మూత్రం రంగు అప్పుడ‌ప్పుడూ రంగు మార‌డానికి అస‌లు కార‌ణ‌మిదే..

కొన్ని సార్లు మ‌న‌కు మూత్రం (Urine) ప‌సుపుప‌చ్చ (Yellow Color) రంగులో రావ‌డం జ‌రుగుతుంది

  • Publish Date - January 4, 2024 / 09:44 AM IST

కొన్ని సార్లు మ‌న‌కు మూత్రం (Urine) ప‌సుపుప‌చ్చ (Yellow Color) రంగులో రావ‌డం జ‌రుగుతుంది. ఇలా అయిన‌ప్పుడు వేడి చేసింద‌నో, నీరు ఎక్కువ తాగాల‌నో చాలా మంది అనుకుంటారు. అయితే మూత్రం ఇలా అప్పుడ‌ప్పుడు ప‌సుపు ప‌చ్చ రంగులో వ‌స్తుందో శాస్త్రవేత్త‌ల‌కు కూడా అంతుబ‌ట్ట‌లేదు. తాజాగా జ‌రిపిన ఒక అధ్య‌య‌నం (Study) లో దీనికి గ‌ల కార‌ణాన్ని వారు క‌నుగొన్నామ‌ని చెబుతున్నారు. యూరిన్ అనేది మ‌న శ‌రీర డ్రైనేజీ సిస్టంలో చివ‌రి ఉత్ప‌త్తి. శ‌రీరానికి అవ‌స‌రం లేని నీటితో పాటు కిడ్నీలు పంపిన వ్య‌ర్థాలు క‌లిపి మూత్రం రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. ఈ వ్య‌ర్థాల్లో జీవిత కాలం అయిపోయిన చ‌నిపోయిన ర‌క్త క‌ణాలూ ఉంటాయి.


ముఖ్యంగా ఎర్ర‌ర‌క్త‌క‌ణాలు. ఇవి త‌మ విధుల్లో భాగంగా హిమె అనే మూల‌కాన్ని ఉత్ప‌త్తి చేస్తాయి. ఇదే మూత్రం ప‌సుపు ప‌చ్చ‌గా మార‌డానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. ఇంత‌కాలం శాస్త్రవేత్త‌లు యురోబిలిన్ అనే ర‌సాయ‌న మూల‌కం వ‌ల్లే ఈ మార్పు జ‌రుగుతుంద‌ని భావించేవారు. అయితే దీనంత‌టికీ మూల కార‌ణం హిమెలో ఉంద‌ని ఇప్పుడు తేలింది. మ‌న పేగులో ఉండే ఉప‌యోగ‌క‌ర బ్యాక్టీరియా హిమెను వివిధ మూల‌కాలుగా విభ‌జిస్తుంద‌ని.. ఇవి మూత్రంలోకి ప్ర‌వేశించి రంగు మారుస్తాయ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.


ఆరు నెల‌ల జీవిత కాలం త‌ర్వాత ఎర్ర ర‌క్త క‌ణాల జీవిత కాలం పూర్త‌వుతుంది. వీటి నుంచి బైలిరూబిన్ అనే మూల‌కం ఉత్ప‌త్త‌వుతుంది. దీనిని మ‌న పేగులో ఉండే బ్యాక్టీరియా చిన్న చిన్న మూల‌కాలుగా విడ‌గొడుతుంది. ఈ మూల‌కాలే ఆక్సిజ‌న్‌తో చ‌ర్య పొందిన‌పుడు ప‌సుపు ప‌చ్చ రంగులోకి మార‌తాయి. వీటికే యురోబిలిన్ అని పేరు అని ప‌రిశోధ‌న‌లో పాలుపంచుకున్న హాల్ వెల్ల‌డించారు. ఈ విష‌యం తెలుసుకోవ‌డానికి ఎందుకు ఇన్ని రోజులు ప‌ట్టింద‌నే దానిపైనా ఆయ‌న స్పందించారు. మ‌న శ‌రీరంలో ఉండే మైక్రోబ‌యోమ్స్‌ను అధ్య‌య‌నం చేయ‌డం అత్యంత క‌ష్ట‌మ‌ని.. అందుకే మూత్రం రంగు విష‌యంలో అస‌లు విష‌యం తెలుసుకోవ‌డ‌నానికి ఇన్ని రోజులు ప‌ట్టింద‌ని చెప్పుకొచ్చారు.


‘దుర‌దృష్ట‌వ‌శాత్తు గ‌ట్ బ్యాక్టీరియాను అధ్య‌య‌నం చేయ‌డం చాలా క‌ష్టం. అక్క‌డ ఆక్సిజ‌న్ చాలా త‌క్కువ మొత్తంలో ఉంటుంది. ఒక‌వేళ ఆక్సిజ‌న్ ఎక్కువ‌గా ఉంటే మ‌నకు మేలు చేసే బ్యాక్టీరియా పేగుల్లో బ‌త‌క‌లేదు. ఆ కార‌ణంతోనే వాటిని ల్యాబ్‌లో ప‌రీక్షించ‌లేం’ అని హాల్ పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ లోని సెల్ బ‌యాల‌జీ, మాలిక్యుల‌ర్ జెనెటిక్స్ విభాగం ఈ ప‌రిశోధ‌న చేయ‌గా.. ఆ వివరాలు జ‌ర్న‌ల్ నేచ‌ర్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

Latest News