విధాత: అత్యుత్సాహం ఒక్కోసారి పీకల మీదకు తెస్తుంది.. జోరులో.. హుషారులో మాట్లాడిన మాటలు పరువూ మర్యాదను గంగపాల్జేస్తోంది. జనసేన తరఫున గెలిచి, తరువాత వైసీపీలోకి ఫిరాయించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కెరీర్ మొదట్లో సర్పంచుగా ఎలా గెలిచింది.. గెలుపు వెనుక మర్మాన్ని చెప్పేశారు.. ఇంకేముంది.. అతి రహస్యం బట్టబయలు అన్నట్లుగా మారింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు వైసిపి ఎమ్మెల్యేలను టిడిపి డబ్బులతో కొనుగోలు చేసి ఓటు వేయించుకున్నట్లు ప్రచారం జరగడం.. నలుగురు ఎమ్మెల్యేలను వైసిపి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే..
ఈ నేపథ్యంలో రాపాక కూడా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని.. ఉండి ఎమ్మెల్యే రామరాజు తనను సంప్రదించారని రాపాక ఆరోపణలు చేశారు. అయితే తాను విలువలకు ప్రజాస్వామ్యానికి కట్టుబడి జగన్ తోనే ఉన్నానన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రాపాక వరప్రసాద్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో తాను సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని రాపాక బాంబు పేల్చారు. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్ లో తనకు దొంగ ఓట్లు పడేవని తెలిపారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేసేసేవారన్నారు. దీంతో తనకు చింతలమోరి గ్రామంలో మంచి మెజార్టీ తెచ్చుకున్నట్లు ఓపెన్ అయిపోయారు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తనకు రూ.10 కోట్లు ఆఫర్ చేసినా వెళ్లలేదని.. విలువలకే కట్టుబడ్డానన్న రాపాక వ్యాఖ్యలకు.. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ వ్యాఖ్యలు పొంతన లేకుండా ఉన్నాయంటున్నారు. తనకు అన్ని నైతిక విలువలు ఉంటే జనసేన తరఫున గెలిచి జగన్ పక్షాన ఎందుకు చేరారో చెప్పాలని ఇప్పుడు జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా రాజోలులోని ఆయన కార్యాలయం వద్ద జనసేన కార్యకర్తలు ధర్నా చేశారు.