Rangabali Review | రంగబలి ఫస్టాఫ్ ‘భలే’.. సెకండాఫ్ జనం ‘బలి’
Rangabali Review | చిత్రం పేరు: ‘రంగబలి’ విడుదల తేదీ: 07 జూలై 2023 నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజ, షైన్ టామ్ చాకో, గోపరాజు రమణ, సత్య, మురళీ శర్మ, శరత్ కుమార్, బ్రహ్మాజీ తదితరులు సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు సంగీతం: పవన్ సిహెచ్ ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి కథ, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి నాగశౌర్య సినిమా పేరు ‘రంగబలి’ అని రివీల్ చేయగానే.. ఇదేదో ‘బాహుబలి’ బ్రదర్ […]

Rangabali Review |
చిత్రం పేరు: ‘రంగబలి’
విడుదల తేదీ: 07 జూలై 2023
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజ, షైన్ టామ్ చాకో, గోపరాజు రమణ, సత్య, మురళీ శర్మ, శరత్ కుమార్, బ్రహ్మాజీ తదితరులు
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
సంగీతం: పవన్ సిహెచ్
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
కథ, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నాగశౌర్య సినిమా పేరు ‘రంగబలి’ అని రివీల్ చేయగానే.. ఇదేదో ‘బాహుబలి’ బ్రదర్ అన్నట్లుగా టైటిల్ పరంగా టాక్ నడిచింది. టైటిల్ వైవిధ్యంగా ఉండటంతో.. ఏదో ఆసక్తికరమైన సినిమా అయితే వస్తున్నట్లుగా అనిపించింది. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత.. నాగశౌర్య ఈసారి కాస్త భారీగానూ, వెరైటీగానూ రాబోతున్నట్లుగా అనిపించింది. తన లవర్‌బాయ్ ఇమేజ్‌కి సరిపడా కథ, తను కోరుకుంటున్న మాస్ ఎలిమెంట్స్‌తో నిండిన యాక్షన్‌తో పాటు ప్రేక్షకులు కోరుకుంటున్న కామెడీని మిక్స్ చేసి.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటు ఉండదనేలా బాక్సాఫీస్ పైకి దాడి చేయబోతున్నట్లుగానే అనిపించింది.
ఇవన్నీ అటుంచితే.. రీసెంట్‌గా కమెడియన్ సత్య కామెడీ ఇంటర్వ్యూ.. ఈ సినిమాని వార్తలలో ఉంచింది. అందరూ ఈ సినిమాపై ఓ లుక్ వేసేలా చేసింది. ఇక నాగశౌర్య కొన్నాళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. యావరేజ్ టాక్‌కే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అతనికి ఈ సినిమా విజయం చాలా కీలకం. ఎందుకంటే శౌర్యకి హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. అందుకే ఈసారి కచ్చితంగా కొడుతున్నామనే ధీమాని ఈ సినిమా విషయంలో శౌర్య వ్యక్తపరుస్తూ వస్తున్నాడు. మరి నాగశౌర్య అనుకుంటున్నట్లుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడి.. ఆయనకి బ్లాక్‌బస్టర్ ఇస్తుందా? అసలు బాహుబలి తరహా టైటిల్‌తో వచ్చిన ఈ ‘రంగబలి’లో ఉన్న మ్యాటరేంటీ అనేది మన రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కథగా చెప్పాలంటే ఇది రొటీన్ కథే. సొంతూరులో కింగ్‌లా బతకాలని నేటి జనరేషన్ కూడా అనుకుంటూ ఉంటారు. సొంతూరులో ఉండే కుర్రబ్యాచ్ కాలరేగరేస్తూ.. స్థానబలం ప్రకటించుకునే ప్రయత్నాలు చేయడం.. ఈ క్రమంలో ఆ ఊరిలో ఉండే ఏదో ఒక సమస్యకు ఈ కాలర్ ఎగరేసే కుర్రోడికి లింక్ పెట్టడం వంటి కథలతో ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. అలా చూస్తే.. ఇది కూడా అలాంటి బ్యాక్‌డ్రాప్‌తో నడిచే సినిమానే. సరేలే అవన్నీ విశ్లేషణలో చెప్పుకుందాంలే కానీ.. కథలోకి వస్తే.. సొంత ఊరు రాజవరంలో కింగ్‌లా బతకాలని, తను చేసే పని పది మందికి తెలిసి పొగడాలని అనుకుంటూ ఉంటాడు శౌర్య (నాగశౌర్య). ఆ ఊరంటే అతనికి అంత ఇష్టం. అందుకే వేయాల్సిన షో లన్నీ వేస్తూ.. పేరు శౌర్య అయినా.. ‘షో’గాడుగా అందరూ పిలుచుకునేలా మారిపోతాడు.
