భారత్ జోడో యాత్ర పేరు మారింది.. జనవరి నుంచి రెండో విడత
కాంగ్రెస్ పార్టీ మరో యాత్రకు శ్రీకారం చుట్టింది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు కాంగ్రెస్ ప్రకటించింది

- ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం..
- 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా 6000 కి.మీ. యాత్ర చేయనున్న రాహుల్
- మణిపూర్ నుంచి ముంబై వరకు
- ఇంఫాల్‌లో ప్రారంభించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ : దక్షిణాదిలోని కన్యాకుమారి నుంచి ఉత్తరాదిలోని కశ్మీర్ వరకూ భారత్ జోడో పేరిట పాదయాత్ర చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ.. ఇప్పుడు తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన ముంబై వరకు మరో యాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ బుధవారం ప్రకటించింది. భారత్ జోడో యాత్ర-2 త్వరలో ప్రారంభం అవుతుందని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రెండో దఫా యాత్రకు భారత్ న్యాయ్ యాత్ర అని నామకరణం చేశారు. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జనవరి 14న రాహుల్ గాంధీ మణిపూర్‌లో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. మార్చి 20వ తేదీన ముంబైలో ముగియనుంది. భారత్ న్యాయ యాత్ర బస్సు, కాలినడకన కొనసాగనుంది. మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మీదుగా కొనసాగనుంది. ‘భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ న్యాయ్ యాత్రను చేపట్టనున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు. ఇంఫాల్‌లో జనవరి 14న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 28న నాగపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ ర్యాలీకి రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధతను చాటుతూ ‘హై తయ్యార్ హమ్’ (మేం సిద్ధం) అని నామకరణం చేశారు.
దేశ ప్రజల ఆర్థిక, సామాజకి, రాజకీయ న్యాయాన్ని కాపాడటంపై భారత్ న్యాయ్ యాత్ర దృష్టిసారిస్తుందని జైరాం రమేశ్ చెప్పారు. యాత్ర సమయంలో మహిళలు, యువత, బలహీనవర్గాలవారితో రాహుల్ గాంధీ మాట్లాడుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రధానంగా బస్సు ద్వారా సాగే ఈ యాత్రలో మధ్యమధ్యలో పాద యాత్ర ఉంటుందని చెప్పారు. తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతానికి రాహుల్ రెండో దఫా యాత్ర చేపట్టాలని డిసెంబర్ 21న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. యాత్ర ప్రారంభానికి మణిపూర్‌ను ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు వేణుగోపాల్ బదులిస్తూ.. దేశంలో అదొక ముఖ్యమైన భాగమని, దానితోపాటు అక్కడి ప్రజల గాయాలను మాన్పించే ప్రక్రియను ప్రారంభించాలని కాంగ్రెస్ భావించిందని తెలిపారు. కుకీలు, మైతేయి తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. మే 3న మొదలైన ఘర్షణల్లో ఇప్పటి వరకూ దాదాపు 200 మంది చనిపోయారు. 60వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రధానంగా ఆర్థిక అసమానతలు, నియంతృత్వ పరిపాలనపై దృష్టిపెట్టారని, ఈసారి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కాపాడే అంశంలో కేంద్రీకరిస్తారని జైరాం రమేశ్ తెలిపారు.
ఐక్యత, ప్రేమ, సామరస్యాల సందేశాన్ని భారత్ జోడో యాత్ర ద్వారా వ్యాప్తి చేసిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడు దేశ ప్రజలకు న్యాయం కోసం యాత్ర చేస్తారని చెప్పారు. ఈ యాత్రలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు పాల్గొంటాయా? అన్న ప్రశ్నకు.. యాత్ర విధి విధానాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉన్నదని వేణుగోపాల్ తెలిపారు. అయితే.. గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా వివిధ పార్టీల నాయకులు రాహుల్‌తో కలిసి నడిచిన సందర్భాలను జైరాం రమేశ్ గుర్తు చేశారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్.. 2023 జనవరి 30న తన పాదయాత్రను కశ్మీర్‌లో ముగించిన సంగతి తెలిసిందే. 136 రోజులపాటు సాగిన ఈ యాత్రలో ఆయన 4,081 కిలోమీటర్లు నడిచారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాలు, 76 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా ఆయన యాత్ర సాగింది. ఈ యాత్ర సందర్భంగా 12 బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగించారు. దాదాపు వంద వీధిసమావేశాల్లో, 13 మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. వాటితోపాటు ముందే నిర్ణయించుకున్న విధంగా 275 వాకింగ్ ఇంటరాక్షన్స్, 100 సిటింగ్ ఇంటరాక్షన్స్‌లో పాల్గొన్నారు.