను కోరుకోవటం లేదని స్పస్టం చేశారు. సభ్యుడిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే ఆ సభ్యుడికి సమాధానం చెప్పే హక్కు పార్లమెంటు నిబంధనపై స్పీకర్‌కు చెప్పానన్నారు. దీనిపై రెండుసార్లు లేఖ రాసినా స్పందన లేదని, స్పీకర్ చాంబర్‌కు సైతం వెళ్లినట్లు తెలిపారు.
ఎంతో మంది తప్పుడు ఆరోపణలు చేశారని, తనను ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ప్రశ్నిస్తే.. స్పీకర్ చిరునవ్వు నవ్వి.. నేను ఇది చేయలేను అని అన్నారన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరందరూ చూశారని చెప్పారు. తాను ప్రశ్నలు అడగడం ఆపనని, మోదీకి అదానీకి సంబంధం ఏమిటో తేలాలన్నారు. రూ.20వేలకోట్లు ఎవరివో అడుగుతూనే ఉంటానన్నారు. ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.
‘నాకు ఒకే ఒక అడుగు ఉన్నది. అది సత్యం కోసం పోరాడటం. ఈ దేశ ప్రజాస్వామిక స్వభావాన్ని పరిరక్షించుకోవడం. నన్ను జీవితాంతం అనర్హుడిగా చేయండి.. జీవితాంతం జైల్లో పెట్టండి.. నేను మాత్రం ఆగను. నేను ఆందోళనలో ఉన్నానని అనుకుంటున్నారా? లేదు.. నేను ఉత్సాహంగా ఉన్నాను’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
తనపై అనర్హత వేటు వేసినా, బెదిరింపులకు దిగినా, లాక్కు వెళ్లి జైలులో పెట్టవచ్చన్నారు. తాను భారత ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానని, పోరాడుతూనే ఉంటానన్నారు. దేనికీ భయపడేది లేదన్నారు. ఈ సందర్భంగా ఓబీసీ కమ్యూనిటీని అవమానించారన్న వ్యాఖ్యలపై స్పందించారు. అన్ని సంఘాలు కలిసి నడవాలని భారత్ జోడోయాత్ర ద్వారా చెబుతున్నానని, దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కానీ, తాను మూడు బిలియన్ డాలర్ల ఇష్యూపై ప్రశ్నించడం మాననన్నారు. రాజకీయాలు తనకు ఫ్యాషన్ కాదని, జీవితంలో తపస్సులాంటిదనన్నారు. నన్ను అనర్హులుగా ప్రకటించినా నన్ను కొట్టండి, నన్ను జైల్లో పెట్టినా తగ్గేది లేదన్నారు. ఈ దేశం తనకు ప్రేమనిచ్చిందని, అందుకే తాను ఇదంతా చేస్తున్నానన్నారు. వయనాడ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని, వారికి లేఖ రాయాలనుకుంటున్నానన్నారు