తన తండ్రి విశ్వం (గోపరాజు రమణ) ఆ ఊరిలో ఓ మెడికల్ షాప్ నడుపుతుంటాడు. అతనంటే ఆ ఊరిలో అందరికీ గౌరవం. కొడుకు చేసే ‘షో’లు చూడలేక.. ఎలాగైనా అతనికి బాధ్యతలు నేర్పాలని.. తన తర్వాత తన మెడికల్ షాప్ చూసుకునేలా ఫార్మసీ ట్రైనింగ్ కోసం వైజాగ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో శౌర్యని జాయిన్ చేస్తాడు. సొంత ఊరు వదిలి వెళ్లలేక వెళ్లిన షో.. అక్కడ సహజ (యుక్తి తరేజ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వారి ప్రేమ వ్యవహారం సహజ తండ్రి (మురళీశర్మ)కి తెలిసిపోతుంది.
ముందు పెళ్లికి ఓకే కూడా చెబుతాడు. కానీ ‘షో’ది రాజవరం అని తెలిసి.. రంగబలి సెంటర్ కారణంగా చివరి నిమిషంలో పెళ్లికి అంగీకరించడు. సహజ తండ్రికి, రాజవరంలో ఉన్న రంగబలి సెంటర్‌కి, ఆ ఏరియా ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో)కి ఉన్న లింక్ ఏంటి? అసలు ‘రంగబలి’ సెంటర్ ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? ఆ ‘రంగబలి’ సెంటర్ సమస్యను తీర్చేందుకు షో ఏం చేశాడు? చివరికి అతని ప్రయత్నాలు ఫలించాయా? లేదా? తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. ఇంతకు ముందు వచ్చిన సినిమాలలో కూడా, ముఖ్యంగా ‘ఛలో’ సినిమాలో ఇదే తరహాలో కనిపిస్తాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు, కామెడీ సీన్స్‌లో కూడా శౌర్య మెరిశాడు. అతనికి ఈ సినిమా ఎంత వరకు యూజ్ అవుతుందనేది చెప్పలేం కానీ.. తన పాత్ర వరకు మాత్రం నాగశౌర్య ఎక్కడా తగ్గలేదు. ఆయన కామెడీ టైమింగ్ కూడా అలరిస్తుంది. కొత్తమ్మాయి యుక్తి తరేజ.. పేరుకు తగ్గట్లే సహజంగా కనిపించింది. అలా అనీ గ్లామర్ ప్రదర్శన విషయంలో ఏమైనా తగ్గిందని అనుకుంటారేమో.. సెకండాఫ్‌లో వచ్చే ఓ సాంగ్‌లో అయితే.. రొమాంటిక్ ప్రియుల్ని కళ్లు పక్కకు కూడా తిప్పుకోనివ్వదు. కాస్త మంచి సబ్జెక్ట్స్ ఎన్నుకుంటే మాత్రం కొన్నాళ్లు ఈ పేరు ఇండస్ట్రీలో వినబడే అవకాశం అయితే లేకపోలేదు.
ఇక ఈ సినిమా మెయిన్ స్థంభం ఎవరయ్యా అంటే.. కచ్చితంగా కమెడియన్ సత్య పేరే చెప్పాలి. అగాధం అనే పాత్రలో సత్య నటనకు, పండించిన హాస్యానికి ఈ ఏడాది ఉత్తమ కమెడియన్ అవార్డ్ ఇచ్చేయవచ్చు. సెకండాఫ్‌లో కూడా అతనికి కాస్త స్కోప్ పెంచినట్లయితే.. సినిమా స్థాయిని మార్చేసేవాడు. ఫస్టాఫ్ మాత్రం శౌర్య కంటే కూడా సత్యకే ఎక్కువ మార్కులు పడతాయి. గోపరాజు రమణ ఎప్పటిలానే తన సహజ నటనను బయటికి తీస్తే.. మిగతా పాత్రలు చేసిన మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, ఇంకా ఇతర కమెడియన్స్ అందరూ వారి పాత్రల పరిధిమేర నటించారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కాసేపు కనిపిస్తారు. విలన్‌గా పరశురామ్ పాత్రలో షైన్ టామ్ చాకో మంచి నటనను కనబరిచారు. ‘దసరా’ తర్వాత అతనికి మరో మంచి పాత్ర అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర పాత్రలలో చేసిన వారంతా ఓకే.
సాంకేతికంగా..
సాంకేతికంగా ఈ సినిమా కథకు కావాల్సిన విధంగా ఉంది. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. పాటలు అంతగా అర్థం కాలేదు కానీ.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఓకే. ఎడిటింగ్ పరంగా సెకండాఫ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సెకండాఫ్‌లో ల్యాగ్ సీన్లు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఇక దర్శకుడు విషయానికి వస్తే.. ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద కూడా పెట్టి ఉంటే మాత్రం కచ్చితంగా శౌర్యకు ఈ సినిమా మంచి హిట్ ఇచ్చేది. ఫస్టాఫ్ అంతా హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేసి.. సెకండాఫ్ మాత్రం సినిమా స్వరూపాన్నే మార్చేశాడు దర్శకుడు. కథలో వేలు పెట్టే హీరో అని పేరున్న శౌర్య ఫోర్స్ చేశాడో.. లేదంటే దర్శకుడే అలా కథ రాసుకున్నాడో తెలియదు కానీ.. సెకండాఫ్ ఈ సినిమాకు మైనస్ అని చెప్పుకోవచ్చు.
