Rahul Gandhi | రాహుల్ గాంధీకి దక్కని ఊరట.. మధ్యంతర స్టే ఇవ్వని సెషన్స్ కోర్టు, బెయిల్ పొడిగింపు

పిటిషన్‌పై మే 3న సూరత్‌ కోర్టులో విచారణ విధాత : మోదీ ఇంటిపేరును కించపర్చారన్న కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ బెయిల్‌ను ఏప్రిల్‌ 13 వరకు సూరత్‌ కోర్టు పొడిగించింది. ఈ కేసులో తదుపరి విచారణ మే 3న చేపట్టనున్నట్టు ప్రకటించింది. తనపై శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ రాహుల్‌గాంధీ సోమవారం మధ్యాహ్నం సూరత్‌ కోర్టును ఆశ్రయించారు. నేరారోపణపై స్టే ఇవ్వాలని ఒక పిటిషన్‌, శిక్ష రద్దు కోరుతూ […]

Rahul Gandhi | రాహుల్ గాంధీకి దక్కని ఊరట.. మధ్యంతర స్టే ఇవ్వని సెషన్స్ కోర్టు, బెయిల్ పొడిగింపు
  • పిటిషన్‌పై మే 3న సూరత్‌ కోర్టులో విచారణ

విధాత : మోదీ ఇంటిపేరును కించపర్చారన్న కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ బెయిల్‌ను ఏప్రిల్‌ 13 వరకు సూరత్‌ కోర్టు పొడిగించింది. ఈ కేసులో తదుపరి విచారణ మే 3న చేపట్టనున్నట్టు ప్రకటించింది. తనపై శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ రాహుల్‌గాంధీ సోమవారం మధ్యాహ్నం సూరత్‌ కోర్టును ఆశ్రయించారు. నేరారోపణపై స్టే ఇవ్వాలని ఒక పిటిషన్‌, శిక్ష రద్దు కోరుతూ మరో పిటిషన్‌ను దాఖలు చేశారు.

అయితే.. నేరారోపణపై స్టే ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. అందరి వాదనలు వినకుండా స్టే ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నది. బెయిల్‌ను మాత్రం ఏప్రిల్‌ 13 వరకు పొడిగించింది. విచారణను మే 3న చేపట్టనున్నది. రాహుల్‌ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కూడా కోర్టుకు వచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

2019లో కర్ణాటకలో జరిగిన ఒక సభలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. దొంగలందరి ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉంటుందని అన్నారు. దీనిపై గుజారాత్‌ మంత్రి పూర్ణేశ్‌ మోదీ పరువు నష్టం కేసు పెట్టారు. మార్చి 23న తీర్పు వెలువరించిన కోర్టు.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్‌.. ఆయనను అనర్హుడిగా ప్రకటించింది.

ఇది రాజకీయ దురుద్దేశపూరితమేనని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. అదానీ, మోదీ సంబంధాలపై తాను పార్లమెంటులో చేయబోయే తదుపరి ప్రసంగం గురించి ప్రధాని భయపడ్డారని, ఆయన కళ్లలో భయం చూశానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటామని కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. ఈ క్రమంలోనే సోమవారం రాహుల్‌గాంధీ సూరత్‌ కోర్టుకు వచ్చి.. పిటిషన్‌ దాఖలు చేశారు. నేరారోపణ ఉత్తర్వులను తన క్లయింట్‌ అన్ని విధాలుగా సవాలు చేస్తారని రాహుల్‌ తరఫు న్యాయవాది కిరిట్‌ పాన్‌వాలా చెప్పారు.

సత్యమే నా అస్త్రం

సూరత్‌ కోర్టు బెయిల్‌ పొడిగించిన అనంతరం రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. ఇది మిత్ర్‌కాల్‌కు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న యుద్ధమని అభివర్ణించారు. ఈ యుద్ధంలో సత్యమే తన అస్త్రమని, సత్యమే తన అండ అని పేర్కొన్నారు.