అవినీతి, దోపిడీ పాలనను ఓడించండి: రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి

– మద్యం, నోటుకు లోబడకుండా ఓటేయండి
విధాత, సూర్యాపేట: కల్వకుంట్ల కుటుంబ దోపిడీ అరికట్టాలంటే వచ్చే ఎన్నికల్లో ఓడించాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన జాగో తెలంగాణ బస్సు యాత్ర శనివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నిలువునా పాతి పెట్టిందని ధ్వజమెత్తారు. నాటి ఉద్యమ ఆకాంక్షలను విద్రోహం చేస్తూ నాలుగున్నర కోట్ల ప్రజల కలలను వేల కోట్ల కుంభకోణాలతో కల్వకుంట్ల కుటుంబం తన్నుకు పోయిందని ఆరోపించారు.
తెలంగాణాకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చిన కల్వకుంట్ల కుటుంబ దోపిడీ అరికట్టాలంటే వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో విద్యా, వైద్యం పూర్తిగా నాశనమైందని, ఎన్నికల ముందు గందరగోళంగా పరీక్షలు నిర్వహిస్తూ నిరుద్యోగుల కుటుంబాలను అగమ్యగోచరంగా మార్చిందన్నారు. ప్రాణహిత తుమ్మిడి హెట్టి నుండి కాళేశ్వరానికి మార్చిన కేసీఆర్ ఘోరమైన అవినీతి వల్లే ప్రాజెక్టు కుంగిపోయిందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లలో చేసిన అవినీతితో కేసీఆర్ కుటుంబం గిన్నిస్ బుక్ రికార్డ్, ప్రపంచ రికార్డులో నమోదైందని ఎద్దేవా చేశారు. పన్ను రూపంలో తెలంగాణ ప్రజల నుండి లక్షల కోట్లు వసూళ్లు చేసి, వేలల్లో మాత్రమే తెలంగాణకు కేంద్రం ఇస్తుందని మండిపడ్డారు. మేధావులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు ఓటు వేసే ముందు సరైన నాయకుడికి వేసి భవిష్యత్ తరాలకు బంగారు పునాదులు వేయాలని పిలుపునిచ్చారు.