విశ్లేషణ:
వైజాగ్ జగదాంబ సెంటర్, బెజవాడ బెంజ్ సర్కిల్.. ఇలా కొన్ని సెంటర్స్ ఫేమస్ అయినవి ఉంటాయి. అలాంటి వాటికి పేర్లు మార్చినా కూడా మొదటి నుంచి అక్కడ ఉండే జనాల్లో ఆ ఎమోషన్ మాత్రం పోదు. అలాగే దర్శకుడు ఈ సినిమాని ‘రంగబలి’ సెంటర్‌ని అనుకుని కథ రాసుకున్నాడనిపిస్తుంది.. కానీ ఆ ఎమోషన్‌ని క్యారీ చేయడంలో మాత్రం దర్శకుడు ట్రాక్ తప్పాడు.
అలాగే టైటిల్‌లో నిగూడార్థం, సినిమాలో ఓ సెంటర్‌కు జనాలు భయపడటం వంటివి.. విజయవాడకు చెందిన ఓ నాయకుడి పేరు, అతనికి సంబంధించిన కథ అనేలా కూడా కొన్ని సీన్లు అనిపిస్తాయి. ఫస్టాఫ్ అంతా సరదాసరదాగా సాగిన ఈ సినిమా సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కొన్ని లాజిక్ లెస్ సీన్స్‌తో సెకండాఫ్‌ని నడిపించిన దర్శకుడు.. క్లైమాక్స్‌ని మరీ పేలవంగా చేసేయడంతో.. ఫస్టాఫ్ అంతా.. ఓ మంచి సినిమా చూస్తున్నామని అనుకున్నవారంతా.. సినిమా అయిపోయి బయటికి వచ్చేటప్పుడు మాత్రం.. ఇంతోటి దానికి ఈ సినిమా తీయాలా? అనుకుంటారంటే.. సెకండాఫ్, క్లైమాక్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలాగే హీరోహీరోయిన్లు మధ్య ప్రేమ చిగురించే ఎపిసోడ్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్ అన్నీ కృత్రిమంగా అనిపిస్తాయి. శరత్ కుమార్ కనిపించే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా అంత గొప్పగా అనిపించదు. ఫస్టాఫ్‌లో సత్య కామెడీ మాత్రం ఈ సినిమాకే హైలెట్ అని చెప్పుకోవాలి. అందుకే అతనికి అవార్డ్ ఇవ్వవచ్చని అంది. ఫస్టాఫ్ చూసిన కుర్రాళ్లంతా.. ఒక్కసారిగా వాళ్ల ఊరుని గుర్తు చేసుకునేలా చేసిన దర్శకుడు.. ఇంటర్వెల్ వరకు ఆ మూడ్‌ని కంటిన్యూ చేయగలిగాడు.
ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ వేసిన తర్వాత.. సెకండాఫ్ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా వెళితే.. సినిమా హిట్టే అని మైండ్‌లో అనుకుని.. ఛాయ్ తాగి థియేటర్‌లోకి వెళ్లి చూస్తే.. కాసేపు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అలా సెకండాఫ్ విషయంలో దర్శకుడు చేతులెత్తేశాడు. ఇది ఎవరిలోపం, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలు ఇక్కడ అప్రస్తుతం కాబట్టి.. సినిమా పరంగా మాత్రం సగమే సక్సెస్ అని చెప్పొచ్చు.
మొత్తంగా అయితే నాగశౌర్య హిట్ కోసం ఇంకో సినిమా చూసుకోవాల్సిందే. రీసెంట్‌గా వచ్చిన ‘సామజవరగమన’ సినిమా నవ్వులతో నింపేసింది కాబట్టి.. ఈ సినిమా ఫస్టాఫ్ పరంగా కూడా కొందరు ప్రేక్షకులు శాటిస్‌ఫై కాకపోవచ్చు. బాక్సాఫీస్ వద్ద కూడా తీవ్ర పోటీ ఉండటం.. రాబోయే ప్రతి శుక్రవారం రెండుకు మించి సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటం చూస్తే.. ఈ సినిమా గట్టిక్కే అవకాశాలు తక్కువనే చెప్పుకోవాలి. సత్య కామెడీ కోసం అయితే ఓసారి చూడొచ్చు.
ట్యాగ్‌లైన్: ఫస్టాఫ్ ‘భళా’.. సెకండాఫ్ ‘బాలే’
రేటింగ్: 2.25/5